అట్టపెట్టెలో అందం!

New startup glamego - Sakshi

బాక్స్‌లో నెలకు సరిపడే సౌందర్య ఉత్పత్తులు

నెలకు 50 వేల ఆర్డర్లు; ఏడాదిలో రూ.6 కోట్ల వ్యాపారం

జూన్‌ నుంచి విడిగా బ్రాండెడ్‌ ఉత్పత్తుల అమ్మకాలు

వచ్చే ఏడాది పురుషుల సౌందర్య ఉత్పత్తులు కూడా..

ఈ ఏడాది రూ.19 కోట్ల నిధుల సమీకరణ పూర్తి

‘స్టార్టప్‌ డైరీ’తో గ్లామ్‌ఈగో కో–ఫౌండర్‌ లావణ్య సుంకరి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆడవాళ్లతో షాపింగ్‌ మీద బోలెడన్ని జోకులున్నాయి. ఎందుకంటే ఓ పట్టాన వదలరని! అందులోనూ కాస్మెటిక్స్‌ షాపింగ్‌కైతే మరీనూ! తోడు వెళ్లినవాళ్లకు నచ్చితే కొంటారు.. లేకపోతే బ్రాండ్‌ మేనేజర్‌ చెబితే ఓకే చేస్తారు. మహిళగా స్వయంగా ఇవన్నీ చూసే కాబోలు... హైదరాబాదీ అమ్మాయి లావణ్య సుంకరి దీన్నే ఓ వ్యాపార వేదికగా మలచుకుంది. నెలకు సరిపడే ఆయుర్వేద సౌందర్య ఉత్పత్తులను బాక్స్‌లో పెట్టి విక్రయించడం మొదలెట్టింది. నెలకు 500 ఆర్డర్లతో మొదలైన గ్లామ్‌ఈగో ప్రస్థానం.. ఏడాదిలో 50 వేల ఆర్డర్లకు విస్తరించింది. వివరాలు లావణ్య మాటల్లోనే..

ఉస్మానియా వర్సిటీ నుంచి ఎంబీఏలో మార్కెటింగ్‌ చేశాక.. జెట్‌ ఎయిర్‌వేస్‌లో హోస్టెస్‌గా చేరా. అక్కడి నుంచి దుబాయ్, ఐర్లాండ్‌లకు చెందిన రెండు నిర్మాణ సంస్థల్లో పనిచేశా. తర్వాత సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకొని.. కో–ఫౌండర్‌ ప్రభాకర్‌ దారక్‌పల్లితో కలిసి రూ.60 లక్షల పెట్టుబడితో గతేడాది మార్చిలో టీ–హబ్‌ కేంద్రంగా గ్లామ్‌ఈగోను ప్రారంభించాం.

బాక్స్‌లో నెలకు సరిపడే ఉత్పత్తులు..: గ్లామ్‌ఈగో బాక్స్‌ల ఎంపిక పూర్తి శాస్త్రీయంగా జరుగుతుంది. నమోదు చేసుకున్న కస్టమర్‌ను ముందుగా చర్మం రంగు, జుట్టు తీరు, శరీర ఆకృతి వంటి వాటిపై 8 ప్రశ్నలడుగుతాం. వాటి సమాధానాలను బట్టి ఎలాంటి మేకప్‌ కిట్స్‌ నప్పుతాయో ఎంపిక చేసి వాటినే పంపిస్తాం. గ్లామ్‌ఈగో వద్ద నెల, 3 నెలలు, 6 నెలలు, ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ బాక్స్‌లుంటాయి.

వీటి ధరలు వరుసగా నెలకు రూ.399, రూ.329, రూ.299, రూ.289. ఒక్కో బాక్స్‌లో మేకప్‌ కిట్స్, స్కిన్, ఫేస్, బాడీ కేర్‌ ఉత్పత్తులు 4–5 వరకూ ఉంటాయి. అన్నీ ఆయుర్వేదిక్‌ బ్రాండెడ్‌ ఉత్పత్తులే. ఉదాహరణకు అమెరికాకు చెందిన మన్నాకాదర్, రష్యాకు చెందిన స్వేర్‌ సీక్రెట్, ఎంకెఫైన్‌ బ్రాండ్‌లున్నాయి. ప్రతి నెలా బ్రాండ్లు మారుతాయి కూడా. గత ఏడాది కాలంలో 40 బ్రాండ్ల ఉత్పత్తులను వినియోగించాం.

రూ.19 కోట్ల నిధుల సమీకరణ..
హైదరాబాద్‌లోని చిరెక్‌ పబ్లిక్‌ స్కూల్‌ దగ్గర 8 వేల చ.అ.ల్లో గిడ్డంగి ఉంది. త్వరలోనే షాద్‌నగర్‌లో మరో వేర్‌హౌజ్‌ను ప్రారంభిస్తున్నాం. వచ్చే ఏడాది పురుషుల సౌందర్య ఉత్పత్తులను కూడా విక్రయిస్తాం. జూన్‌ నాటికి గ్లామ్‌ఈగోలో ఆయా బ్రాండ్ల ఉత్పత్తులను విడిగా కొనొచ్చుకూడా. ఇందుకోసం ప్రత్యేకంగా ఈ–కామర్స్‌ ప్రారంభిస్తున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 22 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే మరింత మందిని నియమిస్తున్నాం. ఈ ఏడాది చివరికి రూ.19 కోట్లు సమీకరిస్తాం. వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లతో చర్చిస్తున్నాం.

హైదరాబాద్‌ వాటా 18–20 శాతం..
ప్రస్తుతం నెలకు 50 వేల ఆర్డర్లు వస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి 18–20 శాతం వాటా ఉంటుంది. మా కస్టమర్లలో ఎక్కువ 18–34 ఏళ్ల మధ్య వయస్సు వారు.. అందులోనూ కార్పొరేట్‌ మహిళా ఉద్యోగులే. మాకొచ్చే సబ్‌స్క్రిప్షన్లలో 6 నెలల వాటా 50 శాతం వరకుంటుంది. బ్లూడార్ట్, డీటీడీసీ, ఫస్ట్‌ ఫ్లయిట్, డెల్హివెరి వంటి అన్ని ప్రధాన కొరియర్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. 38 వేల పిన్‌కోడ్స్‌లో డెలివరీ అందిస్తున్నాం. ఏడాదిలో రూ.6 కోట్ల వ్యాపారాన్ని చేరాం. వచ్చే ఏడాది ఆర్డర్ల సంఖ్య లక్షకు, వ్యాపారం రూ.18 కోట్లకు చేర్చాలని లకి‡్ష్యంచాం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top