తమ మ్యారేజిని డిజిటల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న లావణ్య – విష్ణు
కవాసేరి గ్రామపంచాయతీలో తమ వివాహాన్ని వీడియో కేవైసీ ద్వారా నమోదు చేసుకున్న నవ దంపతులు లావణ్య, విష్ణు వార్తల్లో నిలిచారు. కేరళలోని డిజిటల్ గవర్నెన్స్ పురోగతికి అద్దం పట్టే సంఘటన ఇది. సంప్రదాయానికి సాంకేతికత కూడా తోడైతే ఎలా ఉంటుందో చెప్పే సంఘటన.
లావణ్య, విష్ణు తమ వివాహ రిజిస్ట్రేషన్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కేరళ ప్రభుత్వం తమ కె–స్మార్ట్ ΄్లాట్‌ఫామ్ ద్వారా డిజిటల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌లకు అవకాశం కల్పించింది. ‘కె–స్మార్ట్’ అనేది ఇన్‌ఫర్‌మేషన్ కేరళ మిషన్(ఐకేఎం) అభివృద్ధి చేసిన ఇన్–హౌజ్ సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఆధార్ ఆధారిత ఓటీపి, ఇమెయిల్ ద్వారా వివాహ గుర్తింపు ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
వివాహం కాగానే ఈ నవదంపతులు డిజిటల్లీ వెరిఫైడ్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సరికొత్త డిజిటల్ ప్రక్రియ దూరాన్ని తగ్గిస్తోంది. కాలాన్ని ఆదా చేస్తోంది. ఈ డిజిటల్ మ్యారేజ్ ట్రెండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకోవడం విశేషం. అత్యధిక సంఖ్యలో వీడియో కేవెసీ రిజిస్ట్రేషన్‌లతో త్రిస్సూర్ ముందంజలో ఉంది. ఆ తరువాత స్థానంలో మలప్పురం, తిరువనంతపురం ఉన్నాయి.


