స్విగ్గీ రూ.7,000 కోట్ల సమీకరణ

Naspers leads $1 billion round in Swiggy - Sakshi

3.3 బిలియన్‌ డాలర్లకు చేరిన విలువ  

బెంగళూరు: ఇటీవల ఆరంభించిన 100 కోట్ల డాలర్ల నిధుల సమీకరణను విజయవంతంగా పూర్తి చేసినట్లు దేశీయ అతిపెద్ద ఫుడ్‌డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. అంటే ఇది మన కరెన్సీలో దాదాపు రూ.7వేల కోట్లు. కంపెనీలో ఇప్పటికే పెట్టుబడులున్న నాస్పర్స్‌తో పాటు ఇతర ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులను సమీకరించినట్లు తెలియజేసింది. ఈ సమీకరణతో కంపెనీ విలువ 3.3 బిలియన్‌ డాలర్లకు చేరినట్లయింది. అంటే దాదాపు రూ.21,200 కోట్లన్న మాట. ఈ ఏడాది ఆరంభంతో పోలిస్తే స్విగ్గీ విలువ ఇప్పటికి దాదాపు ఐదు రెట్లు పెరిగింది. గత ఫిబ్రవరిలో కంపెనీ విలువ 0.7 బిలియన్‌ డాలర్లు కాగా... జూన్‌ నాటికి 1.3 బిలియన్‌ డాలర్లకు చేరింది.

తాజా సమీకరణతో కంపెనీ బోర్డులోకి కొత్తగా టెన్‌సెంట్, హిల్‌హౌస్‌ క్యాపిటల్, వెల్లింగ్‌టన్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు రానున్నాయి. నాస్పర్స్‌తో సహా ఇప్పటికే స్విగ్గీలో పెట్టుబడులున్న డీఎస్‌టీ గ్లోబల్, మేషన్‌ డైయన్‌పింగ్, కోట్‌ మేనేజ్‌మెంట్‌ సైతం తాజా సమీకరణలో నిధులను సమకూర్చాయని స్విగ్గీ తెలిపింది. దేశీ ఫుడ్‌టెక్నాలజీ రంగంలో ఇంతవరకు చేపట్టిన అతిపెద్ద నిధుల సమీకరణ ఇదేనని వెల్లడించింది. తాము పెట్టుబడులు పెట్టినప్పటితో పోలిస్తే ప్రస్తుతం స్విగ్గీ నెలవారీ ఆర్డర్లు పది రెట్లు పెరిగాయని నాస్పర్స్‌ సీఈఓ ల్యారీ చెప్పారు. టైర్‌ 2, 3 నగరాలకు సంస్థ వేగంగా విస్తరిస్తోందన్నారు. 

2018లో మూడు రౌండ్లు 
ఈ ఏడాది మూడు దఫాలుగా స్విగ్గీ దాదాపు 131 కోట్ల డాలర్లను సమీకరించింది. జూన్‌లో కంపెనీ 21 కోట్ల డాలర్లను సమీకరించింది. తాజా సమీకరణలో స్విగ్గీ తొలి ఇన్వెస్టర్లలో కొందరు సెకండరీ షేర్‌ సేల్‌ జరిపారు. తాజా నిధులతో జొమాటో, ఫుడ్‌పాండా లాంటి పోటీదారులను బలంగా ఎదుర్కొనే వీలు కలుగుతుందని కంపెనీ ఆశిస్తోంది. భారత్‌లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్స్‌ పెరుగుతున్నాయని, కొత్త కస్టమర్లను చేరేందుకు, నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు, నైపుణ్య శిక్షణకు, కొత్త విభాగాల్లోకి విస్తరించేందుకు తాజా నిధులు వెచ్చిస్తామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ వద్ద 1.2 లక్షల మంది యాక్టివ్‌ డెలివరీ పార్ట్‌నర్లున్నారు. దేశంలో సుమారు 50 నగరాల్లో సేవలనందిస్తోంది. స్విగ్గీ పోటీ సంస్థ జొమాటో ఈ ఏడాది 41 కోట్ల డాలర్ల నిధులను సేకరించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top