
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? మీరు జొమాటో ద్వారా చేసే ఆర్డర్లపై గతంలో కంటే కాస్త ఎక్కువగా బిల్లు రావడం గమనిస్తున్నారా? అందుకు కంపెనీ వసూలు చేస్తున్న ప్లాట్‌ఫామ్ ఫీజు కారణం. జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజును గతంలో కంటే 20% పెంచింది. సెప్టెంబర్ 2, 2025 నుంచి అన్ని నగరాల్లో ప్రతి ఆర్డర్‌పై ఈ ఫీజును రూ.10 నుంచి రూ.12కు పెంచింది.
డెలివరీ ఫీజులు, పన్నులు, రెస్టారెంట్ ధరలు కాకుండా జొమాటో ప్రత్యేకంగా వసూలు చేస్తున్న ప్లాట్‌ఫామ్ ఫీజును ఏప్రిల్ 2023లో మొదటిసారి ప్రవేశపెట్టింది. అయితే ప్రాథమికంగా ఇది రూ.2గా ఉండేది. క్రమంగా జనవరి 2024లో రూ.4కు, అక్టోబర్ 2024లో ఏకంగా రూ.10, ఇప్పుడు దాన్ని రూ.12కు పెంచేసింది.
ఇప్పుడే పెంపు ఎందుకు?
మార్కెట్ నిపుణులు అంచనాల ప్రకారం.. ఈ సమయంలోనే ప్లాటఫామ్ ఫీజును పెంచేందుకు కారణం లేకపోలేదు. సాధారణంగా ఫుడ్ డెలివరీ వాల్యూమ్స్ గణనీయంగా పెరిగే పండుగ సీజన్‌కు ముందు ధరలు పెంచితే ఆదాయం పెరుగుతుందని భావించి ఉండవచ్చని చెబుతున్నారు. రోజుకు 2.3–2.5 మిలియన్ల ఆర్డర్లు వస్తుండటంతో ఒక్కో ఆర్డర్‌పై రూ.2 పెరిగినా త్రైమాసిక ఆదాయంలో అదనంగా రూ.45 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఈ ఫీజు పెంపుపై జొమాటో ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ..‘ప్లాట్‌ఫామ్ విస్తరణలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో భాగం’ అని తెలిపారు.
Either @zomato thinks that the consumer is stupid or they just don't care anymore. In the past year Iv seen the #PlatformFee increase upto Rs 10 and now its gone up by Rs 2 again bringing it to a total of Rs12. The same order in zomato and @Swiggy has a difference almost Rs 25!! pic.twitter.com/5kemNUZ8Ow
— Tarunima Varma (@ForeverFilmy) September 1, 2025
ఇదే బాటలో స్విగ్గీ..
అధికమవుతున్న నిర్వహణ ఖర్చుల మధ్య లాభాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు ఈమేరకు ప్లాట్‌ఫామ్ ఫీజులు పెంచుతున్నాయి. జొమాటో పోటీ కంపెనీ స్విగ్గీ ఎంపిక చేసిన మార్కెట్లలో ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.14 వరకు విధిస్తుంది.
ఇదీ చదవండి: జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం