ఉపాధి జోష్‌- నాస్‌డాక్‌ రికార్డ్‌

Nasdaq record- Tesla inc zoom- Job market push - Sakshi

లాభాలతో ముగిసిన మార్కెట్లు

నేడు మార్కెట్లకు సెలవు

జూన్‌లో 4.8 మిలియన్‌ ఉద్యోగాలు

సరికొత్త గరిష్టానికి టెస్లా ఇంక్‌

ఈ ఏడాది షేరు 190% ర్యాలీ

గత నెల(జూన్‌)లో ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించడంతో గురువారం యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు బలపడ్డాయి. డోజోన్స్‌ 92 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 25,827 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 14 పాయింట్లు(0.5 శాతం) ఎగసి 3,130 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 53 పాయింట్లు(0.55 శాతం) పురోగమించి 10,208 వద్ద స్థిరపడింది. ఇది సరికొత్త గరిష్టంకాగా..  ఎస్‌అండ్‌పీ వరుసగా నాలుగో రోజు లాభపడింది. అంతకుముందు యూరోపియన్‌ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ 1.4-2.8 శాతం మధ్య ఎగశాయి.  జూన్‌లో 4.8 మిలియన్‌ ఉద్యోగాల కల్పన జరిగినట్లు కార్మిక శాఖ తాజాగా వెల్లడించింది.  విశ్లేషకులు వేసిన అంచనాలకంటే ఇవి 1.8 మిలియన్లు అధికంకావడం గమనార్హం! ఫలితంగా నిరుద్యోగిత 13.3 శాతం నుంచి 11.1 శాతానికి దిగివచ్చింది. దీంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. నేడు యూఎస్‌ మార్కెట్లకు సెలవు.

ప్యాకేజీపై అంచనాలు
జులై 4 బ్రేక్ తదుపరి ప్రభుత్వం లేదా ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి ఆర్థిక వ్యవస్థకు బూస్ట్‌నిచ్చే చర్యలు ప్రకటించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కోవిడ్‌-19 కారణంగా మార్చి- ఏప్రిల్ మధ్య ఏకంగా 22 మిలియన్ల ఉద్యోగాలకు కోత పడటంతో మరోసారి సహాయక ప్యాకేజీలకు వీలున్నట్లు భావిస్తున్నారు. కాగా.. కాలిఫోర్నియా, టెక్సాస్‌, ఫ్లోరిడా, కనెక్టికట్ తదితర ప్రాంతాలలో రెండో దశ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా వచ్చే వారం మార్కెట్లు కొంతమేర ఆటుపోట్లు చవిచూడవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్‌ అండ
బ్లూచిప్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ కార్ప్‌ 0.8 శాతం పుంజుకోవడంతో ఎస్‌అండ్‌పీకి బలమొచ్చింది.  కాగా.. విశ్లేషకుల అంచనాలను మించి రెండో క్వార్టర్‌లో 90,650 వాహనాలను విక్రయించడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్‌ షేరు 8 శాతం జంప్‌ చేసింది. 1209 డాలర్ల వద్ద ముగిసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఏప్రిల్‌-జూన్‌లో కార్ల విక్రయాలు 8 శాతం పెరిగినట్లు కంపెనీ తెలియజేసింది. టెస్లా షేరు ఈ ఏడాది 190 శాతం దూసుకెళ్లడం విశేషం! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top