
న్యూఢిల్లీ: నల్లధనానికి చెక్ చెప్పేందుకు చేపట్టిన పలు పథకాలు సత్ఫలితాలివ్వడంతో మున్ముందు మరిన్ని చర్యలు చేపడతామని అరుణ్ జైట్లీ తెలిపారు. పన్ను ఎగవేత కట్టడి చర్యల్లో భాగంగా గత రెండేళ్లలో రూ.90 వేల కోట్ల అదనపు మొత్తాన్ని వసూలు చేసినట్లు కేంద్ర బడ్జెట్‌లో వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగాన్ని తగ్గించేలా, పన్ను వ్యవస్థను విస్తృతం చేసేలా చేపట్టిన పలు చర్యల్ని జైట్లీ ఉదహరించారు. ‘2016–17, 2017–18లలో ప్రత్యక్ష పన్నుల్లో వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంది.
గతేడాది వృద్ధి రేటు 12.6 శాతంగా ఉంటే.. జనవరి 15, 2018 నాటికి 18.7 శాతం ఉంది’ అని వెల్లడించారు. వ్యక్తిగత ఆదాయç పన్నుల వసూళ్లు పెరిగాయని, 2016–17, 2017–18లలో వ్యక్తిగత ఆదాయపు పన్నుల ఉత్తేజిత(బ్యుయన్సీ) రేటు 1.95, 2.11 గా ఉందని చెప్పారు. అంతకముందు ఏడేళ్ల సరాసరి వ్యక్తిగత ఆదాయపు పన్నుల ఉత్తేజిత రేటు 1.1గా ఉందని వెల్లడించారు. దేశంతో పాటు విదేశాల్లోని నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకు చట్టాల్ని రూపొందించామని గుర్తుచేశారు. పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘నిజాయతీ ఉత్సవం’గా అందరి మన్ననలు అందుకుందని పేర్కొన్నారు.