కరోనా: జీడీపీపై సంచలన అంచనాలు 

Moodys Cuts India GDP Growth Forecast To 2.5 percent In 2020 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారిపై ప్రపంచ దేశాలు యుద్ధాన్ని అప్రతి హతంగా కొనసాగిస్తున్నాయి. ఒకవైపు కరోనా వైరస్‌, మరోవైపు లాక్‌డౌన్ పరిస్థితుల మధ్య ప్రపంచ ఆర్థికవ్యవస్థ  మరింత మాంద్యంలోకి జారిపోతోంది. అనేక కీలక పరిశ్రమలు సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ఈ  ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ రేటింగ్  సంస్థ మూడీస్ సంచలన విషయాన్ని ప్రకటించింది. 2020 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ రేటు 2.5 శాతానికి పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.  విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ భయాల మధ్య మూడీస్ తాజాగా ఈ అంచనాలను వెల్లడించింది. (రుణ గ్రహీతలకు భారీ ఊరట)

రాబోయే రెండు, మూడు త్రైమాసికాలు భారతదేశంలో అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావం చెందనుండడంతో.. జీడీపీ వృద్ధి రేటు అంచనాలలో భారీగా కోత పడనుందని తెలిపింది. భారత జీడీపీ వృద్ధి రేటు మరింత కనిష్టానికి పడిపోనుందని అంచనా వేసింది. ఒక దశలో 8 శాతం పైగా వృద్ధి రేటుతో దూసుకుపోయిన భారత జీడీపీ 2019 లో 5 శాతానికి చేరింది. ఇపుడు  5 శాతం మార్కును అందుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. పారిశ్రామిక రంగంతో పాటు వాహన రంగాలు కుదేలు కావడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. (వచ్చే 3నెలలు ఈఎంఐలు కట్టకపోయినా ఫర్వాలేదు)

మరోవైపు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన  కారణంగా ప్రస్తుత త్రైమాసికంలో జీడీపీ వృద్ధి కేవలం 1 శాతానికి పడిపోతుందని ఐఎన్జీ గ్రూప్, డాయిష్ బ్యాంకు సహా పలువురు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఏప్రిల్-జూన్ నెలల్లో నిజమైన జీడీపీ వృద్ధి కుప్పకూలనుందని, చైనా అనుభవంతో వార్షిక ప్రాతిపదికన 5 శాతం లేదా అంతకంటే దిగువకు చేరుతుందని డాయిష్ బ్యాంక్  చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ దాస్ అంచనా వేశారు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 4.7 శాతం విస్తరించిన ఆర్థిక వ్యవస్థ రానున్న కాలంలో రెండు దశాబ్దాల కనిష్టానికి చేరనుందని సింగపూర్‌ ఐఎన్జీ ఆర్థికవేత్త ప్రకాష్ సక్పాల్  తెలిపారు. ముఖ్యంగా భారతదేశ జీడీపీలో 57 శాతం వాటా ఉన్న ప్రైవేట్ వినియోగం ప్రస్తుత త్రైమాసికంలో దాదాపు సున్నా శాతానికి పడిపోనున్న నేపథ్యంలో జీపీడీ వృద్ధి కేవలం 1 శాతానికి పడిపోతుందన్నారు. (ప్యాకేజీ లాభాలు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top