హైదరాబాద్‌లో మొబైల్స్ తయారీ హబ్ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మొబైల్స్ తయారీ హబ్

Published Wed, Jun 3 2015 3:08 AM

హైదరాబాద్‌లో మొబైల్స్ తయారీ హబ్ - Sakshi

1,000 ఎకరాలిచ్చేందుకు ప్రభుత్వం ఓకే
ప్లాంట్ల ఏర్పాటుకు సెల్‌కాన్, కార్బన్ రెడీ
ఆసక్తి చూపుతున్న మరిన్ని కంపెనీలు

 సాక్షి, హైదరాబాద్/బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీకి హైదరాబాద్ కేంద్రం కానుంది. మొబైల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను పరిశీలించిన ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్(ఐసీఏ) భాగ్యనగరిపై మొగ్గు చూపుతోంది.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి హబ్‌ను ప్రతిపాదించగా దానికి పూర్తి మద్దతిస్తామని  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. అన్నీ అనుకూలిస్తే భారత్‌లో మొబైల్స్ తయారీకి తొలి కేంద్రంగా హైదరాబాద్ నిలువనుంది. హబ్‌లో ప్లాంట్ల ఏర్పాటుకు సెల్‌కాన్, కార్బన్‌తోపాటు చైనాకు చెందిన రెండు మూడు కంపెనీలు ప్రస్తుతం రెడీగా ఉన్నాయి. నెలకు 10 లక్షల మొబైల్స్ తయారీ సామర్థ్యంతో ప్లాంటు నెలకొల్పుతామని సీఎంను కలిసిన అనంతరం సెల్‌కాన్ సీఎండీ వై.గురు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు.
 
ఐసీఏ చొరవతో..
భారత్‌లో మొబైల్స్ తయారీకి హబ్ ఉండాలన్న తలంపుతో కొన్ని నెలలుగా ఐసీఏ తీవ్రంగా యత్నిస్తోంది. ఇందుకు సహకరించాలని పలు రాష్ట్రాలను సంప్రదించింది. మేలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును సైతం కంపెనీల ప్రతినిధులు కలిశారు. మంగళవారం ఇదే విషయమై కేసీఆర్‌ను ఐసీఏ ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ, సెల్‌కాన్ సీఎండీ వై.గురు, ఈడీ మురళి రేతినేని, కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసిజ, ఫాక్స్‌కాన్ ఇండియా ఎండీ జోష్ ఫూల్జే, వాటర్ వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి టోని కలిశారు.

హబ్ వస్తే 2 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు సీఎంకు తెలిపారు. ఐసీఏ ప్రతిపాదనను స్వాగతిస్తూ హైదరాబాద్ ప్రాంత విశిష్టతలను, రానున్న రోజుల్లో తెలంగాణ రూపురేఖలు ఏ విధంగా మారనున్నాయో ఈ సందర్భంగా సీఎం వారికి వివరించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని రాయితీల్ని తామిస్తామని స్పష్టం చేశారు. ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతోనూ ఐసీఏ ప్రతినిధులు చర్చించారు. హబ్ కార్యరూపం దాల్చేందుకు వెన్నంటి ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.
 
భారీ ఆఫర్..
కేంద్ర తయారీ విధానం-2012 ప్రకారం ప్లాంటుపై పెట్టే పెట్టుబడిలో 25 శాతాన్ని కేంద్రం రిఫండ్ చేస్తుంది. జూలైతో ముగియనున్న ఈ స్కీంను కొన్నాళ్లు పొడిగించేలా కేంద్రాన్ని కోరాలని ఐసీఏ ప్రతినిధులు సీఎంకు విన్నవించారు. సీఎం వెంటనే స్పందించి ఈ మేరకు కేంద్రానికి లేఖను పంపాలని అధికారుల్ని కోరారు. హబ్ ఏర్పాటుకు 200 ఎకరాలు అవసరమవుతాయని కంపెనీలు ప్రతిపాదించగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా 1,000 ఎకరాలు కేటాయించేందుకు సీఎం సిద్ధపడ్డారు.

మొబైల్స్‌పై వ్యాట్ విషయంలో నెలకొన్న అస్పష్టతను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లగా 5 శాతానికే పరిమితం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఎం చొరవ భేష్ అంటూ పంకజ్ మొహింద్రూ వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి, మహేశ్వరం, రావిర్యాల్ ప్రాంతాల్లో భూములను కంపెనీల ప్రతినిధులు పరిశీలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement