
డిజిటల్ సేవలకు నిత్యావసర వస్తువు
కేంద్రానికి ఐసీఈఏ సూచన
హైదరాబాద్: అందరికీ నిత్యావసరంగా మారిన మొబైల్ ఫోన్లను 5 శాతం జీఎస్‌టీ శ్లాబు కిందకు తీసుకురావాలని ఇండియా సెల్యులర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) డిమాండ్ చేసింది. మొబైల్ ఫోన్ విడిభాగాలకూ 5 శాతం జీఎస్‌టీని వర్తింపజేయాలని కోరింది. ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్‌టీ రేటును తిరోగమన చర్యగా పేర్కొంది. 90 కోట్ల మంది డిజిటల్ సేవలను పొందేందుకు వీలు కలి్పస్తున్న మొబైల్ ఫోన్లను నిత్యావసరాలుగా పరిగణించాలని కోరింది.
జీఎస్‌టీ శ్లాబులను రెండింటికి తగ్గిస్తూ, కీలక సంస్కరణలను జీఎస్‌టీ కౌన్సిల్‌కు కేంద్రం నివేదించిన నేపథ్యంలో ఐసీఈఏ ఈ విధంగా కోరడం గమనార్హం. ‘‘మొబైల్ ఫోన్ ఇకపై ఆకాంక్ష ఎంత మాత్రం కాదు.
విద్య, ఆరోగ్యం, ఆర్థిక సేవల చేరువ, పరిపాలనకు అవసరమైన తప్పనిసరి డిజిటల్ సాధనం. కనుక ప్రధాని జీఎస్‌టీ సంస్కరణల అజెండా, 500 బిలియన్ ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్ లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని 5 శాతం జీఎస్‌టీ కిందకు మార్చాలి’’అని ఐసీఈఏ చైర్మన్ పకంజ్ మొహింద్రూ కోరారు.
2014–15 నాటికి దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ విలువ రూ.18,900 కోట్లుగా ఉంటే, 2024–25 నాటికి రూ.5,45,000 కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఇందులో ఎగుమతులు రూ.2,00,000 కోట్లుగా ఉన్నాయి. 2020లో మొబైల్ ఫోన్లపై జీఎస్‌టీని 18 శాతానికి పెంచిన తర్వాత దేశీ వినియోగం 30 కోట్ల యూనిట్ల నుంచి 22 కోట్ల యూనిట్లకు తగ్గినట్టు ఐసీఈఏ తెలిపింది.