
సాక్షి, న్యూఢిల్లీ: జర‍్మన్ లగ్జరీ కార్‌మేకర్ మెర్సిడెస్ బెంజ్ కూడా తన వాహనాలపై పెంచుతున్నట్టు గురువారం ఒక ప్రకటనలో ప్రకటించింది. అంతర్జాతీయ రాజకీయ కారణాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం,పెరుగుతున్నఇన్‌పుట్ ఖర్చులు, విదేశీ మారకవిలువ తమపై గణనీయమైన ఒత్తిడిని పెంచిందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలోనే తమ వాహనాలపై 4శాతం మేర ధరల పెంపు నిర్ణయం తీసుకున‍్నట్టు తెలిపింది. పెంచిన ధరలను సెప్టెంబరునుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించింది.
మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రోలాండ్ ఫోల్గర్ మాట్లాడుతూ గత కొద్ది రోజుల్లో రూపాయి విలువ వేగంగా తగ్గుముఖం పట్టిడంతో ధరలను పెంచక తప్పడంలేదని పేర్కొన్నారు. గత ఎనిమిది నెలల్లో యూరోకు వ్యతిరేకంగా రూపాయి 5 శాతం పైగా నష్టపోయింది. కాగా మారుతి సుజుకి ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, హోండా కార్స్ ఇండియా వంటి ఇతర కంపెనీలు ఇప్పటికే ధరల పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే.