మాట్రిమోనీ- 4 రోజుల్లో 49% జూమ్ | Matrimony.com share zooms on FPI stake hike | Sakshi
Sakshi News home page

మాట్రిమోనీ- 4 రోజుల్లో 49% జూమ్

Jul 22 2020 3:18 PM | Updated on Jul 22 2020 3:18 PM

Matrimony.com share zooms on FPI stake hike - Sakshi

కంపెనీలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) వాటాలను పెంచుకున్నట్లు వెల్లడికావడంతో ఇంటర్నెట్ కంపెనీ మాట్రిమోనీ.కామ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో తాజాగా ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికంకావడంతో ఎన్‌ఎస్‌ఈలో రూ. 93 ఎగసి రూ. 559 వద్ద ఫ్రీజయ్యింది. మంగళవారం సైతం ఈ షేరు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన విషయం విదితమే. వెరసి గత నాలుగు రోజుల్లోనే ఈ షేరు 49 శాతం దూసుకెళ్లింది! తద్వారా 2019 జులై 23న సాధించిన చరిత్రాత్మక గరిష్టం రూ. 639కు చేరువైంది. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో కలిపి మిడ్‌సెషన్‌కల్లా 3.52 లక్షల షేర్లు చేతులు మారాయి.

14.74 శాతానికి
కంపెనీలో జూన్‌ చివరికల్లా ఎఫ్‌పీఐల వాటా 14.74 శాతానికి ఎగసింది. మార్చి చివరికల్లా ఎఫ్‌పీఐల వాటా 12.51 శాతంగా నమోదైంది. ఎక్స్ఛేంజీలకు కంపెనీ అందించిన వివరాల ప్రకారం ఏప్రిల్‌-జూన్‌ కాలంలో ఎఫ్‌పీఐల వాటా 2.23 శాతం పెరిగింది. ఆన్‌లైన్‌లో పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేందుకు వీలు కల్పించే ఈ ప్లాట్‌ఫామ్‌ భవిష్యత్‌లో మరింత వృద్ధిని అందుకునే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇటీవల కోవిడ్‌-19 కారణంగా వివాహ వేడుకలు తగ్గడం కంపెనీపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని అంచనా వేశారు. దేశీయంగా ఇంటర్నెట్ వినియోగం వేగంగా విస్తరిస్తుండటంతో భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలు అందుకోనున్నట్లు కంపెనీ యాజమాన్యం ఇటీవల అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement