
మార్కెట్లకు విదేశీ ఇన్వెస్టర్ల షాక్
గత అక్టోబర్ నుంచి పెట్టుబడుల తిరోగమనం..
గరిష్టం నుంచి ఇండెక్సులు 14 శాతం డౌన్
2025లోనూ కొనసాగుతున్న అమ్మకాలు
కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు తెగబడుతుండడంతో మార్కెట్లు పతనబాట పట్టాయి. 2024 అక్టోబర్ లో మొదలైన ఎఫ్‌పీఐల పెట్టుబడుల ఉపసంహరణ నిరవధికంగా సాగుతోంది. దీంతో స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఇండెక్సుల్లో భారీ కరెక్షన్ జరుగుతోంది.. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలు కొత్త గరిష్టస్థాయిల నుంచి భారీగా తగ్గుముఖం పట్టాయి.
సుమారు మూడేళ్లపాటు సాగిన స్టాక్ మార్కెట్ బుల్ పరుగు గత ఏడాది చివరి త్రైమాసికం నుంచి స్పీడు తగ్గింది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెంటిమెంట్ బలహీనపడి మార్కెట్లు లాభాల బాట నుంచి యూటర్న్ తీసుకుని నష్టాల ప్రయాణం మొదలు పెట్టాయి. దీంతో 2024 సెపె్టంబర్ 27న చరిత్రాత్మక గరిష్టాలను తాకిన నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా తగ్గుతూ ఇప్పటివరకూ 14 శాతం పతనమయ్యాయి. బేర్ ట్రెండ్‌వైపు మళ్లాయి!
కారణాలు ఇవీ...
మూడేళ్లుగా అలుపెరుగని లాభాల పరుగు తీసిన నిఫ్టీ, సెన్సెక్స్ ప్రభావంతో లార్జ్ క్యాప్స్‌తోపాటు.. పలు మధ్య, చిన్నతరహా స్టాక్స్ సైతం భారీగా ఎగశాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఖరీదుగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తలెత్తిన ప్రపంచ రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు సెంటిమెంటును బలహీనపరిచాయి. యూఎస్ ప్రెసిడెంట్‌గా రిపబ్లికన్ ట్రంప్ ఎన్నికవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు అధికమయ్యాయి. ట్రంప్ విధానాలపై అంచనాలతో డాలరు బలపడటం, ట్రెజరీ ఈల్డ్స్ మెరుగుపడటం రూపాయినీ దెబ్బతీసింది.
అధికారం చేపట్టాక భారత్‌సహా పలు దేశాలపై ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లకు దిగడం ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. మరోపక్క జీడీపీ వృద్ధికి దన్నుగా చైనా సహాయక ప్యాకేజీలకు ప్రకటించింది. భారత్‌తో పోలిస్తే చౌకగా ట్రేడవుతున్న చైనా స్టాక్స్ విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇవి చాలదన్నట్లు దేశ జీడీపీ వృద్ధి కొంత నెమ్మదించడం, అంచనాలు అందుకోని దేశీ కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు తదితర అంశాలు ఎఫ్‌పీఐలను నిరాశపరచినట్లు వివరించారు. దీంతో ప్రధాన ఇండెక్సులను మించి మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు పతనమవుతున్నట్లు తెలియజేశారు.
నేలచూపుల తీరిదీ
బీఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్ గత సెపె్టంబర్ 27న 85,978 వద్ద స్థిరపడింది. ఇదే రోజు నిఫ్టీ 26,277కు నిలిచింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా.. ఈ స్థాయి నుంచి నిఫ్టీ 3,730 పాయింట్లు(14 శాతం) పతనమైంది. సెన్సెక్స్ 11,376 పాయింట్లు(13 శాతం) కోల్పోయింది. వెరసి గతేడాది అక్టోబర్ నుంచి మార్కెట్లు బేర్ ట్రెండ్‌లో సాగుతున్నాయి. గత అక్టోబర్ మొదలు అమ్మకాలు కొనసాగిస్తున్న ఎఫ్‌పీఐలు కొత్త ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఫలితంగా ఈ జనవరి మొదలు ఇప్పటివరకూ సెన్సెక్స్ 3,537 పాయింట్లు(4.5 శాతం) పడిపోయింది. ఈ బాటలో నిఫ్టీ 1,097 పాయింట్లు(4.6 శాతం) వెనకడుగు వేసింది.
నిపుణుల అంచనాలు
నిజానికి మార్కెట్లలో నెలకొన్న దిద్దుబాటు పలు అంశాల కలయికతో జరుగుతుందని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు. అధిక శాతం బ్లూచిప్ కంపెనీలు అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలిపారు. వీటికితోడు ట్రంప్ టారిఫ్ భయాలు, దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాలు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు కారణమవుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ వివరించారు. దీంతో మార్కెట్లు సాంకేతికంగా బలహీనపడినట్లు చెప్పారు. చైనాతో పోలిస్తే దేశీ మార్కెట్లు ఖరీదుగా ఉండటంతో ఎఫ్‌పీఐలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నట్లు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సీ పేర్కొన్నారు. భారీగా పుంజుకుంటున్న డాలరు, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి క్షీణత, ఖరీదుగా మారిన దేశీ ఈక్విటీలు ఎఫ్‌పీఐల అమ్మకాలకు కారణమనేది విశ్లేషకులు అభిప్రాయం.
భారత్ బేర్
వర్ధమాన మార్కెట్లలో చూస్తే ప్రధానంగా ఆసియా దేశాలలో భారత్ నుంచే ఎఫ్‌పీఐలు అత్యధిక శాతం పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. థాయ్‌లాండ్, దక్షిణ కొరియా, మలేసియా తదితర మార్కెట్లతో పోలిస్తే 2025 తొలి రెండు నెలల్లో దేశీ స్టాక్స్‌లో భారీగా విక్రయాలు చేపట్టారు. ఆసియా దేశాలను పరిగణిస్తే ఫిలిప్పీన్స్‌లో అతితక్కువ అమ్మకాలు నమోదుకాగా.. భారత్‌లో అత్యధిక విక్రయాలకు తెరతీశారు. నిజానికి గత మూడేళ్లలో ఎఫ్‌పీఐలను అత్యధికంగా ఆకట్టుకున్న భారత్ ఇటీవల పలు కారణాలతో పెట్టుబడులను కోల్పోతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఆసియాలో మెటల్స్ ఎగుమతులతో చైనా, ఎల్రక్టానిక్స్‌లో వియత్నాం వంటి దేశాలు ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లను అధికంగా ఎదుర్కోవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ అంశంలో భారత్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ తదితర పలు ఇతర కారణాలతో ఎఫ్‌పీఐలు విక్రయాలకు పాల్పడుతున్నట్లు వివరించారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్