సగానికి పైగా తగ్గిన మారుతి జూన్‌ అమ్మకాలు

Maruti Suzuki reports 54% dip in June sales at 57,428 units - Sakshi

అరశాతం నష్టంతో ముగిసిన షేరు ధర

దేశీయ అతిపెద్ద వాహన దిగ్గజం మారుతి సుజుకీ జూన్‌ అమ్మకాలు సగానికి పైగా తగ్గాయి. ఈ జూన్‌లో మొత్తం 57,428 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే జూన్‌లో అమ్మిన 1,24,708 వాహనాలతో పోలిస్తే ఇది 54శాతం తక్కువ. దేశీయంగా ఈ నెలలో 53,139 వాహన విక్రయాలను జరిపింది. గతేడాది ఇదే నెలలో మొత్తం 1.14లక్షల యూనిట్లను విక్రయించింది. విదేశాలకు 4,289 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది జూన్‌లో ఎగుమతి చేసిన 9,847 మొత్తం వాహనాలతో పోలిస్తే ఇవి 56.4శాతం తక్కువ.

చిన్న తరహా విభాగానికి చెందిన అల్టో, వేగనార్‌ అమ్మకాలు గతేడాది ఇదే జూన్‌లో 18,733 యూనిట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో 44.2 శాతం క్షీణించి 10,458 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే నెలలో కాంపాక్ట్‌ విభాగంలో సిఫ్ట్‌, సెలెరియో, ఇగ్నీస్‌, బాలెనో, డిజైర్ మోడళ్లు 6,696 అమ్ముడుపోయాయి. ఈ జూన్‌లో మధ్య తరహా విభాగానికి చెందిన 553 సెడాన్ సియాజ్‌ కార్లను విక్రయించింది. అంతకు ముందు ఏడాదిలో విక్రయించిన 2,322 యూనిట్లతో పోలిస్తే, ఇది 76.2 శాతం తక్కువ. యూటిలిటీ విభాగానికి చెందిన విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల అమ్మకాలు 45.1 శాతం క్షీణించి 9,764 యూనిట్లుగా నమోదయ్యాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఈ తొలి త్రైసిమాకంలో కంపెనీ 76,599 వాహనాలను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో విక్రయించిన 4,02,594 వాహనాలతో పోలిస్తే ఇది 81శాతం తక్కువ. కరోనా ప్రేరేపిత్‌ లాక్‌డౌన్‌ విధింపు అమ్మకాలను దెబ్బతీసినట్లు కంపెనీ తెలిపింది. ప్లాంట్లలో ఉత్పత్తి క్రమంగా పెరుగుతుందని ఇదే సందర్భంలో తమ ఉద్యోగ సభ్యులందరి ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సు ముఖ్యమని కంపెనీ తెలిపింది.

జూన్‌ వాహన విక్రయాలు సగానికి పైగా క్షీణించడంతో మారుతి సుజుకీ షేరు బుధవారం అరశాతం నష్టంతో రూ.5786.90 వద్ద స్థిరపడింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top