ఫార్మా, ప్రైవేట్‌ బ్యాంకులు బెటర్‌!

Market close higher, private bank, pharma shares rise, RIL chips - Sakshi

ఈ ఏడాది ఒడిదుడుకులే...

పరాగ్‌ పారిఖ్‌ ఫండ్‌ చైర్మన్‌  నీల్‌ పరాగ్‌ అంచనా...

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎన్నికల తరుణం, ముడిచమురు ధరల పెరుగుదల తదితర అంశాల నేపథ్యంలో ఈ ఏడాది స్టాక్‌మార్కెట్లలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చని పరాగ్‌ పారిఖ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజరీ సర్వీసెస్‌(పీపీఎఫ్‌ఏఎస్‌) చైర్మన్‌ నీల్‌ పారిఖ్‌ తెలిపారు. మిyŠ , స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ గణనీయంగా పతనమైనప్పటికీ.. ఇప్పటికీ ఈ విభాగాల్లో కొన్ని మెరుగైన స్టాక్స్‌ కూడా ఉన్నాయని చెప్పారు. రంగాలవారీగా చూస్తే ఫార్మా, ప్రైవేట్‌ బ్యాంకులు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పీపీఎఫ్‌ఏఎస్‌ ఏయూఎం (నిర్వహణలో ఉన్న ఆస్తులు) రూ. 1,150 కోట్లుగా ఉండగా, లిక్విడ్‌ ఫండ్స్‌లో రూ. 85 కోట్లు ఉన్నాయి.  

త్వరలో ఈఎల్‌ఎస్‌ఎస్‌.. 
ప్రస్తుతం ప్రధాన ఫండ్‌తో పాటు లిక్విడ్‌ ఫండ్‌ను కూడా ప్రారంభించామని, త్వరలో ప్రారంభించబోయే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)కి ఇది తోడ్పడగలదని పారిఖ్‌ చెప్పారు. ఫండ్స్‌ వర్గీకరణపై సెబీ నిబంధనల నేపథ్యంలో తమ ఫండ్‌ పేరును మల్టీ క్యాప్‌ ఫండ్‌ కింద మార్చినట్లు, దీనితో ప్రత్యేకంగా ఒక్కో విభాగానికి ఒక్కో ఫండ్‌ అవసరం లేకుండా ఎందులోనైనా ఇన్వెస్ట్‌ చేసేందుకు వెసులుబాటు ఉంటుందని ఆయన తెలిపారు. ‘‘అంతర్జాతీయ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాలు మా ఫండ్‌లో ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో విదేశీ స్టాక్స్‌ వల్ల అవి పెరిగినప్పుడు, ఇటు కరెన్సీ విలువ తగ్గినట్లయితే.. ప్రయోజనం రెండిందాల లభించినట్లవుతుంది. ప్రత్యేకంగా పరిమితులు లేకుండా నాణ్యమైన స్టాక్స్‌ను ఎంచుకోవడమన్నది మా వ్యూహం. దేశీయంగా మారుతీ వేల్యుయేషన్స్‌ కొంత ఎక్కువగా ఉండగా .. మాతృసంస్థ సుజుకీ  తక్కువగానే ఉంది. ఎలాగూ మారుతీ రాబడుల ప్రయోజనాలు సుజుకీకి కూడా లభిస్తాయి కాబట్టి.. ఆ సంస్థ షేర్లను మా పోర్ట్‌ఫోలియోలో చేర్చాం. ఇలాంటి వైవిధ్యమైన కూర్పుతో అందిస్తున్నాం’’ అని పారిఖ్‌ వివరించారు.  

కార్యకలాపాల విస్తరణ.. 
ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో సుమారు వెయ్యి మంది దాకా క్లయింట్స్‌ ఉన్నారని, విస్తరణ ప్రణాళికల్లో భాగంగా బెంగళూరు, న్యూఢిల్లీలో కార్యాలయాలు ప్రారంభించనున్నామని పారిఖ్‌ చెప్పారు. ప్రస్తుతం మొత్తం 25,000 మంది ఇన్వెస్టర్లు ఉండగా, ఈ సంఖ్యను లక్ష దాకా పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. అయితే, రాశి కన్నా వాసికి ప్రాధాన్యమిస్తూ.. ఇన్వెస్టర్ల సంఖ్యను ఎకాయెకిన పెంచుకోవడం కన్నా మెరుగైన సేవల ద్వారా క్రమానుగతంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లను పెంచుకోవడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నామని పారిఖ్‌ పేర్కొన్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top