చివరి గంట.. రికవరీ బాట

Last Hour Recovery Helps D-Street Cut Losses - Sakshi

ముంబై : పాతాళంలోకి జారిపోతున్న రూపాయి, క్రూడ్‌ ఆయిల్‌ ధరల షాక్‌, స్టాక్‌ మార్కెట్లను విపరీతంగా దెబ్బకొట్టింది. నేటి ఇంట్రాడేలో మార్కెట్లు భారీ మొత్తంలో నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా దిగజారింది. కానీ చివరి గంట ట్రేడింగ్‌ మాత్రం మార్కెట్లకు బాగా సాయపడింది. అప్పటి వరకు కొనసాగిన భారీ నష్టాలను చివరి గంట ట్రేడింగ్‌లో కొంత మేర తగ్గాయి. సెన్సెక్స్‌ 250 పాయింట్లు రికవరీ అవగా.. నిఫ్టీ 70 పాయింట్ల నష్టాలను తగ్గించుకుంది. అయినప్పటికీ, మార్కెట్లు నష్టాల్లోనే ముగియడం గమనార్హం. 

ట్రేడింగ్‌ ముగింపు సమయానికి సెన్సెక్స్‌ 140 పాయింట్లు పడిపోయి 38,018 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు క్షీణించి 11,476 వద్ద స్థిరపడ్డాయి. ఆటోమొబైల్‌ కంపెనీలు ర్యాలీ జరపడంతో మార్కెట్లు చివరిలో రికవరీ అయ్యాయి. ఆగస్ట్‌ నెల జేఎల్‌ఆర్‌ విక్రయాలు మంచి వృద్ధిని కనబర్చడంతో, టాటా మోటార్స్‌ షేరు దూసుకెళ్లింది. మెటల్స్‌ కూడా రికవరీ అయ్యాయి. ఫార్మాస్యూటికల్స్‌ ఉదయం, మధ్యాహ్నం ట్రేడింగ్‌లో లాభాలార్జించిన రంగంగా ఉంది. నిఫ్టీ ఫార్మా, మెటల్‌ ఇండెక్స్‌లు ఒక శాతం మేర లాభపడ్డాయి. మరోవైపు రూపాయి విలువ అంతకంతకు కిందకు దిగజారుతూనే ఉంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతుండటంతో, రూపాయి పాతాళంలోకి పడిపోతుంది. దీంతో వాణిజ్య లోటు ఏర్పడి, కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరుగుతుందని ఐడీబీఐ క్యాపిటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఏకే ప్రభాకర్‌ చెప్పారు.  ప్రస్తుతం డాలర్‌ మారకంలో రూపాయి విలువ 26 పైసలు నష్టపోయి 71.83 వద్ద కనిష్ట స్థాయిల్లో నమోదైంది.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top