ఉప్పు.. పప్పు.. ల్యాప్‌టాప్‌!

Laptop Sales Increasing In India Due To Work From Home - Sakshi

ఇక ల్యాప్‌టాప్‌ కూడా నిత్యావసరమే..!

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే కంపెనీల మొగ్గు

రెండింతలు పెరిగిన ల్యాప్‌టాప్‌ల విక్రయాలు

భారీ డిస్కౌంట్లతో తయారీ కంపెనీలు సిద్ధం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19 పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ ఫ్రమ్‌ హోం ప్రాచుర్యం పెరుగుతోంది. లాక్‌డౌన్‌ లేకున్నా... నిబంధనలు సడలిస్తున్నా కూడా కంపెనీలు ఎక్కువ మంది ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయించడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. దీంతో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు కూడా మెల్లగా నిత్యావసరాల జాబితాలోకి చేరిపోతున్నాయి. ఫలితంగా... నిబంధనలు సడలించిన వెంటనే ఈ షాపులకు కస్టమర్ల తాకిడి పెరిగింది. ఐటీ సహా పలు రంగాల్లోని ఉద్యోగులకు ఇళ్లలో కూడా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ తప్పనిసరి అవుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. రానున్న రెండేళ్లూ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు బాగా పెరుగుతాయనేది వారి అంచనా.

15–40 శాతం దాకా డిస్కౌంట్లు 
నిజానికి లాక్‌డౌన్‌కు ముందు ఉత్పత్తులపై ఎలాంటి డిస్కౌంట్లూ లేవు. ఇపుడు మాత్రం పలు కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవటానికి గిఫ్ట్‌ కార్డులు, డిస్కౌంట్లు వంటివి ఇస్తున్నాయి. హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్‌ వంటి కంపెనీలు వ్యక్తిగత కొనుగోలుదార్లకు 15 శాతం దాకా తగ్గింపు ఆఫర్‌ ఇస్తున్నాయి. అలాగే స్క్రాచ్‌కార్డ్‌తో మొబైల్, ట్యాబ్లెట్‌ వంటి బహుమతులను, రూ.50,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను, ఎంపిక చేసిన మోడళ్లపై రూ.8,000 విలువ చేసే యాక్సెసరీస్‌ను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. 25 పైన యూనిట్లు కొనుగోలు చేసే ఇన్‌స్టిట్యూషనల్‌ కస్టమర్లకయితే చాలా కంపెనీలు తమ డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లపై 40 శాతం దాకా... యాక్సెసరీస్‌పై 25 శాతం దాకా డిస్కౌంట్‌ ఇస్తున్నాయి.

మారిన బ్యాంకుల వ్యూహం.. 
వ్యక్తిగత కొనుగోలుదార్ల కోసం గతంలో బ్యాంకులు, రుణ సంస్థలు స్పెషల్‌ స్కీములు ఆఫర్‌ చేసేవి. ఆరు నెలల్లో గనుక తిరిగి తీర్చేసేలా ఉంటే ఎలాంటి వడ్డీ, ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేసేవి కాదు. డౌన్‌ పేమెంట్‌ కూడా ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, 6 శాతం వడ్డీ వసూలు చేస్తున్నామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారి ఒకరు చెప్పారు. ప్రైవేటు బ్యాంకులైతే ప్రాసెసింగ్‌ ఫీజు రూ. 500తో పాటు డౌన్‌ పేమెంట్‌ 35% ఉండాలన్న నిబంధన విధిస్తున్నాయి. దీంతో పూర్తి నగదు చెల్లించి ఉపకరణాన్ని కొనేందుకే ఎక్కువ మంది కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు.

అమ్మకాలు డబుల్‌...
లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే నిబంధనలు సడలించాక అమ్మకాలు రెట్టింపయినట్లు దేశంలోని టాప్‌ సెల్లర్స్‌లో ఒకరైన ఐటీ మాల్‌ ఎండీ మొహమ్మద్‌ అహ్మద్‌ చెప్పారు. ‘‘ఇన్‌స్టిట్యూషనల్‌ సేల్స్‌ కూడా గణనీయంగా పెరిగాయి. విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులు మొదలుపెడితే డిమాండ్‌ అనూహ్యంగా ఉంటుంది. మొత్తం విక్రయాల్లో ల్యాప్‌టాప్‌లు 85%, డెస్క్‌టాప్‌లు 15% వరకు ఉంటున్నాయి. వీటిలో కూడా రూ.35–50 వేల శ్రేణి ల్యాప్‌టాప్‌లు, రూ.25–50 వేల శ్రేణి డెస్క్‌టాప్‌ల సేల్స్‌ ఎక్కువ’’ అని ఆయన చెప్పారు. తయారీ, సరఫరా సమస్యల కారణంగా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ల ధర కంపెనీని బట్టి 5–12% పెరిగినట్లు తెలియజేశారు. ఇక హార్డ్‌ డిస్క్, ర్యామ్, అడాప్టర్ల వంటి యాక్సెసరీస్‌ ధరలు రెట్టింపయ్యాయి. ‘‘అయినా కస్టమర్లు వెనుకాడడం లేదు. సర్వీస్‌ రిక్వెస్టులూ పెరిగాయి’’ అని చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top