ఇటు ఉద్యోగం.. అటు కుటుంబం.. కష్టమే!

Job and family:Coordination between the two, is difficult to achieve balanced - Sakshi

వృత్తి నిపుణుల మనోగతం

ముంబై: ఇటు ఉద్యోగం.. అటు కుటుంబం .. రెండింటి మధ్య సమన్వయం, సమతౌల్యత సాధించడం కష్టంగానే ఉంటోందని దేశీయంగా అత్యధిక శాతం మంది వృత్తి నిపుణులు భావిస్తున్నారు. ఈ రెండింటి మధ్య సమతుల్యత స్థాయి ఒక మోస్తరుగానో లేదా దుర్భరంగానో ఉంటోందని 60 శాతం మంది పేర్కొన్నారు. జాబ్‌ కన్సల్టెన్సీ సంస్థ మాన్‌స్టర్‌డాట్‌కామ్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్థిక సేవలు, నిర్మాణ తదితర రంగాల్లో 18–55 ఏళ్ల వయస్సు గల 2,000 మంది వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌పై ఈ సర్వే నిర్వహించారు.

ఆఫీసు వెలుపల కూడా చాలా సందర్భాల్లో పని గురించే ఆలోచిస్తుండే వారి సంఖ్య 67 శాతంగా ఉంది. ఇక, పని సంబంధ ఒత్తిళ్ల కారణంగా వచ్చే మానసిక అనారోగ్యాల్లో నిద్ర లేమి (17 శాతం), డిప్రెషన్‌ (16 శాతం), చికాకు (9శాతం), హైపర్‌టెన్షన్‌ (4.5 శాతం) ఉండగా.. శారీరక అనారోగ్యాల్లో వెన్ను నొప్పి (15 శాతం), తరచూ తలనొప్పి.. అలసట (14 శాతం), స్థూలకాయం (5 శాతం) సమస్యలు ఉన్నాయి.  

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top