జియోలో పెట్టుబడుల ప్రవాహం: మరో మెగా డీల్

Jio Platforms : Abu Dhabi Mubadala to invest Rs 9094 crore - Sakshi

ఆరు వారాల్లో ఆరు మెగా డీల్స్

మొత్తం పెట్టుబడుల విలువ రూ.87,655 కోట్లు

సాక్షి, ముంబై: పెట్టుబడుల సమీకరణలో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ  ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వరుసగా ఆరోసారి మెగా డీల్  సాధించింది.  జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో భారీ ఒప్పందాన్ని అధికారికంగా అంబానీ ప్రకటించారు.  దీంతో ఈ ఏడాది  ఏప్రిల్ నుంచి  ఇప్పటివరకు ఆరు వారాల్లో ఆరు దిగ్గజ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను సేకరించడం విశేషం. 

ఆర్‌ఐఎల్ టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో అబుదాబికి చెందిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్‌  సంస్థ 1.85 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. దీని విలువ రూ. 9,093.6 కోట్లు. ఈక్విటీ విలువ, రూ. 4.91 లక్షల కోట్లు కాగా ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ. 5.16 లక్షల కోట్లు అని రిలయన్స్  ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో జియో సేకరించిన మొత్తం పెట్టుబడులు విలువ రూ.87,655.35 కోట్లకు  చేరినట్టు ప్రకటించింది. ఆరు భారీ ఒప్పందాల ద్వారా 18.97 శాతం వాటాలను విక్రయించింది. (రిలయన్స్ సామ్రాజ్యంలోకి మరో వారసుడు)

కాగా జియో వాటాల అమ్మకాల ద్వారా రూ. 85వేల నుంచి రూ. 90 వేల కోట్లు సేకరించాలని ఆర్‌ఐఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఏప్రిల్‌ 22న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మొదలు వరుసగా మెగా డీల్స్ ను ప్రకటిస్తోంది. అనంతరం  సిల్వర్‌ లేక్‌,  విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌, జనరల్‌ అట్లాంటిక్‌, కేకేఆర్ , తాజాగా ముబదాలా లాంటి దిగ్గజ సంస్థలు ఈ వరుసలో నిలిచాయి.  (జియోలో కేకేఆర్‌ భారీ పెట్టుబడి)

జియోలో మొత్తం పెట్టుబడుల వివరాలివి..
9.99 శాతం వాటా కొనుగోలుతో ఫేస్‌బుక్  పెట్టుబడులు రూ. 43,574 కోట్లు 
1.15 శాతం వాటాతో  సిల్వర్‌లేక్ పార్ట్‌నర్స్ రూ.5,656 కోట్లు
2.32 శాతం వాటాతో   విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ రూ.11,367 కోట్లు
1.34 శాతం వాటాతో  జనరిక్ అట్లాంటిక్ రూ.6,598 కోట్లు 
2.32 శాతం వాటాతో  కేకేఆర్ రూ.11,367 కోట్లు 
తాజాగా 1.8 5శాతం వాటాతో ముబదాల రూ.9,094 కోట్లు 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top