ఇంద్రా నూయిపై ట్రంప్‌ ప్రశంసలు

Ivanka Trump Praises Indra Nooyi - Sakshi

వాషింగ్టన్‌ : ప్రపంచ పారిశ్రామిక రంగంలో అత్యంత ప్రభావశీలిగా గుర్తింపు పొందిన ఇంద్రా నూయిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక అభివృద్ధి తదితర అంశాలపై చర్చించేందుకు.. ఇంద్రా నూయి, మాస్టర్‌కార్డ్‌ సీఈఓ అజయ్‌ బంగాతో పాటు పలువురు కార్పొరేట్‌ లీడర్లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విందు ఏర్పాటు చేశారు. న్యూజెర్సీలోని ట్రంప్‌ ప్రైవేట్‌ గోల్ఫ్‌క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక, ఆమె భర్త  జెరెడ్‌ ఖుష్నెర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతురాలైన మహిళల్లో ఇంద్రా నూయికి ప్రత్యేక స్థానం ఉందంటూ ట్రంప్‌ ప్రశంసించారు.

‘12 ఏళ్లుగా పెప్సీకో సీఈఓగా పనిచేసిన ఇంద్రా నూయి.. ప్రస్తుతం ఆ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నారు. ఇంద్రా.. నాలాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలకు మీరే స్ఫూర్తి. మీలాంటి గొప్ప వ్యక్తితో స్నేహం చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ దేశ(అమెరికా) ప్రజల కోసం ఇన్నాళ్లుగా ఎంతగానో శ్రమించిన మీకు కృతఙ్ఞతలు’  అంటూ ఇవాంక ట్వీట్‌ చేశారు. కాగా శీతల పానీయాలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ తయారీలో ప్రపంచ రెండో అగ్రగామి సంస్థ, అమెరికాకు చెందిన ‘పెప్సీకో’  సీఈవోగా పనిచేస్తున్న ఇండో-అమెరికన్‌ ఇంద్రా నూయి త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్న విషయం తెలిసిందే.12 ఏళ్ల పాటు కంపెనీకి సారథ్యం వహించిన ఆమె అక్టోబర్‌ 3న తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు.  ఆమె స్థానంలో కంపెనీ ప్రెసిడెంట్‌ రామన్‌ లగుర్తా నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top