పోటాపోటీగా... తగ్గిస్తున్నారు! | Intense competition among dairy companies | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా... తగ్గిస్తున్నారు!

Jul 21 2015 2:41 AM | Updated on Aug 14 2018 4:01 PM

పోటాపోటీగా... తగ్గిస్తున్నారు! - Sakshi

పోటాపోటీగా... తగ్గిస్తున్నారు!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బ్రాండ్ల ప్రవేశంతో పాల కంపెనీల మధ్య పోటీ తారస్థాయికి చేరింది...

పాల కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ
- తగ్గింపు ధరలు, డిస్కౌంట్ ఆఫర్లు...
- ‘నందిని’ రాకతో ముదిరిన పోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బ్రాండ్ల ప్రవేశంతో పాల కంపెనీల మధ్య పోటీ తారస్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా పాల వినియోగం పెరుగుతూ వస్తున్నా... పోటీ కారణంగా కంపెనీలు డిస్కౌంట్ల బాట పడుతున్నాయి. సహకార దిగ్గజం అమూల్ ఇక్కడి మార్కెట్లోకి అడుగుపెట్టడంతో ఆరంభమైన ఈ పోటీ... మరో సహకార బ్రాండ్ ‘నందిని’ రావటం... ఇటీవలే ఆ సంస్థ తన పాల ధరను మరింత తగ్గించటంతో తీవ్రమైంది.
 
కస్టమర్లను ఆకట్టుకోవడానికి పాల కంపెనీలు ఒకదాన్ని మించి ఒకటి డిస్కౌంట్లు, ఆఫర్లతో రంగంలోకి దిగుతున్నాయి. పరాగ్ మిల్క్ ఫుడ్స్ గోవర్దన్ బ్రాండ్ పాలను రూ.40కి విక్రయిస్తోంది. ఒక లీటరు పాలను కొన్న కస్టమర్‌కు రూ.12 విలువ చేసే 200 గ్రాముల పెరుగు ప్యాకెట్‌ను ఇటీవలి వరకు ఉచితంగా ఇచ్చింది. మదర్ డెయిరీ ... లిమిటెడ్ ఆఫర్ కింద లీటరు ప్యాక్‌ను రూ.33కే విక్రయిస్తోంది. జూలై 22 వరకూ ఈ ఆఫర్ ఉంది. కర్ణాటక కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నందిని స్పెషల్ పేరుతో 3.5 శాతం వెన్న కలిగిన పాలను లీటరుకు రూ.34కే అందిస్తోంది. నిజానికి ఈ స్థాయిలో వెన్న ఉన్న పాలను ప్రైవేటు కంపెనీలు రూ.42-44 మధ్య విక్రయిస్తున్నాయని కేఎంఎఫ్ చెబుతోంది.
 
ఇక్కడే ధర ఎక్కువ...
హైదరాబాద్ మార్కెట్లో ప్రయివేటు పాల కంపెనీల ధరలు మరీ ఎక్కువగా ఉన్నట్లు కేఎంఎఫ్ చెబుతోంది. ఇక్కడ దాదాపు 20 బ్రాండ్ల వరకూ ఉన్నా... ధర మాత్రం దేశంలో ఎక్కడా లేనంతగా లీటరుకు రూ.6-10 వరకూ అధికంగా ఉన్నట్లు అమూల్ బ్రాండ్‌తో పాలను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ వెల్లడించింది. పంపిణీ వ్యవస్థ అసమర్థత, దళారుల వల్లే పరిస్థితి ఇలా ఉందని సంస్థ ఎండీ ఆర్.ఎస్.సోధి ఇటీవల చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా కేఎంఎఫ్ మాత్రమే పాల రైతులకు అత్యధికంగా లీటరుకు రూ.27 చెల్లించి సేకరిస్తోంది.

పలు రాష్ట్రాల్లో ప్రైవేటు కంపెనీలు రైతులకు రూ.19 కూడా చెల్లిస్తున్నాయని సంస్థ ఎండీ ఎస్.ఎన్.జయరామ్ ఇటీవల చెప్పారు. ‘దళారి వ్యవస్థ మూలంగా రైతులు నష్టపోతున్నారు. కస్టమర్లు అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. ఇదంతా వ్యవస్థీకృత సేకరణ లేకపోవడం వల్లే జరుగుతోంది’ అన్నారాయన. కేఎంఎఫ్ కర్ణాటకలో లీటరు ప్యాకెట్‌ను రూ.29కే విక్రయిస్తోంది. రవాణా తదితర చార్జీలుంటాయి కనక హైదరాబాద్‌లో రూ.34కు విక్రయిస్తున్నట్లు జయరామ్ తెలిపారు.
 
అమూల్‌తో మొదలు...
హైదరాబాద్‌లో రోజుకు 17 లక్షల లీటర్ల ప్యాకెట్ పాలు అమ్ముడవుతున్నాయి. అమూల్ రాక ముందు వరకు ప్రభుత్వ రంగ సంస్థ విజయ మాత్రమే అతి తక్కువగా లీటరు పాలను రూ.38కి విక్రయించేది. ప్రైవేటు కంపెనీలు రూ.44 వరకు అమ్మేవి. విజయ బ్రాండ్‌ను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో అమూల్ కూడా లీటరు ధరను రూ.38గానే నిర్ణయించింది. ఈ ఏడాది జనవరిలో అమూల్ రావటంతో అప్పటికే పాగావేసిన కంపెనీలకు ఏం చేయాలో పాలుపోలేదు. అన్ని ప్రైవేటు కంపెనీలు పాల ధరను తగ్గించాల్సి వచ్చింది. ఇక నందిని బ్రాండ్ రాకతో వీటికి షాక్ కొట్టినట్టయింది. 2015 మేలో రూ.36 ధరతో రంగంలోకి దిగిన నందిని... ఇటీవల రూ.34 ధరతో స్పెషల్ టోన్డ్ పాలను మార్కెట్లోకి తెచ్చింది. మిగతా కంపెనీలు ఏ మేరకు తగ్గిస్తాయో చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement