భారత్‌ కీలకం..

Indian Market Allowing Google To Develop New Products Says Sundar Pichai - Sakshi

భారీ మార్కెట్‌ కాబట్టి ప్రయోగాలు

కొత్త ఉత్పత్తులకు బాగా తోడ్పాటునిస్తోంది

తరువాత ప్రపంచమంతటా తేవొచ్చు

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచయ్‌

వాషింగ్టన్‌ : టెక్‌ దిగ్గజం గూగుల్‌ కొంగొత్త ఉత్పత్తులు ఆవిష్కరించడంలోనూ, అంతర్జాతీయంగా ఇతర దేశాల్లో వాటిని ప్రవేశపెట్టడంలోనూ భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. పరిమాణం పరంగా భారత్‌ చాలా భారీ మార్కెట్‌ కావడంతో ఇక్కడిలాంటి ప్రయోగాలు చేయటం గూగుల్‌కు సాధ్యమవుతోంది. అమెరికా, ఇండియా వ్యాపార మండలి (యూఎస్‌ఐబీసీ) నిర్వహించిన ‘ఇండియా ఐడియాస్‌’ సదస్సులో పాల్గొన్న సందర్భంగా గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచయ్‌ ఈ విషయాలు చెప్పారు. పాలనను, సామాజిక.. ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చడానికి భారత ప్రభుత్వం టెక్నాలజీని అద్భుతంగా వినియోగించుకుంటోందని ఆయన కితాబిచ్చారు. ఇందులో తాము కూడా భాగస్వాములం కావడం సంతోషదాయకమన్నారు.

‘భారత మార్కెట్‌ భారీ పరిమాణం కారణంగా ముందుగా అక్కడ కొత్త ఉత్పత్తులు, సాధనాలు రూపొందించేందుకు, ఆ తర్వాత ఇతర దేశాల్లో ప్రవేశపెట్టేందుకు మాకు వీలుంటోంది. ముఖ్యంగా గత మూడు, నాలుగేళ్లుగా ఈ ఆసక్తికరమైన ట్రెండ్‌ నడుస్తోంది.  ప్రస్తుతం భారత్‌ క్రమంగా డిజిటల్‌ చెల్లింపుల వైపు మళ్లుతోంది. దీంతో చెల్లింపుల సాధనాలను ప్రవేశపెట్టడానికి భారత్‌ సరైన మార్కెట్‌ అని మేం భావించాం. ఇది నిజంగానే మంచి ఫలితాలు కూడా ఇచ్చింది. ఇలా భారత మార్కెట్‌ కోసం రూపొందించిన సాధనాన్ని ప్రస్తుతం ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి తేవడంపై మా టీమ్‌ కసరత్తు చేస్తోంది‘ అని పిచయ్‌ పేర్కొన్నారు. ఫోన్ల ధరలను తగ్గించి, మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్‌ ప్రయత్నిస్తూనే ఉందన్నారు. 2004లో భారత్‌లో రెండు దేశీ తయారీ సంస్థలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు 200 పైచిలుకు ఉన్నాయని పిచయ్‌ చెప్పారు. మరోవైపు, డేటా ప్రైవసీని కాపాడేందుకు అనుసరించాల్సిన ప్రమాణాల రూపకల్పనలో భారత్, అమెరికా కీలక పాత్ర పోషించగలవని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్‌ వాణిజ్య లావాదేవీలకు సమాచార మార్పిడి స్వేచ్ఛగా జరగడం ప్రధానమని, అయితే అదే సమయంలో యూజర్ల ప్రైవసీకి భంగం కలగకుండా ఉండటం కూడా ముఖ్యమేనని ఆయన పేర్కొన్నారు. సదస్సు సందర్భంగా పిచయ్‌ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ పురస్కారాన్ని అందుకున్నారు.  

భారత్, ఇంగ్లండ్‌ మధ్యే వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌...
ఐసీసీ వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌లో భారత్, ఇంగ్లండ్‌ తలపడే అవకాశాలు ఉన్నాయని పిచయ్‌ జోస్యం చెప్పారు. భారత జట్టు గెలవాలని తాను కోరుకుంటున్నానన్నారు. ‘భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఫైనల్‌ పోరు ఉండొచ్చనుకుంటున్నాను. అయితే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ కూడా మంచి పటిష్టమైన జట్లే. వాటినీ తక్కువగా అంచనా వేయలేం’ అన్నారాయన. క్రీడల్లో తనకు క్రికెట్‌ అంటే మక్కువని తెలిపిన పిచయ్‌.. అమెరికాలో తన క్రికెట్, బేస్‌బాల్‌ ఆటల అనుభవాలు వెల్లడించారు. ‘నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో బేస్‌బాల్‌ ఆడేందుకు ప్రయత్నించాను. అది కాస్త కష్టమైన ఆటే. మొదటి గేమ్‌లో బాల్‌ను గట్టిగా కొట్టా. క్రికెట్‌లో అలా చేస్తే గొప్ప షాట్‌ కాబట్టి.. గొప్పగానే ఆడాననుకున్నా. అందరూ వింతగా చూశారు. అలాగే క్రికెట్‌లో రన్‌ తీసేటప్పుడు బ్యాట్‌ను వెంట పెట్టుకుని పరుగెత్తాలి. ఇందు లోనూ అలాగే చేశాను.. కానీ తర్వాత తెలిసింది.. బేస్‌బాల్‌ అనేది క్రికెట్‌ లాంటిది కాదని. ఏదైతేనేం.. నేను క్రికెట్‌కే కట్టుబడి ఉంటా’ అన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top