ఐదో ఆర్థిక శక్తిగా భారత్‌!

India is the fifth largest economy in the world - Sakshi

త్వరలోనే బ్రిటన్‌ను అధిగమిస్తాం...

ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన

పెట్టుబడుల పురోగతికి చర్యలు..

భారత్‌–దక్షిణాఫ్రికా వ్యాపార సదస్సులో ప్రసంగం 

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశంలో పెట్టుబడుల పురోగతికి నిరంతర చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందనీ ఆయన వివరించారు. ఇండస్ట్రీ చాంబర్‌– సీఐఐ నిర్వహించిన భారత్‌–దక్షిణాఫ్రికా వాణిజ్య సదస్సును ఉద్దేశించి శుక్రవారం  ప్రధాని  ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...
►భారత్‌ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెం దుతున్న ఆర్థిక వ్యవస్థ. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ‘కొత్త భారత్‌’’ను నిర్మించడానికి కట్టుబడి ఉంది. నైపుణ్యత, సాంకేతిక అభివృద్ధికి గట్టి చర్యలు తీసుకుంటోంది.
 
►2.6 ట్రిలియన్‌  డాలర్లతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్‌ తరువాత ఉన్న భారత్‌ త్వరలో ఐదో స్థానానికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. 

►దేశీయ తయారీ రంగానికి ఉత్తేజం కలిగించడానికి కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. అందులో మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా వంటివి ఉన్నాయి. 

►వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధి వ్యవహారాలను పరిశీలించే ఐక్యరాజ్యసమితి సంస్థ– యూఎన్‌సీటీఏడీ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించే దేశాల జాబితాలో భారత్‌ ఉంది. అయితే ఈ విషయంలో మాకు సంతృప్తి లేదు. కీలక రంగాలను రోజువారీగా సమీక్షించి తగిన ఆర్థిక సంస్కరణలను తీసుకురావడానికి నిరంతరం కేంద్రం ప్రయత్నిస్తుంది. 

►అవాంతరాలు లేని వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రపంచబ్యాంక్‌ గత ఏడాది భారత్‌కు 77వ ర్యాంక్‌ ఇచ్చింది. గడచిన నాలుగేళ్లలో భారత్‌ 65 ర్యాంకులు మెరుగుపడిన విషయాన్ని ఇక్కడ గమనించాలి. 

►భారత్‌–దక్షిణాఫ్రికాల మధ్య 2017–2018లో వాణిజ్య పరిమాణం 10 బిలియన్‌ డాలర్లు అయితే, రానున్న కాలంలో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత పటిష్టంచేసుకుని, మెరుగుపరుచుకోడానికి భారత్‌ తగిన చర్యలు తీసుకుంటుంది. ఇందుకు రెండు దేశాలకూ తగిన అవకాశాలూ ఉన్నాయి. 

దక్షిణాఫ్రికాలో 150 భారత్‌ సంస్థలు: రామ్‌పోసా
దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం 150కిపైగా భారత్‌ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామ్‌పోసా పేర్కొన్నారు. వ్యవసాయం, ఐసీటీ, ఎయిరోస్పేస్, ఇంధనం, ఫార్మా, రక్షణ, మౌలిక, మైనింగ్, క్రియేటివ్‌ రంగాల్లో పరస్పరం సహకరించుకోడానికి రెండు దేశాలకూ చక్కటి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్‌లోని వివిధ రంగాల్లో ప్రస్తుతం 29 దక్షిణాఫ్రికా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, మరిన్ని కంపెనీలు దేశంతో కలిసి పనిచేయడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్నాయని రామ్‌పోసా పేర్కొన్నారు. 

ఢిల్లీ–జోహాన్నెస్‌బర్గ్‌ మధ్య విమానసర్వీసులు అవసరం: విక్రమ్‌జిత్‌
రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల పురోగతిపై దక్షిణాఫ్రికా కాన్సుల్‌ జనరల్‌ విక్రమ్‌జిత్‌ సింగ్‌ షహ్నాయ్‌ మాట్లాడుతూ, డీప్‌ మైనింగ్, రత్నాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్, సీడ్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వంటి పలు రంగాల్లో విస్తృత స్థాయి సహకారానికి రెండు దేశాలకూ మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఇరు దేశాల ప్రజల రాకపోకలు పెరగడానికి ఢిల్లీ– జోహానెస్‌బర్గ్‌ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసుల అవసరముందని సూచించారు.  

వృద్ధి కొన్నేళ్లు 7–7.5 శాతం ప్రధాని ఆర్థిక సలహా మండలి
న్యూఢిల్లీ: భారత్‌ వృద్ధి రేటు రానున్న సంవత్సరాల్లో 7–7.5 శాతం శ్రేణిలో ఉంటుందని ప్రధాని ఆర్థిక వ్యవహారాల సలహా మండలి (ఈఏసీ–పీఎం) శుక్రవారం పేర్కొంది. శుక్రవారం సమావేశమైన మండలి వృద్ధి అవకాశాలపై చర్చించింది. కీలక సంస్కరణల ద్వారా వ్యవస్థాగత సవాళ్లను అధిగమించి వృద్ధి రేటును తేలిగ్గా ఒకశాతానికిపైగా పెంచుకోవచ్చని మండలి సూచించింది.  అలాగే సామాజిక రంగ సంస్కరణల కొనసాగింపు కీలకమైన అంశమని వివరించింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం కనబడుతుందని పేర్కొన్న మండలి, ఆయా అంశాలను దేశం జాగ్రత్తగా పరిశీలనలోకి తీసుకోవాలని తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top