60 బిలియన్‌ డాలర్లతో 100 కొత్త విమానాశ్రయాలు!

India To Construct 100 Airports For $60 Billion, Says Suresh Prabhu - Sakshi

వచ్చే 10–15 ఏళ్ల ప్రణాళిక ఇది...

కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు

న్యూఢిల్లీ: రానున్న 10–15 ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తెలియజేశారు. ఇందుకు దాదాపు 60 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4.2 లక్షల కోట్లు) వ్యయం అవుతుందని మంగళవారమిక్కడ ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. గత మూడేళ్లుగా విమాన ప్రయాణికుల డిమాండ్‌ పుంజుకోవడంతో దేశీ విమానయాన రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) 120కి పైగానే ఏరోడ్రోమ్స్‌ను నిర్వహిస్తోంది.  ప్రభుత్వ, ప్రైవేటు రంగ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఎయిర్‌పోర్టులను నిర్మించాలనేది మా వ్యూహం’ అని ప్రభు వివరించారు.  కొత్తగా ఎయిర్‌కార్గో విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించారు.

2037 నాటికి భారత్‌కు సంబంధించి మొత్తం వార్షిక విమాన ప్రయాణికుల సంఖ్య (విదేశీ, దేశీ ప్రయాణికులు) 52 కోట్లకు చేరుతుందని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రావెల్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) అంచనా వేస్తోంది. 2010లో ఈ సంఖ్య 7.9 కోట్లుగా ఉండగా... 2017 నాటికి రెట్టింపు స్థాయిలో 15.8 కోట్లకు పెరిగింది. మరో పదేళ్లలోపే జర్మనీ, జపాన్, స్పెయిన్, బ్రిటన్‌లను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా (ప్రయాణికుల పరంగా) భారత్‌ అవతరించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top