ఐసీఐసీఐ లాభం డౌన్‌

ICICI profit down - Sakshi

క్యూ3లో 27 శాతం తగ్గుదల; రూ.1,894 కోట్లు

తగ్గిన ట్రెజరీ ఆదాయం 

పెరిగిన మొండి బకాయిలు 

10 శాతం రుణ వృద్ధి  

ఐసీఐసీఐ బ్యాంక్‌ చీఫ్‌ చందా కొచర్‌ 

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,894 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో సాధించిన నికర లాభం(రూ.2,611 కోట్లు)తో పోల్చితే 27 శాతం క్షీణత నమోదైందని  ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. ట్రెజరీ ఆదాయం 92 శాతం తగ్గడం, ఇతర ఆదాయం కూడా తగ్గడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ చందా కొచర్‌ చెప్పారు. ట్రెజరీ ఆదాయం 92 శాతం క్షీణించి రూ.66 కోట్లకు పరిమితమైందని, ఫారెక్స్‌ లాభాలు రూ.82 కోట్లే వచ్చాయని వివరించారు.  మొత్తం ఆదాయం మాత్రం రూ.27,876 కోట్ల నుంచి స్వల్పంగా వృద్ధిచెంది రూ.28,501 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇక స్టాండెలోన్‌ ప్రాతిపదికన చూస్తే, నికర లాభం రూ.2,442 కోట్ల నుంచి 32 శాతం క్షీణించి రూ.1,650 కోట్లకు తగ్గిందని తెలిపారు.  
 
వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలున్నాయ్‌... 
నికర వడ్డీ ఆదాయం రూ.5,363 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.5,705 కోట్లకు పెరిగిందని కొచర్‌ పేర్కొన్నారు. నిర్వహణ లాభం 10 శాతం వృద్ధితో రూ.4,992 కోట్లకు పెరిగిందని తెలిపారు. రిటైల్‌ రుణాలు 22 శాతం పెరగడంతో దేశీయ రుణ వృద్ధి 15.6 శాతానికి ఎగసిందని, ఇది ఐదు క్వార్టర్ల గరిష్ట స్థాయి అని వివరించారు. రుణాలు నిలకడగా 10 శాతం చొప్పున వృద్ధి చెందాయని తెలిపారు. రిటైల్‌ రుణాలు 18–20 శాతం రేంజ్‌లో, కార్పొరేట్‌ రుణాలు 10 శాతం మేర వృద్ధి చెందగలవని ఆమె అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచే అవకాశాలున్నాయని చందా కొచర్‌ వ్యాఖ్యానించారు.   

3.14 శాతంగా నికర వడ్డీ మార్జిన్‌.. 
దేశీయ నికర వడ్డీ మార్జిన్‌  3.53 శాతం సాధించామని, మొత్తం మీద నికర వడ్డీ మార్జిన్‌ 3.14 శాతంగా ఉందని చందా కొచర్‌  వివరించారు.  గత క్యూ3లో  7.20 శాతంగా ఉన్న  స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో  7.82 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. నికర మొండి బకాయిలు 3.96 శాతం నుంచి 4.20 శాతానికి పెరిగాయని తెలిపారు. అయితే స్థూల మొండి బకాయిల జాబితాలోకి చేరిన తాజా రుణాలు తొమ్మిది క్వార్టర్ల కనిష్ట స్థాయి, రూ.4,380 కోట్లకు తగ్గాయని వివరించారు. మొండి బకాయిలకు కేటాయింపులు కూడా పెరిగాయని, గత క్యూ3లో రూ.2,713  కోట్లుగా ఉన్న ఈ కేటాయింపులు ఈ క్యూ3లో రూ.3,570 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.  క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన చూస్తే. ఈ క్యూ2లో రూ.44,488 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో రూ.46,039 కోట్లకు పెరిగాయని, నిక మొండి బకాయిలు మాత్రం రూ.24,129 కోట్ల నుంచి రూ.23,810 కోట్లకు తగ్గాయని వివరించారు. కేటాయింపులు క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన తగ్గాయని, ఈ క్యూ2లో రూ.4,503 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.3,570 కోట్లకు తగ్గాయని తెలిపారు.  

ఆర్‌బీఐ రెండో మొండి జాబితాలో తమ బ్యాంక్‌కు చెందిన 18 ఖాతాల రూ.10,000 కోట్ల రుణాలున్నాయని బ్యాంక్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ ఎన్‌ఎస్‌ కన్నన్‌ చెప్పారు. వీటికి రూ.500 కోట్ల మేర కేటాయింపులు జరిపామని వివరించారు. అంతర్జాతీయ రుణాలు 14.5 శాతం క్షీణించాయని పేర్కొన్నారు.  
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్‌ స్వల్ప లాభంతో రూ.353 వద్ద ముగిసింది.     

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top