హెక్సావేర్‌ డీలిస్టింగ్‌- ఎస్‌బీఐ అప్‌

Hexaware tech jumps on delisting proposal - Sakshi

డీలిస్టింగ్‌ ప్రతిపాదనతో అప్పర్‌ సర్క్యూట్‌

క్యూ4 ఫలితాలపై అంచనాలతో ఎస్‌బీఐ ప్లస్‌

ఆరు రోజుల ర్యాలీకి ముందురోజు బ్రేక్‌ పడినప్పటికీ తిరిగి దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్‌ 279 పాయింట్లు ఎగసి 34,259కు చేరగా.. నిఫ్టీ 107 పాయింట్లు జంప్‌చేసి 10,136 వద్ద ట్రేడవుతోంది. కాగా.. విభిన్న సానుకూల వార్తల నేపథ్యంలో ఓవైపు ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌, మరోపక్క ప్రభుత్వం రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

హెక్సావేర్‌ టెక్నాలజీస్‌
స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి కంపెనీను డీలిస్ట్‌ చేసే యోచనలో ఉన్నట్లు వెలువడిన వార్తలు సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌కు జోష్‌నిచ్చాయి. దీంతో ఈ కౌంటర్‌లో అమ్మకందారులు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం రూ. 52 పెరిగి రూ. 311.4 వద్ద ఫ్రీజయ్యింది. హెక్సావేర్‌లో మాతృ సంస్థ హెచ్‌టీ గ్లోబల్‌ ఐటీ సొల్యూషన్స్‌ 62.4 శాతం వాటాను కలిగి ఉంది. తద్వారా 18.63 కోట్ల షేర్లను కలిగి ఉంది. మిగిలిన 37.6 శాతం వాటాకు సమానమైన 11.2 కోట్ల షేర్లను పబ్లిక్‌ నుంచి కొనుగోలు చేసేందుకు ప్రమోటర్లు సన్నాహాలు చేస్తున్నట్లు హెక్సావేర్‌ తాజాగా బీఎస్‌ఈకి వెల్లడించింది. గత 15 రోజుల్లో ఈ షేరు 32 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. 

ఎస్‌బీఐ
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 181 వద్ద ట్రేడవుతోంది. అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా వాటాను విక్రయించిన కారణంగా గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఎస్‌బీఐ ఆకర్షణీయ పనితీరు చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటికితోడు కొన్ని ఖాతాల నుంచి రికవరీ, తగ్గనున్న పన్ను వ్యయాలు వంటివి మెరుగైన ఫలితాలకు సహకరించవచ్చని భావిస్తున్నారు. క్యూ4లో నికర లాభం రూ. 600-1000 కోట్లుగా నమోదుకావచ్చని బ్యాంకింగ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత 15 రోజుల్లో ఎస్‌బీఐ షేరు 17 శాతం పుంజుకోవడం గమనార్హం!
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top