ఇళ్లపై తగ్గనున్న జీఎస్టీ భారం

 GST for under construction homes 3 Percent for affordable housing - Sakshi

రేట్ల తగ్గింపునకు మంత్రుల బృందం సానుకూలత

వచ్చే వారం కౌన్సిల్‌ నిర్ణయం

న్యూఢిల్లీ: నివాసిత గృహాలపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి, అందుబాటు ధరల ఇళ్ల ప్రాజెక్టులపై జీఎస్టీని 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించేందుకు మంత్రుల బృందం తొలి భేటీలోనే సానుకూలత వ్యక్తం చేసింది. గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ అధ్యక్షతన మంత్రుల బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ గత నెలలో ఏర్పాటు చేసింది. జీఎస్టీ విధానంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను పరిశీలించి, పన్ను రేట్లపై సూచనలు చేసే బాధ్యతలు అప్పగించింది. ఈ మంత్రుల బృందం తొలి సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. వారం రోజుల్లోపే నివేదికను సిద్ధం చేసి వచ్చే వారం జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ముందుంచనున్నట్టు ఓ అధికారి తెలిపారు.

పన్ను రేట్లను తగ్గించేందుకు మంత్రుల బృందం సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. నిర్మాణంలో ఉన్న లేదా నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్లాట్లపై (పూర్తయినట్టు ధ్రువీకరణ జారీ చేయని వాటిపై) ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ సదుపాయంతో అమలు చేస్తున్నారు. నిర్మాణం పూర్తయినట్టు ధ్రువీకరణ ఇచ్చిన ఇళ్లపై కొనుగోలుదారుల నుంచి జీఎస్టీని వసూలు చేయడం లేదు. అయితే, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ సదుపాయాన్ని బిల్డర్లు వినియోగదారులకు బదిలీ చేయడం లేదని ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ అంశాలను పరిశీలించి తగిన సూచనలకు గాను జీఎస్టీ కౌన్సిల్‌ జనవరి 10న మంత్రుల బృందాన్ని నియమించింది.

జీఎస్టీ తగ్గిస్తే ఇళ్ల అమ్మకాలు రయ్‌: క్రెడాయ్‌
నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఫ్లాట్లపై జీఎస్టీని తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని రియల్టర్ల సంఘం క్రెడాయ్‌ పేర్కొంది. అధిక జీఎస్టీ రేటు 12 శాతం, 8 శాతం ఉండడంతో ఇళ్ల కొనుగోలును ప్రస్తుతం వాయిదా వేసుకుంటున్నట్టు క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ జక్సేషా తెలిపారు. జీఎస్టీ తగ్గిస్తే కొనడం ప్రారంభిస్తారని అభిప్రాయపడ్డారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top