జీఎస్టీ రిటర్నులు ఇక ఈజీ!

GST returns are easy! - Sakshi

నెలలో ఒక్క రిటర్ను చాలు

ఆరు నెలల్లో కొత్త విధానం

జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో నిర్ణయం

డిజిటల్‌ చెల్లింపులకు ప్రోత్సాహం

ప్రతి లావాదేవీపై గరిష్టంగా రూ.100

చక్కెరపై సెస్సు... నిర్ణయం కమిటీకి!  

న్యూఢిల్లీ: వ్యాపారులకు కాస్తంత భారంగా మారిన జీఎస్టీ రిటర్నుల దాఖలు ఇక సులభం కానుంది. ప్రస్తుతం ప్రతి నెలా ఒకటికి మించి రిటర్నులు దాఖలు చేయాల్సి వస్తుండగా, ఇకపై ఒకే ఒక్క రిటర్న్‌ దాఖలు చేసే విధానాన్ని జీఎస్టీ కౌన్సిల్‌లో ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ 27వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

జీఎస్టీఎన్‌ను ప్రభుత్వ సొంత సంస్థగా మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడంతో చక్కెరపై సెస్సు విధించే ప్రతిపాదన వాయిదా పడింది. డిజిటల్‌ చెల్లింపులకు ప్రోత్సాహం అందించే ప్రతిపాదనను ఐదు రాష్ట్రాల ఆర్థిక మంత్రలు కమిటీకి నివేదించారు.

కాంపోజిషన్‌ డీలర్లు మినహా పన్ను చెల్లింపు దారులు నెలవారీ పలు రిటర్నుల స్థానంలో ఒక్క జీఎస్టీ రిటర్ను దాఖలు చేస్తే సరిపోతుందని సమావేశానంతరం అరుణ్‌ జైట్లీ చెప్పారు. కాంపోజిషన్‌ డీలర్లు మాత్రం ఎటువంటి లావాదేవీలు లేకపోతే మూడు నెలలకు ఒకసారి రిటర్ను వేయొచ్చన్నారు. కొత్త విధానం ఆరు నెలల్లో అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా తెలిపారు. ప్రస్తుతం ఉన్న జీఎస్టీఆర్‌ 3బి, జీఎస్టీఆర్‌ 1 పత్రాలు మరో ఆరు నెలలకు మించి ఉండబోవన్నారు.

డిజిటల్‌ చెల్లింపులు పెంచే యోచన
డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలన్న ప్రతిపాదనపై కౌన్సిల్‌ చర్చించింది. జీఎస్టీలో పన్ను రేటు 3 అంతకంటే ఎక్కువ ఉన్న చోట 2 శాతం తగ్గింపు ఇవ్వాలన్న ప్రతిపాదనకు చాలా రాష్ట్రాలు అంగీకరించాయి. చెక్కు, డిజిటల్‌ విధానంలో చేసే చెల్లింపులకు ఈ ప్రోత్సాహం వర్తిస్తుంది.

గరిష్టంగా రూ.100 వరకే పరిమితి. అయితే, కొన్ని రాష్ట్రాలు ‘ప్రతికూల జాబితా’ ఉండాలని (కొన్ని వస్తువులకు ప్రోత్సాహం వద్దని) డిమాండ్‌ చేశాయి. దీంతో దీన్ని ఐదు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి నివేదిస్తూ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top