
ఢిల్లీ: ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పండగ బొనాంజా ప్రకటించింది. జీఎస్టీ రేట్లు తగ్గింపునకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 12, 28 శాతం శ్లాబులు రద్దు చేయాలని నిర్ణయించింది. 5, 18 శ్లాబులను మాత్రమే కేంద్రం కొనసాగించనుంది. ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులు అమలు కానున్నాయి. లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను విధించింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీ రద్దు చేసింది.
సామాన్యులపై ఆర్థిక భారం పడకుండా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇకపై రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయని ఆమె పేర్కొన్నారు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడిసిన్స్‌పై 12 శాతం జీఎస్టీ తొలగించగా.. సిమెంట్‌పై టాక్స్ 28 నుంచి 18 శాతానికి కుదించాం. క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగించినట్లు నిర్మల పేర్కొన్నారు.
సామాన్యులు వాడే వస్తువులపై జీఎస్టీ తగ్గించామని, రైతులు, సామాన్యులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. వ్యవసాయ, వైద్య రంగాలకు ఊరట కలిగించే నిర్ణయాలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
‘‘ఈజ్ ఆఫ్ లివింగ్ కోసమే న్యూ జనరేషన్ రిఫార్మ్స్. ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణలకు పిలుపునిచ్చారు. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని సంస్కరణలు తెచ్చాం. కొత్త సంస్కరణలకు జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ ఉపయోగించే వస్తువులన్నీ ఐదు శాతం పన్ను పరిధిలోకి తెచ్చాం. పాలు, రోటి, బ్రెడ్‌పై ఎలాంటి పన్ను లేదు. ఏసీ, టీవీ, డిష్ వాషర్లు, చిన్నకారులపై పన్నును 28 నుంచి 18 శాతానికి తగ్గించాం’’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
👉అన్నీ టీవీలపై 18 శాతం జీఎస్టీ
👉వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింపు
👉చాలా ఎరువులపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గింపు
👉చేనేత, మార్బుల్, గ్రానైట్‌పై 5 శాతం జీఎస్టీ
👉33 ఔషధాలపై జీఎస్టీ 12 నుంచి సున్నాకి తగ్గింపు
👉350 సీసీ కంటే తక్కువ వాహనాలపై 18 శాతం జీఎస్టీ
👉350 సీసీ దాటిన వాహనాలపై 40 శాతం పన్ను
👉కార్పొనేటెడ్ కూల్‌డ్రింక్స్, జ్యూస్‌లపై 40 శాతం జీఎస్టీ
👉పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ