మూడో దశకు కరోనా ఔషధ పరీక్షలు

Glenmark Pharmaceuticals Reached 3rd Stage Coronavirus Drug Manufacturing - Sakshi

సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్‌ నియంత్రణ ఔషధ తయారీలో గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ కీలకదశకు చేరుకుంది. కరోనా యాంటివైరల్‌ ట్యాబ్లెట్‌ ఫావిపిరావిర్‌కు మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతులను పొందింది. దీంతో మన దేశంలో ఫేజ్‌–3 అనుమతులు పొందిన తొలి కంపెనీగా గ్లెన్‌మార్క్‌ నిలిచింది. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం దేశంలోని 10 ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుంది. జూలై– ఆగస్టు నెలలో క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలు వస్తాయని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. 

ఫావిపిరావిర్‌ జనరిక్‌ వెర్షనే..:
జపాన్‌కు చెందిన ఫ్యూజిఫిల్మ్‌ కార్పొరేషన్‌ అనుబంధ ఫార్మా కంపెనీ ఫ్యూజిఫిల్మ్‌ తొయోమా కెమికల్‌ కో లిమిటెడ్‌ అభివృద్ధి చేసిన అవిగాన్‌ మందుకు జనరిక్‌ వర్షనే ఈ ఫావిపిరావిర్‌ ట్యాబ్లెట్‌. గ్లెన్‌మార్క్‌కు తొలి దశ పరిశోధనలకు గత నెలలో డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. గ్లెన్‌మార్క్‌ పరిశోధన మరియు అభివృద్ధి బృందం సొంతంగా ఫావిపిరావిర్‌ యాక్టివ్‌ ఫార్మాసూటికల్స్‌ ఇంగ్రీడియంట్స్‌ (ఏపీఐ), ఫార్ములేషన్స్‌ను అభివృద్ధి చేసింది. ఇన్‌ఫ్లూయోంజా వైరస్‌ల మీద ఫావిపిరావిర్‌ సమర్ధవంతంగా పనిచేస్తుంది. నోవల్‌ ఇన్‌ఫ్లూ్యయెంజా వైరస్‌ ఇన్షెక్షన్స్‌ చికిత్స కోసం జపాన్‌లో అనుమతులు కూడా పొందింది. ఈ మాలిక్యూల్‌ను మన దేశంలో కమర్షియల్‌ చేస్తే గనక ఫ్యాబిఫ్లూ బ్రాండ్‌ పేరిట మార్కెట్‌ చేస్తామని కంపెనీ తెలిపింది. 

150 మంది మీద పరిశోధనలు.. 
ఫేజ్‌–3 క్లినికల్‌ ట్రయల్స్‌ 150 మంది కరోనా రోగుల మీద 1:1 నిష్పత్తిలో పరిశోధన ఉంటుంది. చికిత్స వ్యవధి గరిష్టంగా 14 రోజులు, అధ్యయన వ్యవధి గరిష్టంగా 28 రోజులు ఉంటుంది. ‘‘దేశ, విదేశాల్లోని గ్లెన్‌మార్క్‌కు చెందిన పలువురు వైద్య నిపుణులు కరోనా రోగుల మీద ఫావిపిరావిర్‌ పనితీరును గమనిస్తున్నామని, మంచి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ క్లినికల్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్‌ డాక్టర్‌ మోనికా టండన్‌ తెలిపారు. ‘‘క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైతే.. వెంటనే దేశవ్యాప్తంగా ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేస్తామని’’ గ్లెన్‌మార్క్‌ ఇండియా ఫార్ములేషన్స్‌ ప్రెసిడెంట్‌ సుజేష్‌ వాసుదేవన్‌ తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top