టిక్‌టాక్‌కు అమెరికా షాక్‌.. భారీ జరిమానా!

FTC Fined Tiktok App With Huge Amount Over Child Privacy Policy Violation - Sakshi

వాషింగ్టన్‌ : యువతలో బాగా క్రేజ్‌ సంపాదించుకున్న చైనా సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌కు అమెరికా గట్టి షాక్‌ ఇచ్చింది. పదమూడేళ్ల లోపు చిన్నారుల డేటాను అక్రమంగా సేకరిస్తోందన్న కారణంగా టిక్‌టాక్‌ యాజమాన్యానికి ఫెడరల్‌ ట్రేడ్‌ ‍కమిషన్(ఎఫ్‌టీసీ)‌.. 5.7 మిలియన్‌ డాలర్ల(దాదాపు 40. 60 కోట్ల రూపాయలు) భారీ జరిమానా విధించింది. సినిమా డైలాగులు, పాటలకు, భావోద్వేగాలకు అనుగుణంగా వీడియోలు అప్‌లోడ్‌ ద్వారా తమ టాలెంట్‌ను బయటపెట్టేందుకు అవకాశం ఉన్న ఈ యాప్‌ పట్ల... యువతతో పాటు చిన్నారులు, పెద్దలు కూడా ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2018లో కాలిఫోర్నియాకు చెందిన మ్యూజికల్‌.ఎల్‌వై(Musical.ly) అనే మరో యాప్‌ గ్రూపు టిక్‌టాక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే తల్లిదండ్రుల అనుమతి లేకుండా పదమూడేళ్ల లోపు చిన్నారుల ఫొటోలు, పేర్లు తదితర వ్యక్తిగత వివరాలను బహిర్గత పరచడం ద్వారా... టిక్‌టాక్‌ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిందని ఎఫ్‌టీసీ పేర్కొంది. ఈ మేరకు బుధవారం భారీ జరిమానా విధించింది.

వారికి కూడా కనువిప్పు కలగాలి..
‘అమెరికాలో దాదాపు 65 మిలియన్ల మంది టిక్‌టాక్‌ యూజర్లు ఉన్నారు. మోస్ట్‌ పాపులర్‌ యాప్‌ విభాగంలో గూగుల్‌, ఆపిల్‌ డివైస్‌లలో వరుసగా నాలుగు, 25వ స్థానాల్లో ఉందంటే టిక్‌టాక్‌ ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. musical.lyతో ఒప్పందం కుదుర్చుకున్న టిక్‌టాక్‌ను చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో పదమూడేళ్ల లోపు చిన్నారుల వ్యక్తిగత విషయాలు బహిర్గమవుతున్నాయి. ఇది అమెరికా చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది. అందుకే 5.7 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించాం. చిన్నారుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టిక్‌టాక్‌ వంటి మరెన్నో సోషల్‌ మీడియా యాప్‌లకు, సైట్‌లకు ఈ జరిమానా కనువిప్పు కలిగిస్తుందని ఆశిస్తున్నాం’ అని ఎఫ్‌టీసీ చైర్మన్‌ జో సైమన్స్‌ పేర్కొన్నారు.

నిబంధనల మేరకే..
ఎఫ్‌టీసీ నిర్ణయం పట్ల టిక్‌టాక్‌ యాజమాన్యం స్పందించింది. అమెరికా చట్టాలకు అనుగుణంగానే తమ యాప్‌ పనిచేస్తోందని, ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొంది. 13 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు పూర్తి స్థాయిలో యాక్సెస్‌ కల్పించలేదని, తమ యూజర్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరణ ఇచ్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top