రూ.251 ఫోను.. రెండువేల లొసుగులు!! | Sakshi
Sakshi News home page

రూ.251 ఫోను.. రెండువేల లొసుగులు!!

Published Fri, Feb 19 2016 1:14 AM

రూ.251 ఫోను.. రెండువేల లొసుగులు!!

ఉదయం 6 గంటలకే మొరాయించిన వెబ్‌సైట్
30వేల మొబైల్స్‌ను విక్రయించామని చెబుతున్న కంపెనీ
సెకనుకు 6 లక్షల హిట్స్ వచ్చాయన్న సంస్థ
ఈ రేటుతో నష్టమే... ‘వినూత్న’ పద్ధతుల్లో అధిగమిస్తామని వెల్లడి

సాక్షి బిజినెస్ ప్రత్యేక ప్రతినిధి

అత్యాధునిక ఫీచర్లున్న త్రీజీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.251కే విక్రయిస్తానని చెప్పిన రింగింగ్ బెల్స్ సంస్థ తొలిరోజే చేతులెత్తేసింది. గురువారం ఉదయం 6 గంటల నుంచీ తన వెబ్‌సైట్లో వీటిని బుక్ చేసుకోవచ్చని సంస్థ చెప్పటంతో... ఫోనొస్తుందో రాదో అని అనుమానాలున్నా... పోనీ రూ.251 మాత్రమేగా!! అనుకుంటూ లక్షల మంది బుక్ చేయటానికి ప్రయత్నించారు. కాకపోతే మొదట పేరు, చిరునామా వివరాలు నింపిన తరవాత... చివరగా పేమెంట్ బటన్ దగ్గర ప్రెస్ చేయగా... మళ్లీ వివరాలు నింపాలంటూ రావటం అందరికీ పట్టలేని చిరాకు తెప్పించింది.

‘‘నేను 251 సార్లు నా వివరాలు నింపా... 251 సార్లు సబ్మిట్ చేశా. 251 సార్లు పేమెంట్ బటన్ నొక్కా... అయినా బుకింగ్ కాలేదు’’ అని ఒకరు... ‘‘బుక్ చేశా... వీకెండ్‌కు రైలు టికెట్‌ని’’ అని మరొకరు... ఇలా ట్విటర్‌లో మెసేజ్‌లు వెల్లువెత్తాయి. ఇక రింగింగ్‌బెల్స్ సంస్థ మాత్రం... 30వేల బుకింగ్‌లు తీసుకున్నామని, దేశీ యంగా తయారీకి ప్లాంటు పెడతామని, తయారు చేసిన అనంత రం వీరికి డెలివరీ చేస్తామని చెప్పింది. ‘ఎన్‌డీటీవీ’ ఇంటర్వ్యూలో సంస్థ ప్రెసిడెంట్ అశోక్‌కుమార్ చద్దా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సెకనుకు 6 లక్షల హిట్స్ వచ్చాయి. దాన్ని మా సర్వర్లు తట్టుకోలేకపోయాయి. అందుకే 30వేల బుకింగ్‌లే తీసుకోగలిగాం’’ అన్నారాయన. ట్విటర్ సందేశాలు చూసినపుడు మాత్రం ఒక్కరు కూడా తాము ఫోను బుక్ చేసినట్లు పేర్కొనకపోవటం గమనార్హం.

 అంత చీప్‌గా ఎలా ఇస్తామంటే...
రింగింగ్ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్‌కుమార్ చద్దా మాట్లాడుతూ... ఫోను ఖరీదు రూ.2,500 వరకూ అవుతోందని, తమకు దీనిపై నష్టమేనని చెప్పారు. ‘‘మేం భారీగా విక్రయాలు చేయటం ద్వారా, దేశీయంగా తయారు చేయటం ద్వారా, డిస్ట్రిబ్యూషన్‌కు వినూత్న మార్గాలు అనుసరించటం ద్వారా దీన్ని అధిగమిస్తాం’’ అని చెప్పారు. నిజానికి దేశీయంగా తయారు చేయడానికి ఈ సంస్థకు ప్లాంట్లేమీ లేవు. దేశీయంగా ప్రస్తుతం ఏ కంపెనీ సెల్‌ఫోన్ పరికరాలు తయారు చేయటంలేదన్నది కూడా ఇక్కడ గమనార్హం. మరో 24 గంటల్లో మళ్లీ బుకింగ్‌లు మొదలెడతామని పేర్కొంది. బుక్ చేసినవారికి జూన్‌లో డెలివరీ చేస్తామనటం గమనార్హం.

రూ.999కే ఇవ్వలేని డేటావిండ్!
దేశంలో ఇలా చీప్‌గా ఇస్తామని చేసిన ప్రకటనలు ఇప్పటికే ఫెయిలయ్యాయి. 10 డాలర్లలోపు ల్యాప్‌టాప్ తెస్తామని 2008లో ప్రభుత్వం ప్రకటించింది. తీరా అది తయారయ్యేసరికి ధర 100 డాలర్లయింది. ఆ తరువాత 20డాలర్లలోపు ధరకే ఆకాశ్ ట్యాబ్లెట్లు ఇస్తామంటూ డేటావిండ్ ప్రకటించింది. దీనికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా తీసుకుంది. కానీ ఆ సబ్సిడీ డబ్బు, ఇటు బుకింగ్‌ల డబ్బు అన్నీ తీసుకుని చేతులెత్తేసింది. ఇదే డేటావిండ్ సంస్థ... రిలయన్స్‌తో జట్టుకట్టి రూ.999కే స్మార్ట్‌ఫోన్ తెస్తామని గతంలో ప్రకటించింది. ఏడాదైనా ఇది రాలేదు.

మెటీరియల్ ధరే రూ.2,700: ఐసీఏ
నిజానికి ఈ కంపెనీ చెప్పిన స్పెసిఫికేషన్లతో ఫోన్ విక్రయించాలంటే కనీసం రూ.4,000 ధర ఉండాలి. కాకపోతే రూ.251కే ఫోన్ విక్రయిస్తామంటూ... ఆ మోడళ్లను కొన్ని పత్రికలకు కంపెనీ పంపింది. కాకపోతే అవన్నీ వేరే కంపెనీల ఫోన్లు. అదేమంటే.. అసలు ఫోన్ వేరే ఉంటుందని పేర్కొంది. దీన్లో నిజానిజాలను తెలుసుకోకుండానే.. రూ.251కే స్మార్ట్‌ఫోన్ అంటూ మీడియా ఊదరగొట్టేసింది. 3 రోజుల కిందటి వరకూ ఎవ్వరికీ తెలియని ఈ కంపెనీ.. ఒక్కసారిగా హాట్‌టా పిక్ అయిపోయింది.

వందల కోట్ల విలువైన ప్రచారాన్ని ఫ్రీగా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ కంపెనీకి బ్రాండ్ వచ్చింది కనక పెట్టుబడులు రావటంకష్టమేమీ కాదని, ఆ డబ్బుతో ప్లాంటు పెట్టి భవిష్యత్తులో ఖరీదైన ఫోన్లు అమ్మే అవకాశముందని ఓ విశ్లేషకుడు చెప్పారు. ప్రస్తుత బుకింగ్‌లకూ ఫోన్లు డెలివరీ చేయకపోవచ్చని, అసలు బుకింగ్‌లే తీసుకుని ఉండకపోవచ్చని చెప్పారాయన. దీనిపై ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ బుధవారం ప్రభుత్వానికి హెచ్చరిక చేయగా... దాంతో ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ గైర్హాజరయ్యారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కూడా టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను ఐసీఏ కోరింది.

Advertisement
 
Advertisement
 
Advertisement