
ఐటీ ఇండస్ట్రీ గుట్టు బయటపెడతాం!
ఐటీ నిపుణుల ఫోరం ఐటీ రంగంలో నెలకొన్న సమస్యలపై మీడియా సమావేశం నిర్వహించనుంది.
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో నెలకొన్న సమస్యలపై ఐటీ నిపుణుల ఫోరం నేడు మీడియా సమావేశం నిర్వహించనుంది. ఐటీ పరిశ్రమలో అంతర్గతంగా జరుగుతున్న వివిధ అంశాలను బహిర్గతం చేయనున్నామని ఫోరం ఒక ప్రకటనలో తెలిపింది. ఐటీలో భయంకరమైన వాస్తవాలను, కట్టుకథలను వెల్లడించనున్నామని పేర్కొంది. దాదాపు 100 మంది ఐటీ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన బోతున్నారు.
హైటెక్ సిటీలోని ఫోనిక్స్ ఎరినా సమీపంలో సాయంత్రం 4 గంటలకు ఈ ప్రెస్‌మీట్ ప్రారంభంకానుంది. ఐటీ ఇండస్ట్రీలో అసత్యాలు, ఉద్యోగుల అక్రమ తొలగింపులు, ప్యాకేజీ చెల్లింపులు తదితర అంశాల గురించి ఐటీ నిపుణులు మాట్లాడనున్నారు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా వేలాది మంది ఐటీ ఉద్యోగుల అక్రమ తొలగింపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఈ ఫోరం పనిచేస్తోంది. ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం హైకోర్టు, లేబర్ కమిషనర్ తదితర కార్యాలయాల్లో ఇప్పటికే వందలాది పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.