మొబైల్‌ మార్కెట్‌లో 40% వాటా లక్ష్యం: ఫ్లిప్‌కార్ట్‌

Flipkart eyes 40% of India's phone market - Sakshi

అసుస్‌తో భాగస్వామ్యం

23న మార్కెట్‌లోకి ‘జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో’ స్మార్ట్‌ఫోన్‌  

న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ఈ–కామర్స్‌ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్‌’.. మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ విక్రయాల్లో బలమైన వృద్ధి సాధిస్తున్నామని పేర్కొంది. 2020 నాటికి 40 శాతం మార్కెట్‌ వాటాను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపింది. ‘మొబైల్స్‌ 40 బై 20’ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ‘ఇప్పటికే వివిధ హ్యాండ్‌సెట్‌ బ్రాండ్స్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాం.

మొబైల్స్‌ కేటగిరీలో మా ఆధిపత్య స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం’ అని ఫ్లిప్‌కార్ట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ (మొబైల్స్‌ అండ్‌ లార్జ్‌ అప్లయెన్సెస్‌) అజయ్‌ యాదవ్‌ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భారత్‌లో కొనుగోలు చేస్తున్న ప్రతి నాలుగు ఫోన్లలో ఒకటి ఫ్లిప్‌కార్ట్‌ నుంచే ఉంటోదని పేర్కొన్నారు. మొబైల్‌ ఫోన్‌ కేటగిరీలో 60 శాతం వృద్ధిని నమోదు చేశామన్నారు.

అసుస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం
ఫ్లిప్‌కార్ట్‌ తన ‘మొబైల్స్‌ 40బై20’ స్ట్రాటజీలో భాగంగా అసుస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ‘జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో’ స్మార్ట్‌ఫోన్‌ ఏప్రిల్‌ 23న మార్కెట్‌లోకి రానుంది.

అలాగే ఇరు సంస్థలు భారతీయ కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణమైన ప్రొడక్టులను తయారు చేయడానికి సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఇండియన్‌ మార్కెట్‌కు అవసరమైన ప్రొడక్టుల తయారీ, సర్వీసుల ద్వారా అపార వృద్ధి అవకాశాలు అందుకుంటామని అసుస్‌ సీఈవో జెర్రీ షేన్‌ తెలిపారు.  

ఆన్‌లైన్‌ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల్లో 4.2 రెట్లు వృద్ధి
ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి వివిధ పరిశ్రమ సంబంధిత నివేదికలను ఉటంకిస్తూ.. భారత్‌లో  2012లో 7 కోట్ల యూనిట్లుగా ఉన్న ఆఫ్‌లైన్‌ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు 2017 నాటికి 1.2 రెట్లు వృద్ధితో 8.2 కోట్ల యూనిట్లకు చేరాయని పేర్కొన్నారు. అదే సమయంలో ఆన్‌లైన్‌ అమ్మకాలు 4.2 రెట్లు వృద్ధితో కోటి యూనిట్ల నుంచి 4.2 కోట్ల యూనిట్లకు ఎగశాయని తెలిపారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top