తుది ప్యాకేజీ ప్రకటించవచ్చు : ఆర్‌బీఐ డైరెక్టర్

Final Stimulus Package Likely In September October Says RBI Director  - Sakshi

సెప్టెంబర్ లేదా అక్టోబరులో ఫైనల్ ప్యాకేజీ : గురుమూర్తి

ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుంది

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభం నుంచి కోలుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని ఆర్‌బీఐ డైరెక్టర్ గురుమూర్తి అంచనా వేశారు. సెప్టెంబర్ లేదా అక్టోబరులో  తుది ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిన్న (మంగళవారం) భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన వెబ్‌నార్‌లో గురుమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. 

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ మధ్యంతర చర్యగా మాత్రమే భావించ వచ్చని గురుమూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19 అనంతర ఎరాలో చివరి ప్యాకేజీ ప్రకటించే అవకాశముందని చెప్పారు. అమెరికా, యూరోపియన్‌ దేశాలు నగదును ముద్రించుకుంటూ వస్తున్నాయి, కానీ భారతదేశంలో ఈ అవకాశం చాలా తక్కువే అన్నారు. అలాగే దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గురుమూర్తి అన్నారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మే 15 వరకు ప్రభుత్వం జన్‌ధన్‌ ఖాతాల్లో 16 వేల కోట్ల రూపాయలను జమ చేయగా, ఆశ్చర్యకరంగా చాలా స్వల్పంగా కొద్దిమంది మాత్రమే ఈ నగదును ఉపసంహరించు కున్నారని గురుమూర్తి పేర్కొన్నారు. సంక్షోభం తీవ్ర స్థాయిలో లేదనడానికి ఇదే సంకేతమన్నారు. ప్రస్తుతం దేశం భిన్న సమస్యలను ఎదుర్కొంటోందని గురుమూర్తి వెల్లడించారు. కరోనా అనంతరం ప్రపంచం బహుళ ఒప్పందాల నుంచి ద్వైపాక్షిక ఒప్పందాల వైపు మళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ కూడా శరవేగంగా కోలుకుంటుందని ఆయన తెలిపారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top