3.4% తగ్గిన ఎస్కార్ట్స్‌ విక్రయాలు

Escorts reports 3.4 pc fall in tractor sales - Sakshi

దేశీయంగా వ్యవసాయ పనులకు ఇంజనీరింగ్‌, పరికరాలనందించే ప్రముఖ కంపెనీ ఎస్కార్ట్స్‌ విక్రయాలు 3.4 శాతం తగ్గాయని సోమవారం ప్రకటించింది. లాక్‌డౌన్‌ కారణంగా మే నెలలో ట్రాక్టర్‌ విక్రయాలు 3.4 శాతం క్షీణించి 6,594 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. గత ఏడాది మేనెలలో 6,827 యూనిట్ల విక్రయాలు జరిపినట్లు బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. గతేడాది మేనెలలో ట్రాక్టర్ల అమ్మకాలు దేశీయంగా 6,488 యూనిట్లు ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య తగ్గి 6,454 యూనిట్లకు చేరింది. ఎగుమతులు 58.7శాతం తగ్గి గతేడాది నమోదైన విక్రయాలు 339 యూనిట్ల నుంచి  140 యూనిట్లకు పడిపోయిందని కంపెనీ వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ట్రాక్టర్ల అమ్మకాలు పుంజుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సకాలంలో రుతుపవనాలు రావడం వల్ల వ్యయసాయ పనులు మొదలవడంతో ట్రాక్టర్ల విక్రయాలు పెరుగుతాయని ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వెల్లడించింది. కాగా స్టాక్‌ మార్కెట్లో గత నాలుగురోజులుగా ఈ కంపెనీ షేర్లు జోరుగా ర్యాలీచేసి 32 శాతం పెరిగాయి. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఎస్కార్ట్స్‌ కంపెనీ షేరు 7.3 శాతం లాభపడి రూ.968.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Related Tweets
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top