వచ్చే నెల నుంచి స్టాక్ మార్కెట్లో ఈపీఎఫ్‌ఓ పెట్టుబడి


 న్యూఢిల్లీ : ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) వచ్చే నెల నుంచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించనుంది. వచ్చే నెల ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో(ఈటీఎఫ్) ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తామని ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్  కమిషనర్ కె.కె.జలాన్ చెప్పారు. తమ ఇంక్రిమెంటల్ డిపాజిట్లలో 5 శాతం వరకూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరలో  ఇంక్రిమెంటల్ డిపాజిట్లు రూ.లక్ష కోట్లు వస్తాయని అంచనాలున్నాయని, వీటిల్లో 5 శాతం అంటే రూ.5,000 కోట్ల వరకూ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తామని తెలియజేశారు.



ఈపీఎఫ్‌ఓకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) ఈ ఏడాది మార్చి 31న స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి నిర్ణయం తీసుకుంది. దీన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించినా... ఈటీఎఫ్‌లో కనిష్టంగా 5 శాతంగా గరిష్టంగా 15 శాతం ఈపీఎఫ్‌ఓ ఇన్వెస్ట్ చేయవచ్చంటూ కార్మిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 23న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని అనుసరించి ఈ ఆర్థిక సంవత్సరంలో 5 శాతం నిధులను ఇన్వెస్ట్ చేయాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణయించింది.



ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు పెట్టాలనుకున్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్... పెట్టుబడులు పెట్టేనాటికి రూ.5,000 కోట్ల కంటే తక్కువగా ఉండకూడదు. ఈపీఎఫ్‌ఓ ఇన్వెస్ట్‌మెంట్ నిబంధన ప్రకారం... మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే లిస్టెడ్ కంపెనీల్లో 65 శాతం వరకూ ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఈపీఎఫ్‌ఓ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.



 ప్రైవేట్ పీఎఫ్ ట్రస్ట్‌లు కూడా...

 ప్రైవేట్ ప్రావిడెండ్ ఫండ్ ట్రస్ట్‌లు కూడా స్టాక్‌మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కార్మిక మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ప్రైవేట్ పీఎఫ్ ట్రస్ట్‌లు 15 శాతం వరకూ పెట్టుబడులు పెట్టవచ్చని పేర్కొంది. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ నియంత్రణలో 3,000కు పైగా ఇలాంటి ప్రైవేట్ పీఎఫ్ ట్రస్ట్‌లు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కనిష్టంగా 5 శాతం, గరిష్టంగా 15 శాతం వరకూ స్టాక్‌మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top