రిటైర్‌మెంట్‌ ఫండ్‌ సంస్థకు ‘ఈటీఎఫ్‌’ బొనాంజా

EPFO investments value rises to Rs 2. 26 lakh cr in ETF during FY22 - Sakshi

మార్చి వరకూ పెట్టుబడుల పరిమాణం రూ.1,59,299 కోట్లు

ప్రస్తుతం దీని మార్కెట్‌ విలువ రూ.2,26,919 కోట్లు

పార్లమెంటులో కేంద్రం వెల్లడి  

న్యూఢిల్లీ: ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) నుంచి రిటైర్మెంట్‌ ఫండ్‌ సంస్థ– ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) భారీ బొనాంజా పొందుతోంది.  కార్మిక, ఉపాధి వ్యవహారాల శాఖ మంత్రి రామేశ్వర్‌ తెలి వెల్లడించిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

► మార్చి 2022 వరకు ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లో ఈపీఎఫ్‌ఓ రూ. 1,59,299.46 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడుల ప్రస్తుత (నోషనల్‌) మార్కెట్‌ విలువ రూ. 2,26,919.18 కోట్లు. 2019–20లో రూ.31,501 కోట్లు, 2020–21లో రూ.32,071 కోట్లు, 2021–22లో రూ.43,568 కోట్లు ఈటీఎఫ్‌లలోకి ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు వెళ్లాయి. 

► ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ మధ్య ఈటీఎఫ్‌ల్లో ఈపీఎఫ్‌ఓ పెట్టుబడి విలువ రూ.12,199.26 కోట్లు. ఇదే కాలంలో డెట్‌ ఇన్‌స్ట్రమెంట్లలోకి వెళ్లిన మొత్తం పెట్టుబడి విలువ రూ.84,477.67 కోట్లు

► నిఫ్టీ 50, సెన్సెక్స్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈ), భారత్‌ 22 సూచీల ఆధారంగా ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టడం జరిగింది.  

15 శాతం వరకే పెట్టుబడులు పరిమితి...
ఈపీఎఫ్‌ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్‌ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్,  బీమా ప్రయోజనాలను అందిస్తుంది.

ఈపీఎఫ్‌ఓ దాదాపు 6 కోట్ల  మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో దాదాపు రూ.300 కోట్ల మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఇటీవలే కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్‌ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. 

డెట్‌ ఇన్వెస్ట్మెంట్‌ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్‌ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్‌ఓ ప్రారంభించింది. ప్రారంభంలో ఈపీఎఫ్‌ఓ తన పెట్టుబడి పరిమితుల్లో 5 శాతం స్టాక్‌ మార్కెట్లలో పెట్టాలని నిర్ణయించుకుంది. తరువాత ఈ నిష్పత్తిని 2016–17లో 10 శాతానికి పెంచడం జరిగింది. 2017–18లో 15 శాతానికి పెంచారు. డెట్‌ ఇన్‌స్ట్రమెంట్లలో 85 శాతం నిధులను పెట్టుబడులుగా పెట్టే అవకాశం ఉంది. (క్లిక్: ఇన్‌కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top