ఆన్‌లైన్‌ కిరాణా.. నువ్వానేనా!

ఆన్‌లైన్‌ కిరాణా.. నువ్వానేనా! - Sakshi

మార్కెట్‌లో పట్టు కోసం ఈ కామర్స్‌ సంస్థల పెట్టుబడి అస్త్రాలు
►  గ్రోఫర్స్‌లో వాటాపై అమెజాన్‌ ఆసక్తి
► ఎంట్రీ ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సన్నద్ధం
► అండగా సాఫ్ట్‌ బ్యాంకు నిధులు
► ఇప్పటికే బిగ్‌ బాస్కెట్‌లోకి పేటీఎం ఎంట్రీ

న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ సంస్థలు ఆన్‌లైన్‌ గ్రోసరీ మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. భారీ మార్కెట్‌ అవకాశాల నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎంలు ఈ విభాగంలో పట్టు కోసం వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గ్రోఫర్స్‌లో మైనారిటీ వాటా పొందేందుకు ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఆసక్తితో ఉంది. ఆన్‌లైన్‌ గ్రోసరీ సంస్థ బిగ్‌బాస్కెట్‌లో వాటా తీసుకోవాలని అమేజాన్‌ ప్రయత్నించినప్పటికీ చర్చలు సఫలీకృతం కాలేదు. దీంతో సాఫ్ట్‌బ్యాంకు మద్దతు గల గ్రోఫర్స్‌లో వాటా తీసుకునే యోచనతో అమెజాన్‌ ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు బిగ్‌ బాస్కెట్‌లో చైనాకు చెందిన అలీబాబా గ్రూపు ఏకంగా 200 మిలియన్‌ డాలర్ల (రూ.1,280 కోట్లు)ను పేటీఎం మాల్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

అమేజాన్‌ నుంచి తాజా పెట్టుబడులు వస్తే గ్రోసరీ మార్కెట్లో పోటీ మరింత పెరగనుంది. గ్రోఫర్స్‌లో ఇన్వెస్టర్లు అయిన జపాన్‌ సాఫ్ట్‌ బ్యాంకు, టైగర్‌ గ్లోబల్‌ ఆశ్చర్యంగా ఫ్లిప్‌కార్ట్‌ లోనూ ఇన్వెస్ట్‌ చేసి ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లోకి ఇటీవలే సాఫ్ట్‌బ్యాంకు 2.5 బిలియన డాలర్ల (రూ.16,000 కోట్లు)ను విజన్‌ ఫండ్‌ ద్వారా పంప్‌ చేసింది. ఈ నిధుల ప్రోత్సాహంతో దేశీయ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సైతం ఆన్‌లైన్‌ గ్రోసరీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, గ్రోఫర్స్‌ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం అయ్యే అవకాశాలున్నాయంటూ ప్రచారం కూడా నడుస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో గ్రోఫర్స్‌లోకి ఫ్లిప్‌కార్ట్‌ ప్రవేశాన్ని అడ్డుకునేందుకు అమెజాన్‌ 100 మిలియన్‌ డాలర్లు (రూ.690 కోట్లు) మేర ఇన్వెస్ట్‌ చేసే వ్యూహంతో ఉందని తెలుస్తోంది. కాగా, గ్రోఫర్స్‌లో వాటాల విషయమై గతంలో ఆ సంస్థతో పేటీఎం సైతం చర్చలు నిర్వహించింది. కానీ, ముందడుగు పడలేదు.

ఊరిస్తున్న భారీ అవకాశాలు...
మన దేశంలో మొత్తం మీద గ్రోసరీ, ఆహార (ప్యాకేజ్డ్‌ ఆహార ఉత్పత్తులు సైతం) మార్కెట్‌ 400 బిలియన్‌ డాలర్లు (రూ.25.60లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. ఇందులో వ్యవస్థీకృత రిటైలర్ల వాటా 5 శాతంగానే ఉందని కన్సల్టెన్సీ సంస్థ టెక్నోప్యాక్‌ అధ్యయనం ఆధారంగా తెలుస్తోంది. అంటే ఈ విభాగం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నట్టు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. బిగ్‌ బాస్కెట్‌ 2017లో రూ.1,400 కోట్ల అమ్మకాలను సాధించగా, గ్రోఫర్స్‌ సైతం ఇటీవలే తాము నెలవారీ విక్రయాలు రూ.65 కోట్లకు చేరినట్టు వెల్లడించింది. వార్షిక విక్రయాలు రూ.760 కోట్లుగా ఉండొచ్చని పేర్కొంది.

బిగ్‌ బాస్కెట్‌ 16–18 శాతం మార్జిన్‌తో, గ్రోఫర్స్‌ 12 శాతం మార్జిన్‌తో నడుస్తున్నాయి. గ్రోసరీ విభాగంలో అమెజాన్‌ నౌ, అమెజాన్‌ ప్యాంట్రీ పేరుతో గత రెండేళ్లుగా కార్యకలాపాలు నడుపుతోంది.  2015లో గ్రోఫర్స్‌ సంస్థ గ్రోసరీలో హైపర్‌ లోకల్‌ విధానంలో కార్యకలాపాలను ప్రారంభించగా, భారీ మార్కెట్‌ అవకాశాలున్నాయనే అంచనాలతో ఈ సంస్థలోకి పెట్టుబడులు వచ్చి పడ్డాయి. గతేడాది దీపావళి సమయంలో అమెజాన్‌ ఈ మార్కెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లింది. రెట్టింపు అమ్మకాలు నిర్వహించింది.

అంతకు కొన్ని నెలల ముందే ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ మొదలు పెట్టడంతో చందాదారులు అన్ని రకాల వస్తువుల కొనుగోలుకు ముందుకు వచ్చారు. దీంతో అధిక విక్రయాలు సాధ్యమయ్యాయి. ప్రైమ్‌ సభ్యులకు ప్రత్యేక డిస్కౌంట్లతో పాటు ఉచిత షిప్పింగ్‌ను అమెజాన్‌ ఆఫర్‌ చేస్తోంది. ఇప్పుడు బిగ్‌ బాస్కెట్‌లోకి పేటీఎం ఎంట్రీ, సాఫ్ట్‌బ్యాంకు ఫండింగ్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సైతం ఈ మార్కెట్‌ అవకాశాలను చేజిక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. వీటికితోడు అమెజాన్‌ తాజా ప్రణాళికలతో మున్ముందు ఈ గ్రోసరీ మార్కెట్‌ మరింత పోటీని సంతరించుకోనుందని పరిశీలకులు భావిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top