లాభాల మార్కెట్లో డీమార్ట్‌ బేజార్‌

Dmart share plunges despite positive market - Sakshi

5 శాతం పతనమైన షేరు

అమ్మకాలపై కోవిడ్‌-19 ఎఫెక్ట్‌

ఈపీఎస్‌ అంచనాల తగ్గింపు

సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ

యూరోపియన్‌, ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో గ్యాపప్‌తో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ఉదయం 10.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ చేసింది. 315 పాయింట్లు జంప్‌చేసి 30,988కు చేరింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 31,000 మార్క్‌ను అధిగమించింది. ఇక నిఫ్టీ సైతం 90 పాయింట్లు ఎగసి 9129 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ డీమార్ట్‌ స్టోర్ల నిర్వాహక కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి లాభాల మార్కెట్లోనూ నష్టాలతో నేలచూపులకు పరిమితమై కదులుతోంది. వివరాలు చూద్దాం..

నేలచూపులతో
డీమార్ట్‌ స్టోర్ల మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం పతనమైంది. రూ. 2284 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2278 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. దేశవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్న కోవిడ్‌-19 కట్టడికి లాక్‌డవున్‌తోపాటు.. సామాజిక దూరాన్ని అమలు చేస్తుండటంతో రెండు నెలలుగా రిటైల్‌ స్టోర్లలో అమ్మకాలు క్షీణించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. స్టోర్ల నిర్వహణ, బిజినెస్‌ నిర్వహణపై ఆంక్షలు తదితర సవాళ్లు ఇందుకు కారణమవుతున్నట్లు తెలియజేశాయి. దీంతో ఇప్పటికే గతేడాది(2019-20) చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో డీమార్ట్‌ ఫలితాలు అంచనాల దిగువన వెలువడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 2017 మార్చిలో లిస్టయ్యాక కంపెనీ తొలిసారి ఒక త్రైమాసికంలో అంచనాలను అందుకోలేకపోయినట్లు వివరించారు. కాగా.. లాక్‌డవున్‌ కొనసాగింపు, అత్యవసరంకాని సరుకుల అమ్మకాలపై ఆంక్షలు, ఈకామర్స్‌ బిజినెస్‌కు పెరుగుతున్న డిమాండ్‌ వంటి అంశాల నేపథ్యంలో పలు బ్రోకింగ్‌ సంస్థలు ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ఆర్జనపై అంచనాలు తగ్గిస్తున్నాయి. వెరసి రెండేళ్ల కాలంలో ఈపీఎస్‌ అంచనాలలో కోతలు పెట్టాయి.

ఈపీఎస్‌ అంచనాల తగ్గింపు
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో డీమార్ట్‌ ఈపీఎస్‌ అంచనాలను 16.8 శాతం తగ్గిస్తున్నట్లు ప్రభుదాస్‌ లీలాధర్‌ పేర్కొంది. ఇక వచ్చే ఏడాది(2021-22) ఈపీఎస్‌లో 8.1 శాతం కోత పెడుతున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాలు 17 శాతంమేర తగ్గవచ్చంటూ మోతీలాల్‌ ఓస్వాల్‌ అభిప్రాయపడింది. అయితే పటిష్ట బ్యాలన్స్‌ షీట్‌, బిజినెస్‌ మోడల్‌ కారణంగా ప్రస్తుత సవాళ్ల నుంచి కంపెనీ రికవర్‌కాగలదని పేర్కొంది. వెరసి వచ్చే ఏడాది నుంచి డీమార్ట్‌ పుంజుకోగలదని అభిప్రాయపడింది. ఇక డీమార్ట్‌ కౌంటర్‌కు ఇటీవల క్రెడిట్‌ స్వీస్‌, జేపీ మోర్గాన్‌ న్యూట్రల్‌ రేటింగ్‌ను ప్రకటించగా.. ప్రభుదాస్‌ లీలాధర్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఐడీబీఐ కేపిటల్‌ పొజిషన్లను తగ్గించుకోమంటూ సిఫారసు చేశాయి. ఎడిల్‌వీజ్‌, జేఎం ఫైనాన్షియల్‌ ఈ షేరుని హోల్డ్‌ చేయమంటూ సూచించిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top