భారత్ భవిత బంగారం! | Sakshi
Sakshi News home page

భారత్ భవిత బంగారం!

Published Tue, May 20 2014 1:29 AM

భారత్ భవిత బంగారం! - Sakshi

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం భారత్ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని విశ్లేషణా సంస్థలు అంచనా వేస్తున్నాయి.  దేశం ఆర్థిక సవాళ్లను అధిగమించవచ్చని రేటింగ్ సంస్థ మూడీస్ సోమవారం పేర్కొంది. వచ్చే రెండేళ్లలో దేశాభివృద్ధి 6.8 శాతం ఉంటుందని బ్యాంకింగ్ సేవల దిగ్గజ సంస్థ తాజాగా మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. ఈ మేరకు ఆయా సంస్థలు విడుదల చేసిన విశ్లేషణా పత్రాలను వేర్వేరుగా పరిశీలిస్తే-

 క్రెడిట్ పాజిటివ్: మూడీస్
 ఎన్నికల ఫలితాలు సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తుందని మూడీస్ పేర్కొంది. స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ఈ పరిణామం దోహదపడే అవకాశాలు ఉన్నాయని మూడీస్ వివరించింది. ఇది భారత్‌కు ‘క్రెడిట్ పాజిటివ్’అని సంస్థ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ప్రస్తుతం దేశానికి మూడీస్ ‘బీఏఏ3’ రేటింగ్ ఉంది. స్టేబుల్ అవుట్‌లుక్‌తో కొంత క్రెడిట్ రిస్క్ ఉన్నట్లు ఈ రేటింగ్ సూచిస్తుంది. అటు ప్రభుత్వానికి, ఇటు కార్పొరేట్ రంగానికి  ఈ విజయం క్రెడిట్ పాజిటివ్ అని వివరించింది. బ్యాంకింగ్ రంగానికి సైతం ఇది శుభసూచకమని అభిప్రాయపడింది.

 చిదంబరం తన తాత్కాలిక బడ్జెట్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేటాయించిన మూలధన పెట్టుబడులను మోడీ సర్కారు పెంచవచ్చని విశ్లేషించింది. ఇది బ్యాంకుల క్రెడిట్ పాజిటివ్‌కు దోహదపడుతుందని వివరించింది.  ఇన్వెస్టర్ సెంటిమెంట్ తక్షణం మెరుగుదలకు ఇది దోహపదడిందని వివరించింది. కార్పొరేట్, మౌలిక రంగాల విషయంలో నిలిచిపోయిన విధానాల పునరుద్ధరణకు ఈ ఫలితాలు దోహదపడతాయని మూడీస్ వైస్‌ప్రెసిడెంట్, సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ వికాశ్ హలాన్ అన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సన్నిహిత సహకారం వల్ల పెట్టుబడుల్లో ప్రస్తుతం ఉన్న నిరుత్సాహ ధోరణి తొలగిపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కొత్త ప్రభుత్వం సహజ వాయువు ధరలను పెంచే అవకాశం కూడా ఉన్నట్లు వివరించింది. ఇదే జరిగితే ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా వంటి అప్‌స్ట్రీమ్ ఆయిల్, గ్యాస్ కంపెనీలకు లాభదాయకమని పేర్కొంది. దీర్ఘకాలంలో పెట్టుబడులకు ఇది ఊతమిచ్చే అంశంగా దీనిని విశ్లేషించింది. ఏప్రిల్‌లోనే గ్యాస్ ధరలు పెరగాల్సి ఉన్నా, దీనిపై నిర్ణయాన్ని ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పక్కనబెట్టింది.


 మోర్గాన్ స్టాన్లీ ఇలా...
వచ్చే కొద్ది త్రైమాసికాల్లో దేశం స్టాగ్‌ఫ్లేషన్ నుంచి బైటపడుతుంది. వృద్ధి కనిష్ట స్థాయి వద్ద కొనసాగుతూ, ధరల పెరుగుదల తీవ్రంగా ఉండే పరిస్థితిని స్టాగ్‌ఫ్లేషన్‌గా వ్యవహరిస్తాం.  

ఈక్విటీ మార్కెట్ ఊపుమీదుంటుంది. 2015 జూన్ నాటికి మోర్గాన్ స్టాన్లీ సెన్సెక్స్ టార్గెట్ 26,300. దీనికి సంబంధించి క్రితం టార్గెట్ 21,280 పాయింట్లు.

 భారత్ వృద్ధికి సంబంధించి ఎన్నికల ఫలితాలు కీలకమైనవి. వచ్చే రెండేళ్లలో జీడీపీ వృద్ధి 6.8 శాతానికి పెరగవచ్చు. ద్రవ్యోల్బణం 6 శాతం దిశగా కిందకుదిగే అవకాశం ఉంది.

భారత్ సంస్థాగత అంశాలు ఇప్పటికే పటిష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం వృద్ధికి ఊతం ఇస్తూ, సంస్కరణల ప్రక్రియ వేగం పెంచవచ్చు.

వ్యాపార సెంటిమెంట్‌కు ఫలితాలు ఊపిరులూదాయి. కార్పొరేట్ రంగ లాభదాయకతకు, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరగడానికి ఈ ఫలితాలు దోహదపడే అవకాశం ఉంది.

 ఫలితాలు దేశాభివృద్ధికి సంబంధించి మా విశ్వాసాన్ని పెంచాయి. రానున్న పదేళ్లలో జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతానికి పైగా నమోదవుతుంది. జీడీపీ విలువ ప్రస్తుత 1.9 ట్రిలియన్ డాలర్ల నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చు.

 ఇబ్బందులూ ఉన్నాయ్
 దేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లూ పొంచి ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ నివేదిక విశ్లేషించింది. రానున్న 12 నెలల్లో ఎల్‌నీనో, ఎగుమతుల స్పీడ్ తగ్గుదల వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. మధ్యకాలికంగా ఎదురయ్యే సవాళ్లలో ప్రపంచ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఒకటి. సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేయడం మరొకటి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement