వారికోసం ఐటీసీ రూ. 150 కోట్ల ఫండ్  | Sakshi
Sakshi News home page

వారికోసం ఐటీసీ రూ. 150 కోట్ల ఫండ్ 

Published Fri, Mar 27 2020 3:23 PM

covid19 ITC announces Rs 150 crore COVID19 contingency fund - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఐటీసీ కరోనా వైరస్ (కోవిడ్ -19) పై పోరులో తాను సైతం అంటూ ముందుకు ఒచ్చింది. కరోనా బాధితులను ఆదుకునేందుకు  పెద్ద మనసు చేసుకుంది. సమాజంలోని బలహీన వర్గాల కోసం రూ .150 కోట్ల కరోనావైరస్ తక్షణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. అలాగే లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట కల్పించాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలో ఫండ్ ఏర్పాటుతో పాటు, సమాజంలోని బలహీన వర్గాల కోసం జిల్లా ఆరోగ్య, గ్రామీణ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థకు సహాయం అందించడానికి అధికారులతో కలిసి పనిచేస్తామని కంపెనీ తెలిపింది. ఈ సంక్షోభ సమయంలో ప్రతికూలతలను అధిగమించేందుకు అనేక కార్యక్రమాలు అమలవుతున్న క్రమంలో, ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి రూ. 150 కోట్ల తక్షణ నిధిని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

మహమ్మారి కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన, లేదా జీవనోపాధిని  కోల్పోతున్న సమాజంలోని బలహీన వర్గాలకు ఈ సాయం అందుతుందని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని అత్యంత పేద వర్గాలకు ఉపశమనం కలిగించడానికి ఈ నిధిని ప్రధానంగా ఉపయోగించనున్నామని వెల్లడించింది. తద్వారా కరోనా వ్యాప్తి నిరోధానికి కృషిచేస్తున్న ప్రభుత్వానికి మద్దతును అందిస్తున్నట్టు ఐటీసీ తెలిపింది. కరోనాపై పోరులో ముందు నిలబడి సేవలందిస్తున్న,  ప్రజలకు నిత్యావసరాలను చేరవేస్తున్న యోధులకు వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన పరికరాలను దేశ వ్యాప్తంగా అందిస్తామని తెలపింది. అలాగే రక్షణాత్మక వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా కరోనాకు చెక్ పెట్టాలని ఐటీసీ కోరింది.

కరోనా పోరు: ఉద్యోగులకు బంపర్ ఆఫర్

Advertisement
Advertisement