కాస్మోస్‌ బ్యాంక్‌పై సైబర్‌ దాడి

Cosmos Bank hit by Rs 940 mn cyber hack - Sakshi

సర్వర్ల హ్యాకింగ్‌

రెండు రోజుల్లో రూ. 94 కోట్లు చోరీ  

పుణే: కాస్మోస్‌ బ్యాంక్‌ సర్వర్లపై హ్యాకర్లు సైబర్‌ దాడికి పాల్పడ్డారు. వేల కొద్దీ డెబిట్‌ కార్డులను క్లోనింగ్‌ చేయడం ద్వారా రెండు రోజుల్లో రూ.94 కోట్లు చోరీ చేశారు. బ్యాంకు సీనియర్‌ అధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. ఆగస్టు 11–13 మధ్య మోసపూరిత లావాదేవీల ద్వారా భారత్‌తో పాటు కెనడా, హాంకాంగ్‌లలోని 25 ఏటీఎంల నుంచి ఈ మొత్తాన్ని హ్యాకర్లు చోరీ చేసినట్లు పేర్కొన్నారు. వీసా, రూపే డెబిట్‌ కార్డుల ద్వారా ఇది జరిగినట్లు తెలియజేశారు.

‘‘మాల్‌వేర్‌ దాడి గురించి పుణే పోలీసులకు ఫిర్యాదు చేశాం. అంతర్గతంగా ఆడిట్‌ కూడా జరుపుతున్నాం. అయితే ఈ మాల్‌వేర్‌ దాడి వీసా, రూపే డెబిట్‌ కార్డుల పేమెంట్‌ గేట్‌వేలకు సంబంధించిన స్విచ్‌ వరకే పరిమితమయింది. ప్రధానమైన కోర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ (సీబీఎస్‌) సురక్షితంగానే ఉంది. ఖాతాదారుల అకౌంట్లకేమీ ముప్పు వాటిల్లలేదు. బ్యాంకుకే నష్టం కలిగించేలా హ్యాకర్లు ఈ చోరీకి పాల్పడ్డారు’’ అని సదరు అధికారి వివరించారు.

వీసా, రూపే సంస్థలు ఈ మోసపూరిత లావాదేవీల గురించి రిజర్వ్‌ బ్యాంకుకు తెలియజేశాయని ఆయన చెప్పారు. కార్డుల వివరాలను సేకరించిన హ్యాకర్లు ఆగస్టు 11న విదేశాల్లో సుమారు 12,000 పైచిలుకు లావాదేవీల్లో రూ.78 కోట్ల నగదును మళ్లించారు. అలాగే మరో సందర్భంలో 2,849 లావాదేవీల ద్వారా రూ. 2.5 కోట్ల నగదు బదిలీ భారత్‌లో జరిగింది. ఆగస్టు 13న హ్యాకర్లు.. హాంకాంగ్‌ కేంద్రంగా పనిచేసే బ్యాంకు ద్వారా రూ. 13.92 కోట్లు బదలాయించారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top