మౌలిక రంగం డౌన్‌... తయారీ జూమ్‌! | Core Sector Growth Dips To 10-Month Low Of 3.6% In May | Sakshi
Sakshi News home page

మౌలిక రంగం డౌన్‌... తయారీ జూమ్‌!

Jul 3 2018 12:16 AM | Updated on Jul 3 2018 7:52 AM

Core Sector Growth Dips To 10-Month Low Of 3.6% In May - Sakshi

న్యూఢిల్లీ: కీలకమైన ఎనిమిది మౌలిక పరిశ్రమల వృద్ధి రేటు మే లో పది నెలల కనిష్టానికి పడిపోయింది. 3.6 శాతానికి పరిమితమైంది. ముడిచమురు, సహజవాయువు ఉత్పత్తి క్షీణించడమే ఇందుకు కారణం. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గతేడాది మే లో ఎనిమిది కీలక పరిశ్రమల వృద్ధి 3.9 శాతంగా ఉంది. 2017 జూలై తర్వాత మౌలిక రంగం వృద్ధి ఇంత తక్కువ స్థాయిలో ఉండటం ఇదే ప్రథమం.

అప్పట్లో ఇది 2.9 శాతంగా నమోదైంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో 4.6 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది మే తో పోలిస్తే తాజాగా ఈ ఏడాది మేలో క్రూడాయిల్‌ ఉత్పత్తి 2.9 శాతం, సహజవాయువు ఉత్పత్తి 1.4 శాతం మేర క్షీణించింది. అటు రిఫైనరీ ఉత్పత్తుల తయారీలో వృద్ధి రేటు 4.9 శాతానికి (గతేడాది మేలో 5.4 శాతం), ఉక్కు 0.5 శాతానికి (3.8 శాతం), విద్యుదుత్పత్తి 3.5 శాతానికి (గత మేలో 8.2%) పరిమితమైంది. అయితే బొగ్గు 12.1%, ఎరువుల ఉత్పత్తి 8.4% వృద్ధి కనపర్చాయి.

తయారీకి డిమాండ్‌ జోష్‌...
ఇటు దేశీయంగాను, అటు విదేశాల నుంచి ఆర్డర్ల రాకతో జూన్‌లో తయారీ రంగం ఊపందుకుంది. తయారీ రంగ కార్యకలాపాల వృద్ధిని నమోదు చేసే నికాయ్‌ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ (పీఎంఐ) 53.1 పాయింట్లకు చేరడం దీనికి నిదర్శనం. మేలో ఇది 51.2గా ఉంది. గతేడాది డిసెంబర్‌ తర్వాత ఇంత వేగవంతమైన వృద్ధి నమోదు కావడం ఇదే ప్రథమం.

అలాగే, వరుసగా 11వ నెలలోనూ తయారీ రంగ పీఎంఐ కీలకమైన 50 పాయింట్లకు ఎగువన కొనసాగడం గమనార్హం. సాధారణంగా పీఎంఐ 50 పాయింట్లకు ఎగువన ఉంటే వృద్ధిని, అంతకన్నా దిగువన ఉంటే మందగమనాన్ని సూచిస్తుంది. భారీ ఆర్డర్లు, డిమాండ్‌ నెలకొన్న నేపథ్యంలో ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడిందని నివేదికను రూపొందించిన ఆర్థికవేత్త ఆష్నా దోధియా తెలిపారు.

ఉత్పత్తి అవసరాలు పెరుగుతున్నందున తయారీ సంస్థలు కొనుగోలు కార్యకలాపాలు, అదనపు సిబ్బంది నియామకాలపై దృష్టి సారించాయి. ధరలపరంగా చూస్తే ముడివస్తువుల రేట్లు పెరగడంతో.. ఉత్పత్తి వ్యయాలూ పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement