భారీ మూల్యం : 3 లక్షల కోట్ల డాలర్ల సంపద గోవిందా..

China Stock Market Loses $3 Trillion In Market Capitalisation In Last Six Months - Sakshi

బీజింగ్‌ : అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. వాణిజ్య ముప్పుతో ఆయా దేశాలతో ట్రేడ్‌ కొనసాగిస్తున్న దేశాలన్నీ అతలాకుతలమవుతున్నాయి. తాజాగా చైనా స్టాక్‌ మార్కెట్‌ కూడా అమెరికాతో జరుపుతున్న వాణిజ్య యుద్ధానికి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చిందని తెలిసింది. అమెరికాతో ట్రేడ్‌ వార్‌ మొదలయ్యాక, గత ఆరు నెలల కాలంలో చైనా స్టాక్‌ మార్కెట్‌ దాదాపు మూడు లక్షల కోట్ల డాలర్ల సంపదను పోగొట్టుకుందని తెలిసింది. దేశీయ బెంచ్‌మార్క్‌ స్టాక్‌ ఇండెక్స్‌ షాంఘై కాంపొజిట్‌ ఇండెక్స్‌ ప్రస్తుతం 50 శాతం కింద 2,548 పాయింట్ల స్థాయి వద్ద ట్రేడవుతోంది. 2015లో ఈ ఇండెక్స్‌ 5,166 పాయింట్ల వద్ద అ‍త్యధిక గరిష్టాలను నమోదు చేసింది. 

ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచే షాంఘై కాంపొజిట్‌ ఇండెక్స్‌ దాదాపు 22.93 శాతం కుదేలైంది. అయితే చైనా స్టాక్‌ మార్కెట్‌తో పోలిస్తే గత మూడేళ్లలో మన స్టాక్‌ మార్కెట్లు మంచి ప్రదర్శనను కనబర్చాయి. సెన్సెక్స్‌ గత మూడేళ్లలో 29.20 శాతం పెరగగా.. నిఫ్టీ 28.50 శాతం ఎగిసింది. అయితే చైనా స్టాక్‌ మార్కెట్‌ ఇప్పట్లో రికవరీ అయ్యే సంకేతాలు కూడా కనపడటం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అగ్రరాజ్యం నుంచి ట్రేడ్‌ వార్‌ భయాలే ఆ దేశ స్టాక్‌ మార్కెట్‌ను భారీగా కుదేలు చేయడానికి కారణమవుతున్నాయని పేర్కొన్నారు. మార్కెట్‌కు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం దోహదం చేస్తుందని తాము ఆశిస్తున్నామని బీజింగ్‌కు చెందిన ఓ ట్రేడర్‌ చెప్పారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top