మేలోనూ కారు రివర్స్‌గేరు! | Car sales skid again in May as consumer demand remains sluggish | Sakshi
Sakshi News home page

మేలోనూ కారు రివర్స్‌గేరు!

Jun 3 2019 6:12 AM | Updated on Jun 3 2019 6:12 AM

Car sales skid again in May as consumer demand remains sluggish - Sakshi

న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం గతుకుల రోడ్డుపై ప్రయాణం కొనసాగిస్తోంది. అధిక ఫైనాన్స్‌ వ్యయం, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) తగ్గిపోవడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో మే నెలలో కూడా అమ్మకాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ రంగంలోని మార్కెట్‌ లీడర్లు విక్రయాలు సైతం 20 శాతానికి మించి దిగజారాయి. ఆయా కంపెనీలు తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. గత నెలలో మారుతీ సుజుకీ ఇండియా మొత్తం అమ్మకాలు ఏకంగా 22 శాతం క్షీణించాయి. టాటా మోటార్స్‌ విక్రయాలు 26 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు 3 శాతం తగ్గిపోయాయి. ఈ అంశంపై మాట్లాడిన మహీంద్రా ఆటోమోటివ్‌ విభాగ ప్రెసిడెంట్‌ రాజన్‌  వాదేరా.. ‘సాధారణంగా ఎన్నికలకు ముందు ఆటోమొబైల్‌ అమ్మకాలు తగ్గుతాయి. మరోవైపు హైబేస్‌ నంబర్, అధిక ఫైనాన్స్‌ వ్యయం ఉన్నందున గత నెలలో సేల్స్‌ భారీగానే తగ్గాయి’ అని వివరించారు.


వాహనాలపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలి
పరిశ్రమ డిమాండ్‌
న్యూఢిల్లీ: వాహన అమ్మకాల క్షీణతకు ముగింపు పలికేందుకు గాను అన్ని రకాల వాహనాలపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్‌ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ప్రస్తుతం వాహనాలపై  28 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. జూలైలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) ఈ సూచన చేయడం గమనార్హం. అలాగే, కాలుష్య నిరోధానికి గాను పాత వాహనాలను తుక్కుగా మార్చి, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా కోరింది. బడ్జెట్‌ సంప్రదింపుల్లో భాగంగా ఆర్థిక శాఖ అధికారులకు సియామ్‌ ఈ మేరకు తమ డిమాండ్లను వినిపించింది. జీఎస్టీ రేటును తగ్గించడం వల్ల వాహనాల ధరలు దిగొస్తాయని, దాంతో 11 నెలలుగా అమ్మకాలు మందగించిన పరిశ్రమలో డిమాండ్‌ ఏర్పడుతుందని పేర్కొంది. దేశీయ తయారీని ప్రోత్సహించడంలో భాగంగా పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకునే వాణిజ్య వాహనాలపై కస్టమ్స్‌ డ్యూటీని ప్రస్తుత 25 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని కూడా సియామ్‌ కోరింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement