60 తర్వాత.. ఆచితూచి..! | Explanation of Liquidity in Retirement Savings | Sakshi
Sakshi News home page

60 తర్వాత.. ఆచితూచి..!

Sep 15 2025 4:43 AM | Updated on Sep 15 2025 4:43 AM

Explanation of Liquidity in Retirement Savings

అర్థవంతంగా ఆర్థిక నిర్ణయాలు  

పొదుపు నిధిని దీర్ఘకాలం కాపాడుకోవాలి 

మెరుగైన రాబడులకు మార్గం చూడాలి 

పెట్టుబడుల్లో ఈక్విటీలకూ చోటు ఉండాలి 

హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి

మనలో చాలా మంది పదవీ విరమణ ప్రణాళిక గురించి పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడో వృద్ధాప్యంలో పలకరించే రిటైర్మెంట్‌ గురించి యవ్వనంలో ఉన్నప్పుడు చర్చించడం వారికి నచ్చదు! మధ్య వయసు వచ్చే వరకు అభిరుచులు, ఆకాంక్షలు, కోరికల చుట్టూ సాగిపోతుంటారు. దీంతో రిటైర్మెంట్‌కు ప్రాధాన్యం పక్కకు వెళ్లిపోతుంది. 

తీరా రిటైర్మెంట్‌ పలకరించిన తర్వాత, అప్పటి వరకు తాము వెనకేసింది  అవసరాలకు ఎంత మాత్రం సరిపోదని తెలుసుకుని ఆందోళన చెందాల్సి  వస్తుంది. అనారోగ్యంతో ఒక్కసారి ఆస్పత్రిపాలైతే పెద్ద మొత్తంలో ఖర్చు  చేయాల్సి రావచ్చు. 

లిక్విడిటీ తగినంత లేని సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల..  క్లిష్ట సమయాల్లో రోజువారీ ఖర్చులకు సైతం కటకట ఎదుర్కోవాల్సి రావచ్చు. మెరుగైన రాబడి లేని సాధనాలను నమ్ముకోవడం వల్ల రిటైర్మెంట్‌ ఫండ్‌ దీర్ఘకాలం పాటు అవసరాలను తీర్చలేకపోవచ్చు. అందుకే పదవీ విరమణ తర్వాత..  ముఖ్యంగా 60 ఏళ్ల తర్వాత వేసే ప్రతి అడుగు ఆర్థికంగా ఆచితూచి ఉండాలి. 
 

ఉద్యోగంలో మాదిరే పదవీ విరమణ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే ప్రణాళిక ఉండాలి. లేదంటే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పటి వరకు సమకూర్చుకున్న ఫండ్‌ (పొదుపు నిధి)ను వివిధ సాధనాల్లో పెట్టుబడి పెట్టి.. ప్రతి నెలా నిర్ణిత మొత్తాన్ని ఉపసంహరించుకునే ఏర్పాటు చేసుకోవాలి. ‘‘పెట్టుబడి నుంచి మొదటి ఏడాది 3–4 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. రెండో ఏడాది నుంచి ద్రవ్యోల్బణం సూచీ స్థాయిలో ఉపసంహరణకు పరిమితం కావాలి’’ అని నెర్డిబర్డ్‌ వెల్త్‌ అడ్వైజరీ ప్రిన్సిపల్‌ ఆఫీసర్‌ శిల్పా భాస్కర్‌ గోలే సూచించారు. ఉపసంహరణలో చిన్న తేడా వచ్చినా రిటైర్మెంట్‌ నిధిని ఎక్కువ కాలం పాటు కాపాడుకోలేరు. 

ఉదాహరణకు రూ.2 కోట్ల నిధి ఉందనుకోండి. ఏటా 8 శాతం వృద్ధి చెందుతూ, ప్రతి నెలా రూ.లక్ష ఉపసంహరించుకుంటే తమవద్దనున్న నిధి 6 శాతం ద్రవ్యల్బోణం అంచనా ఆధారంగా 21 ఏళ్ల అవసరాలకు సరిపోతుంది. అలా కాకుండా ప్రతి నెలా రూ.1.5 లక్షల చొప్పున ఉపసంహరించుకుంటూ వెళితే అదే నిధి 13 ఏళ్ల అవసరాలనే తీర్చగలదు. ఎంత ఉపసంహరించుకోవాలన్న స్పష్టత కొరవడితే, తొలినాళ్లలో అధికంగా ఖర్చు చేయొచ్చు. ఖర్చులకు అనుగుణంగా ఉపసంహరణలు కొనసాగితే, తర్వాతి సంవత్సరాలకు పెద్దగా మిగిలి ఉండదని 5నాన్స్‌ డాట్‌ కామ్‌ వ్యవస్థాపకుడు దినేష్‌ రోహిరా హెచ్చరించారు. పేరుకే రిటైర్మెంట్‌. కానీ, నేడు చాలా మంది ఆ తర్వాత కూడా ఏదో ఒక పని చేస్తున్నారు. అలాంటి మార్గాలను గుర్తించాలి. దీనివల్ల రిటైర్మెంట్‌ ఫండ్‌ నుంచి తక్కువ ఉపసంహరణకు పరిమితం కావొచ్చు. ఫలితంగా రిటైర్మెంట్‌ నిధిని ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు.

ఈక్విటీ పెట్టుబడులపై అప్రమత్తత... 
పదవీ విరమణ తర్వాత ఈక్విటీ పెట్టుబడులకు పూర్తిగా దూరం కావాల్సిన అవసరం లేదు. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌/డెట్‌ సెక్యూరిటీల రాబడిపై ద్రవ్యోల్బణం క్షీణత ప్రభావాన్ని చాలా మంది అర్థం చేసుకోరు. పదవీ విరమణ తర్వాత పెట్టుబడుల్లో వృద్ధి భాగం లేకపోతే, పొదుపు నిధి విలువ వేగంగా తగ్గిపోతుంది. కనుక 70 ఏళ్లు దాటిన వారు సైతం తమ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతాన్ని అధిక నాణ్యతతో కూడిన డివిడెండ్‌ ఇచ్చే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని దినేష్‌ రోహిరా సూచించారు. దీనివల్ల పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి చెందుతుంది. 

అదే సమయంలో ఈక్విటీలపై ఎక్కువగా ఆధారపడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే రిటైర్మెంట్‌ ఆరంభంలో ఎక్కువ మొత్తం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసినట్టయితే.. సరిగ్గా అప్పుడే ఈక్విటీల్లో బేర్‌ దశ (పతనకాలం) ఆరంభమై కొన్నేళ్ల పాటు కొనసాగితే.. అవసరాల కోసం ఈలోపు చేసే ఉపసంహరణలతో పెట్టుబడి విలువ గణనీయంగా పడిపోతుంది. కనుక 5–7 ఏళ్ల అవసరాలకు సరిపడా మొత్తాన్ని సురక్షిత డెట్‌ సాధనాల్లో తప్పకుండా ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. దీనివల్ల అంతకాలం పాటు ఈక్విటీ పెట్టుబడులను కదిలించకుండా ఉంటే ఆ మొత్తం మెరుగ్గా వృద్ధి చెందేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.

యాన్యుటీ ప్లాన్లు 
యాన్యుటీ ప్లాన్లు.. హామీతో కూడిన రాబడిని ఇస్తాయి. కానీ, రిటైర్మెంట్‌ నిధి మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్లలో ఇన్వెస్ట్‌ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఒక్కసారి యాన్యూటీ ప్లాన్‌ కొనుగోలు చేసిన తర్వాత చివరి వరకు ఒకే విధమైన రాబడికి లాక్‌ అయినట్టే. వ్యయాలు, వైద్య అత్యవసరాలు లేదా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా రాబడి పెరగదు. యాన్యుటీలకు పన్ను ప్రయోజనాలు కూడా లేవు. కనుక కొంత వరకు యాన్యుటీకి కేటాయించుకుని, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్, డెట్‌ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొంత చొప్పున ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ) రూపంలో ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

వైద్యపరంగా సన్నద్ధత.. 
వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు సర్వ సాధారణం. వైద్యపరమైన ద్రవ్యోల్బణం 12–14%గా ఉంటోంది. కనుక ఈ సమయంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తప్పకుండా ఉండాలి. ఇది లేకపోతే పొదుపు నిధిపై ఆధారపడాల్సి వస్తుంది. ఆర్థిక కోణం నుంచి చూస్తే ఇది పెద్ద తప్పిదం అవుతుంది. రిటైర్మెంట్‌ ఫండ్‌ అన్నది జీవితాంతం అవసరాలను తీర్చడం కోసం. వైద్యం కోసం దాన్ని వాడటం మొదలు పెడితే తక్కువ కాలంలోనే ఖాళీ అయిపోతుంది. కనుక రిటైర్మెంట్‌ తర్వాత ప్రీమియం భారమైనా సరే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ను కొనసాగించాలి. ప్రీమియం భారమనిపిస్తే రూ.5 లక్షలకు బేసిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.50 లక్షలకు సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ తీసుకోవచ్చు. ఉద్యోగ సమయంలో కంపెనీ గ్రూప్‌ హెల్త్‌ పాలసీ ఉందని, వ్యక్తిగత హెల్త్‌ పాలసీ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ను చాలా మంది తీసుకోరు. ఉద్యోగ విరమణ తర్వాత తీసుకుంటే అప్పుడు భారీ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కనుక గ్రూప్‌ హెల్త్‌ ప్లాన్‌పై ఆధారపడకుండా వ్యక్తిగతంగా కుటుంబానికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉండేలా చూసుకోవాలి.

ఎస్టేట్‌ ప్లానింగ్‌ 
60 తర్వాత తప్పకుండా పట్టించుకోవాల్సిన అంశం ఎస్టేట్‌ ప్లానింగ్‌. స్థిర, చరాస్తులు, ఆర్థిక ఆస్తులను ఎలా నిర్వహించాలి? ఎలా పంపిణీ చేయాలన్నది ఇది నిర్దేశిస్తుంది. కేవలం ధనవంతుల కోసమే ఇదని భావిస్తుంటారు. కానీ, ఆస్తులున్న ప్రతి కుటుంబానికి అవసరమే. కనీసం వీలునామా రూపంలో అయినా ఎవరికి ఏ మేరకు పంపిణీ చేయాలో సూచించాలి. తద్వారా భవిష్యత్తులో వారసుల మధ్య వివాదాలు లేకుండా జాగ్రత్తపడొచ్చు. 

ఇక్కడ వీలునామా అన్నది తమ మరణానంతరం తమ వారసులకు ఏవేవి, ఎలా చెందాలో సూచించే పత్రం. అదే ఎస్టేట్‌ ప్లానింగ్‌ అయితే జీవించి ఉన్న సమయంలోనూ ఆయా ఆస్తుల రక్షణ, వాటిని తమ అభీష్టం మేరకు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఒకవేళ ఏదైనా అనారోగ్యం కారణంగా కుటుంబ యజమాని అశక్తుడిగా మారిన సందర్భంలో అప్పటికే ఎస్టేట్‌ ప్లానింగ్‌ ఉంటే, అందులో పేర్కొన్న విధంగా ఆస్తుల నిర్వహణను కుటుంబ సభ్యులు లేదా ట్రస్టీలు చూసుకుంటారు. ఎస్టేట్‌ ప్లానింగ్‌ లేదా వీలునామా ఉన్నప్పటికీ.. పెట్టుబడులకు నామినీని నమోదు చేయడం కూడా అవసరమే. దీనివల్ల వీటి క్లెయిమ్‌ సులభతరం అవుతుంది.  

పన్ను ప్రయోజనం  
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) పన్ను పరంగా మెరుగైన సాధనాలు కావు. వీటి రాబడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. తమకు వర్తించే శ్లాబు రేటు ప్రకారమే ఎఫ్‌డీ రాబడిపైనా పన్ను చెల్లించాల్సి వస్తుంది. గతంలో మాదిరి డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో స్వల్పకాల/దీర్ఘకాల పెట్టుబడుల ప్రయోజనాలు ఇప్పుడు లేవు. ఎప్పుడు విక్రయించినా ఎఫ్‌డీల మాదిరే ఆదాయం వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సిందే. వీటికి బదులు పన్ను ఆదా కోసం అయితే ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. వీటిలో రాబడికి ఈక్విటీ పెట్టుబడులకు మాదిరే స్వల్ప, దీర్ఘకాల మూలధన పన్ను నిబంధనలు అమలవుతాయి. రిస్క్‌ దాదాపు ఉండదు.  

లిక్విడ్‌ ఆస్తులకు చోటు ఉండాలి 
కొంత మంది రిటైర్మెంట్‌ తర్వాతి అవసరాల కోసం ప్రాపర్టీని (ఇల్లు/ఫ్లాట్‌) సమకూర్చుకుంటుంటారు. స్థిరాస్తి రూపంలో ఉండడం వల్ల లిక్విడిటీ (నగదు లభ్యత) సమస్య ఎదురుకావొచ్చు. అవసరమైనప్పుడు ప్రాపర్టీని వెంటనే నగదుగా మార్చుకోవడం సాధ్యపడదు. ఇక నిర్వహణ వ్యయాలు, పన్నులు, న్యాయ వివాదాల రిస్‌్కలు ఎలానూ ఉంటాయ్‌. రిటైర్మెంట్‌ కోసమని ప్రాపర్టీలను సమకూర్చుకున్నప్పటికీ.. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయానికి ప్రణాళిక ఉండాలి. ఇందుకు ప్రాపర్టీని విక్రయించడం లేదంటే రివర్స్‌ మార్ట్‌గేజ్‌కు వెళ్లడం మంచి ఆప్షన్‌ అవుతుంది.

 రివర్స్‌ మార్ట్‌గేజ్‌లో ప్రాపర్టీని బ్యాంక్‌ తనఖా పెట్టుకుని, నెలవారీ కోరుకున్నంత ఆదాయాన్ని నిర్ణిత కాలం పాటు చెల్లిస్తుంది. ఇంటిని విక్రయించనక్కర్లేదు. అదే ఇంట్లో నివాసం ఉండొచ్చు. మీ తదనంతరం వారసులు అప్పటి వరకు ఉన్న బకాయిని చెల్లించి అదే ఇంటిని స్వా«దీనం చేసుకోవచ్చు. లేదంటే బ్యాంక్‌ వేలం వేసి, బకాయి పోను మిగిలినది వారసులకు చెల్లిస్తుంది. ఇంటి కోసం రుణం తీసుకుని మనం ఎలా అయితే నిర్ణిత కాలం పాటు ఈఎంఐ చెల్లిస్తామో.. రివర్స్‌ మార్ట్‌గేజ్‌లో బ్యాంక్‌ అలా మనకు చెల్లిస్తుంది. ఏకమొత్తంలో చెల్లింపులకూ కొన్ని బ్యాంక్‌లు అవకాశం కల్పిస్తున్నాయి.   

రుణ భారం 
రిటైర్మెంట్‌ నాటికి ఎలాంటి రుణం మిగిలి ఉండకూడదు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డు బకాయిలు, గృహ రుణాలు ఏవైనా సరే గుడ్‌బై చెప్పేయాలి. లేదంటే రిటైర్మెంట్‌ కోసం ఉద్దేశించిన పొదుపు నిధిని రుణ చెల్లింపుల కోసం వినియోగించాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థిక స్వేచ్ఛను కోల్పోవాల్సి వస్తుంది.  

    – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement