
వీటితో భారత్‌కు వ్యూహాత్మక అవకాశాలు
ఆర్‌బీఐ బులెటిన్ విడుదల
ముంబై: బలమైన వాణిజ్య భాగస్వామ్యాలు భారత్‌కు వ్యూహాత్మక అవకాశాలను తీసుకొస్తాయని.. అంతర్జాతీయంగా విలువ ఆధారిత సరఫరా వ్యవస్థతో అనుసంధానతను పెంచుకోవచ్చని ఆర్‌బీఐ బులెటిన్ పేర్కొంది. వాణిజ్య విధానపరమైన అనిశ్చితులు నెలకొన్నప్పటికీ జూన్–జూలై నెలల్లో ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగినట్టు తెలిపింది. సమగ్ర ఆర్థిక, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్–యూకే గురువారం సంతకం చేయనుండడం గమనార్హం.
అమెరికాతోనూ ఈ దిశగా చర్చలు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితిపై బుధవారం ఆర్‌బీఐ బులెటిన్ విడుదలైంది. వాణిజ్య విధానపరమైన అనిశ్చితుల కారణంగా జూన్ నుంచి జూలైలో ఇప్పటి వరకు అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక వాతావరణం అస్థిరంగా ఉన్నట్టు తెలిపింది. ‘‘ఈ కాలంలో దేశీ ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగాయి.
ఖరీఫ్ సాగు పరిస్థితులు మెరుగుపడడం, సేవల రంగంలో బలమైన పనితీరు, పారిశ్రామిక పనితీరులో మోస్తరు వృద్ధి మద్దతుగా నిలిచాయి’’అని బులెటిన్ వివరించింది. అమెరికాతో ఆగస్ట్ 1కి ముందుగానే వాణిజ్య ఒప్పందం కోసం తీవ్రమైన చర్చలు నడుస్తున్నాయంటూ.. అమెరికా వాణిజ్య విధానాలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాలను పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.
సగటు వాణిజ్య టారిఫ్‌లు 1930ల తర్వాత ఎన్నడూలేని స్థాయిలకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇతర రంగాలపైనా అదనంగా కొత్త టారిఫ్‌లు విధించే రిస్క్ లేకపోలేదని తెలిపింది. ఈ అనిశ్చితులు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి విఘాతం కలిగించొచ్చని అభిప్రాయపడింది. వ్యవస్థలో తగినంత లిక్విడిటీ ఉండడం రేట్ల కోత బదిలీకి వీలు కల్పిస్తుందని.. విదేశీ మారకం నిల్వలు సమృద్ధిగా ఉండడం, విదేశీ మారకం రుణభారం మోస్తరుగా ఉండడాన్ని సానుకూలతలుగా పేర్కొంది.
చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి ఆజ్యం
చమురు ధరలు 10% పెరిగితే రిటైల్ ద్రవ్యోల్బణం 0.20% అధికమవుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ప్ర త్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు విధానపరమైన చర్యలకు ఆర్‌బీఐ ఉద్యోగులు విడుదల చేసిన అధ్యయన పత్రం పిలుపునిచ్చింది. ఈ భారం వినియోగదారులపై అధికంగా పడకుండా ఎక్సైజ్ సుంకాలను తగ్గించే వెసులుబా టు ప్రభుత్వానికి ఉన్నట్టు తెలిపింది.