సెప్టెంబర్‌లో 11.7 శాతం అప్
ఇండీడ్ నివేదిక
ముంబై: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) నిపుణులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. గ్లోబల్ హైరింగ్ ప్లాట్‌ఫాం ఇండీడ్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏఐ సంబంధ జాబ్ పోస్టింగ్స్ 11.7 శాతం మేర పెరగడం ఇందుకు నిదర్శనం. గతేడాది సెప్టెంబర్‌లో ఇది 8.2 శాతంగా నమోదైంది. తమ ప్లాట్‌ఫాంలో జాబ్ పోస్టింగ్‌ల ఆధారంగా ఇండీడ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం సెప్టెంబర్‌లో 11.7 శాతం పోస్టింగ్స్‌లో ప్రత్యేకంగా ఏఐని ప్రస్తావించారు. తమకు కీలకమైన భారత మార్కెట్ తర్వాత సింగపూర్‌లో మాత్రమే ఏఐ నిపుణులకు ఈ స్థాయిలో డిమాండ్ కనిపించినట్లు ఇండీడ్ ఏపీఏసీ సీనియర్ ఎకానమిస్ట్ క్యాలమ్ పికరింగ్ తెలిపారు. ఏఐ ఆధారిత ఉద్యోగావకాశాలు ప్రధానంగా టెక్ రంగంలోనే ఉన్నప్పటికీ, క్రమంగా ఇతర రంగాల్లోను పెరుగుతున్నట్లు పేర్కొన్నారు.
నివేదికలో మరిన్ని విశేషాలు..
→ దాదాపు 39 శాతం డేటా, అనలిటిక్స్ ఉద్యోగాల పోస్టింగ్స్‌లో ఏఐ ప్రస్తావన ఉంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ (23 శాతం), బీమా (18 శాతం), సైంటిఫిక్ రీసెర్చ్ (17 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
→ పలు ఇంజినీరింగ్ కేటగిరీల్లో సర్వసాధారణంగా ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ నెలకొంది. ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (17 శాతం), మెకానికల్ ఇంజినీరింగ్ (11 శాతం), ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (9.2 శాతం) ఈ కేటగిరీల్లో ఉన్నాయి.
→ దేశీయంగా ఉద్యోగులు క్రమంగా సంఘటిత ఉద్యోగాల వైపు మళ్లుతున్నారు.
→ ఏఐ కారణంగా హైరింగ్ స్వరూపం మారుతున్న నేపథ్యంలో అత్యధిక నైపుణ్యాలున్న, స్పెషలైజ్డ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. చాలా మటుకు సంస్థలు, డేటా అనలిటిక్స్, ఆటోమేషన్ మొదలైన ఏఐ సంబంధ టూల్స్‌పై గట్టి పట్టున్న అభ్యర్ధులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.


