breaking news
Retirement Fund
-
60 తర్వాత.. ఆచితూచి..!
మనలో చాలా మంది పదవీ విరమణ ప్రణాళిక గురించి పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడో వృద్ధాప్యంలో పలకరించే రిటైర్మెంట్ గురించి యవ్వనంలో ఉన్నప్పుడు చర్చించడం వారికి నచ్చదు! మధ్య వయసు వచ్చే వరకు అభిరుచులు, ఆకాంక్షలు, కోరికల చుట్టూ సాగిపోతుంటారు. దీంతో రిటైర్మెంట్కు ప్రాధాన్యం పక్కకు వెళ్లిపోతుంది. తీరా రిటైర్మెంట్ పలకరించిన తర్వాత, అప్పటి వరకు తాము వెనకేసింది అవసరాలకు ఎంత మాత్రం సరిపోదని తెలుసుకుని ఆందోళన చెందాల్సి వస్తుంది. అనారోగ్యంతో ఒక్కసారి ఆస్పత్రిపాలైతే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు. లిక్విడిటీ తగినంత లేని సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. క్లిష్ట సమయాల్లో రోజువారీ ఖర్చులకు సైతం కటకట ఎదుర్కోవాల్సి రావచ్చు. మెరుగైన రాబడి లేని సాధనాలను నమ్ముకోవడం వల్ల రిటైర్మెంట్ ఫండ్ దీర్ఘకాలం పాటు అవసరాలను తీర్చలేకపోవచ్చు. అందుకే పదవీ విరమణ తర్వాత.. ముఖ్యంగా 60 ఏళ్ల తర్వాత వేసే ప్రతి అడుగు ఆర్థికంగా ఆచితూచి ఉండాలి. ఉద్యోగంలో మాదిరే పదవీ విరమణ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే ప్రణాళిక ఉండాలి. లేదంటే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పటి వరకు సమకూర్చుకున్న ఫండ్ (పొదుపు నిధి)ను వివిధ సాధనాల్లో పెట్టుబడి పెట్టి.. ప్రతి నెలా నిర్ణిత మొత్తాన్ని ఉపసంహరించుకునే ఏర్పాటు చేసుకోవాలి. ‘‘పెట్టుబడి నుంచి మొదటి ఏడాది 3–4 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. రెండో ఏడాది నుంచి ద్రవ్యోల్బణం సూచీ స్థాయిలో ఉపసంహరణకు పరిమితం కావాలి’’ అని నెర్డిబర్డ్ వెల్త్ అడ్వైజరీ ప్రిన్సిపల్ ఆఫీసర్ శిల్పా భాస్కర్ గోలే సూచించారు. ఉపసంహరణలో చిన్న తేడా వచ్చినా రిటైర్మెంట్ నిధిని ఎక్కువ కాలం పాటు కాపాడుకోలేరు. ఉదాహరణకు రూ.2 కోట్ల నిధి ఉందనుకోండి. ఏటా 8 శాతం వృద్ధి చెందుతూ, ప్రతి నెలా రూ.లక్ష ఉపసంహరించుకుంటే తమవద్దనున్న నిధి 6 శాతం ద్రవ్యల్బోణం అంచనా ఆధారంగా 21 ఏళ్ల అవసరాలకు సరిపోతుంది. అలా కాకుండా ప్రతి నెలా రూ.1.5 లక్షల చొప్పున ఉపసంహరించుకుంటూ వెళితే అదే నిధి 13 ఏళ్ల అవసరాలనే తీర్చగలదు. ఎంత ఉపసంహరించుకోవాలన్న స్పష్టత కొరవడితే, తొలినాళ్లలో అధికంగా ఖర్చు చేయొచ్చు. ఖర్చులకు అనుగుణంగా ఉపసంహరణలు కొనసాగితే, తర్వాతి సంవత్సరాలకు పెద్దగా మిగిలి ఉండదని 5నాన్స్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు దినేష్ రోహిరా హెచ్చరించారు. పేరుకే రిటైర్మెంట్. కానీ, నేడు చాలా మంది ఆ తర్వాత కూడా ఏదో ఒక పని చేస్తున్నారు. అలాంటి మార్గాలను గుర్తించాలి. దీనివల్ల రిటైర్మెంట్ ఫండ్ నుంచి తక్కువ ఉపసంహరణకు పరిమితం కావొచ్చు. ఫలితంగా రిటైర్మెంట్ నిధిని ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు.ఈక్విటీ పెట్టుబడులపై అప్రమత్తత... పదవీ విరమణ తర్వాత ఈక్విటీ పెట్టుబడులకు పూర్తిగా దూరం కావాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ ఇన్కమ్/డెట్ సెక్యూరిటీల రాబడిపై ద్రవ్యోల్బణం క్షీణత ప్రభావాన్ని చాలా మంది అర్థం చేసుకోరు. పదవీ విరమణ తర్వాత పెట్టుబడుల్లో వృద్ధి భాగం లేకపోతే, పొదుపు నిధి విలువ వేగంగా తగ్గిపోతుంది. కనుక 70 ఏళ్లు దాటిన వారు సైతం తమ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతాన్ని అధిక నాణ్యతతో కూడిన డివిడెండ్ ఇచ్చే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలని దినేష్ రోహిరా సూచించారు. దీనివల్ల పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి చెందుతుంది. అదే సమయంలో ఈక్విటీలపై ఎక్కువగా ఆధారపడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే రిటైర్మెంట్ ఆరంభంలో ఎక్కువ మొత్తం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే.. సరిగ్గా అప్పుడే ఈక్విటీల్లో బేర్ దశ (పతనకాలం) ఆరంభమై కొన్నేళ్ల పాటు కొనసాగితే.. అవసరాల కోసం ఈలోపు చేసే ఉపసంహరణలతో పెట్టుబడి విలువ గణనీయంగా పడిపోతుంది. కనుక 5–7 ఏళ్ల అవసరాలకు సరిపడా మొత్తాన్ని సురక్షిత డెట్ సాధనాల్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల అంతకాలం పాటు ఈక్విటీ పెట్టుబడులను కదిలించకుండా ఉంటే ఆ మొత్తం మెరుగ్గా వృద్ధి చెందేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.యాన్యుటీ ప్లాన్లు యాన్యుటీ ప్లాన్లు.. హామీతో కూడిన రాబడిని ఇస్తాయి. కానీ, రిటైర్మెంట్ నిధి మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఒక్కసారి యాన్యూటీ ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత చివరి వరకు ఒకే విధమైన రాబడికి లాక్ అయినట్టే. వ్యయాలు, వైద్య అత్యవసరాలు లేదా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా రాబడి పెరగదు. యాన్యుటీలకు పన్ను ప్రయోజనాలు కూడా లేవు. కనుక కొంత వరకు యాన్యుటీకి కేటాయించుకుని, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, డెట్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కొంత చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవాలి. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) రూపంలో ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి.వైద్యపరంగా సన్నద్ధత.. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు సర్వ సాధారణం. వైద్యపరమైన ద్రవ్యోల్బణం 12–14%గా ఉంటోంది. కనుక ఈ సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. ఇది లేకపోతే పొదుపు నిధిపై ఆధారపడాల్సి వస్తుంది. ఆర్థిక కోణం నుంచి చూస్తే ఇది పెద్ద తప్పిదం అవుతుంది. రిటైర్మెంట్ ఫండ్ అన్నది జీవితాంతం అవసరాలను తీర్చడం కోసం. వైద్యం కోసం దాన్ని వాడటం మొదలు పెడితే తక్కువ కాలంలోనే ఖాళీ అయిపోతుంది. కనుక రిటైర్మెంట్ తర్వాత ప్రీమియం భారమైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కవర్‌ను కొనసాగించాలి. ప్రీమియం భారమనిపిస్తే రూ.5 లక్షలకు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు. ఉద్యోగ సమయంలో కంపెనీ గ్రూప్ హెల్త్ పాలసీ ఉందని, వ్యక్తిగత హెల్త్ పాలసీ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను చాలా మంది తీసుకోరు. ఉద్యోగ విరమణ తర్వాత తీసుకుంటే అప్పుడు భారీ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కనుక గ్రూప్ హెల్త్ ప్లాన్‌పై ఆధారపడకుండా వ్యక్తిగతంగా కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలి.ఎస్టేట్ ప్లానింగ్ 60 తర్వాత తప్పకుండా పట్టించుకోవాల్సిన అంశం ఎస్టేట్ ప్లానింగ్. స్థిర, చరాస్తులు, ఆర్థిక ఆస్తులను ఎలా నిర్వహించాలి? ఎలా పంపిణీ చేయాలన్నది ఇది నిర్దేశిస్తుంది. కేవలం ధనవంతుల కోసమే ఇదని భావిస్తుంటారు. కానీ, ఆస్తులున్న ప్రతి కుటుంబానికి అవసరమే. కనీసం వీలునామా రూపంలో అయినా ఎవరికి ఏ మేరకు పంపిణీ చేయాలో సూచించాలి. తద్వారా భవిష్యత్తులో వారసుల మధ్య వివాదాలు లేకుండా జాగ్రత్తపడొచ్చు. ఇక్కడ వీలునామా అన్నది తమ మరణానంతరం తమ వారసులకు ఏవేవి, ఎలా చెందాలో సూచించే పత్రం. అదే ఎస్టేట్ ప్లానింగ్ అయితే జీవించి ఉన్న సమయంలోనూ ఆయా ఆస్తుల రక్షణ, వాటిని తమ అభీష్టం మేరకు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఒకవేళ ఏదైనా అనారోగ్యం కారణంగా కుటుంబ యజమాని అశక్తుడిగా మారిన సందర్భంలో అప్పటికే ఎస్టేట్ ప్లానింగ్ ఉంటే, అందులో పేర్కొన్న విధంగా ఆస్తుల నిర్వహణను కుటుంబ సభ్యులు లేదా ట్రస్టీలు చూసుకుంటారు. ఎస్టేట్ ప్లానింగ్ లేదా వీలునామా ఉన్నప్పటికీ.. పెట్టుబడులకు నామినీని నమోదు చేయడం కూడా అవసరమే. దీనివల్ల వీటి క్లెయిమ్ సులభతరం అవుతుంది. పన్ను ప్రయోజనం ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) పన్ను పరంగా మెరుగైన సాధనాలు కావు. వీటి రాబడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. తమకు వర్తించే శ్లాబు రేటు ప్రకారమే ఎఫ్డీ రాబడిపైనా పన్ను చెల్లించాల్సి వస్తుంది. గతంలో మాదిరి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో స్వల్పకాల/దీర్ఘకాల పెట్టుబడుల ప్రయోజనాలు ఇప్పుడు లేవు. ఎప్పుడు విక్రయించినా ఎఫ్‌డీల మాదిరే ఆదాయం వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సిందే. వీటికి బదులు పన్ను ఆదా కోసం అయితే ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిలో రాబడికి ఈక్విటీ పెట్టుబడులకు మాదిరే స్వల్ప, దీర్ఘకాల మూలధన పన్ను నిబంధనలు అమలవుతాయి. రిస్క్ దాదాపు ఉండదు. లిక్విడ్ ఆస్తులకు చోటు ఉండాలి కొంత మంది రిటైర్మెంట్ తర్వాతి అవసరాల కోసం ప్రాపర్టీని (ఇల్లు/ఫ్లాట్) సమకూర్చుకుంటుంటారు. స్థిరాస్తి రూపంలో ఉండడం వల్ల లిక్విడిటీ (నగదు లభ్యత) సమస్య ఎదురుకావొచ్చు. అవసరమైనప్పుడు ప్రాపర్టీని వెంటనే నగదుగా మార్చుకోవడం సాధ్యపడదు. ఇక నిర్వహణ వ్యయాలు, పన్నులు, న్యాయ వివాదాల రిస్‌్కలు ఎలానూ ఉంటాయ్. రిటైర్మెంట్ కోసమని ప్రాపర్టీలను సమకూర్చుకున్నప్పటికీ.. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయానికి ప్రణాళిక ఉండాలి. ఇందుకు ప్రాపర్టీని విక్రయించడం లేదంటే రివర్స్ మార్ట్‌గేజ్‌కు వెళ్లడం మంచి ఆప్షన్ అవుతుంది. రివర్స్ మార్ట్‌గేజ్‌లో ప్రాపర్టీని బ్యాంక్ తనఖా పెట్టుకుని, నెలవారీ కోరుకున్నంత ఆదాయాన్ని నిర్ణిత కాలం పాటు చెల్లిస్తుంది. ఇంటిని విక్రయించనక్కర్లేదు. అదే ఇంట్లో నివాసం ఉండొచ్చు. మీ తదనంతరం వారసులు అప్పటి వరకు ఉన్న బకాయిని చెల్లించి అదే ఇంటిని స్వా«దీనం చేసుకోవచ్చు. లేదంటే బ్యాంక్ వేలం వేసి, బకాయి పోను మిగిలినది వారసులకు చెల్లిస్తుంది. ఇంటి కోసం రుణం తీసుకుని మనం ఎలా అయితే నిర్ణిత కాలం పాటు ఈఎంఐ చెల్లిస్తామో.. రివర్స్ మార్ట్‌గేజ్‌లో బ్యాంక్ అలా మనకు చెల్లిస్తుంది. ఏకమొత్తంలో చెల్లింపులకూ కొన్ని బ్యాంక్‌లు అవకాశం కల్పిస్తున్నాయి. రుణ భారం రిటైర్మెంట్ నాటికి ఎలాంటి రుణం మిగిలి ఉండకూడదు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు, గృహ రుణాలు ఏవైనా సరే గుడ్‌బై చెప్పేయాలి. లేదంటే రిటైర్మెంట్ కోసం ఉద్దేశించిన పొదుపు నిధిని రుణ చెల్లింపుల కోసం వినియోగించాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థిక స్వేచ్ఛను కోల్పోవాల్సి వస్తుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
త్వరగా రిటైర్ అవుదామనుకుంటున్నా.. రిటైర్మెంట్ ఫండ్ ఎలా?
నా వయసు 35 ఏళ్లు? 55 ఏళ్లకే రిటైర్ అవుదామని అనుకుంటున్నాను. ఆ సమయానికి రిటైర్మెంట్ ఫండ్‌ను సిద్ధం చేసుకోవడం ఎలా? – కీర్తిలాల్ మీ రిటైర్మెంట్కు ఇంకా 20 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంది. 55 లేదా 60 ఏళ్లకు రిటైర్ అవుదామని అనుకుంటే పెట్టుబడులకు ఇంకా 20–25 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంటుంది. ఈక్విటీలో పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఈ సమయం చాలు. మీరు ఏ వయసులో రిటైర్ అయినా.. ఈక్విటీ పెట్టుబడులకు రిటైర్మెంట్ లేదని గుర్తు పెట్టుకోవాలి. ఈక్విటీల్లో ఉన్న పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసుకుని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన విధానం కాదు. రిటైర్మెంట్ తర్వాత కూడా కొంత మొత్తాన్ని ఈక్విటీల్లో కొనసాగించాలి. అప్పటి వరకు సమకూర్చుకున్న ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నుంచి మీకు సగటు రాబడి వచ్చినా విశ్రాంత జీవనాన్ని సాఫీగా సాగించొచ్చు. ఇప్పటికైనా మించిపోయింది లేదు కనుక ఈక్విటీల్లో పెట్టుబడులు ప్రారంభించండి. ఒకటి రెండు ఫ్లెక్సీక్యాప్ (ఫోకస్డ్) ఫండ్స్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పెట్టుబడులను క్రమంగా (ఏటా) పెంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు కాంపౌండింగ్ ప్రయోజనం కనిపిస్తుంది. ఇప్పటి నుంచి వీలైనంత అధిక మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలని గుర్తుంచుకోవాలి. తగినంత ఇన్వెస్ట్ చేయనప్పుడు మీ అవసరాలకు సరిపడా నిధి ఎలా మారుతుంది? కనుక ఇప్పటి నుంచి వీలైనంత మేర దూకుడుగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లడమే ముందున్న మార్గం. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌లో మంచిది ఏదనే విషయంలో సందేహం నెలకొంది. ఏ పథకం మంచిది? – రమేష్ ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో పరిశీలించాల్సిన ముఖ్య అంశాలు రెండున్నాయి. ఒకటి ఎక్స్పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక అంతకంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. రెండోది ట్రాకింగ్ ఎర్రర్. ఒక ఇండెక్స్ ఫండ్.. తాను పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందన్నది ఇది చెబుతుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా చేసుకుని చూసిన తర్వాత నచ్చిన పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. - సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రిటైరయినా పనిచేస్తారా?
♦ ఇలా అనుకోవటం ప్రణాళికను వాయిదా వేయటానికే.. ♦ పక్కా ప్లానింగ్‌తో నిశ్చింతగా రిటైర్ కావొచ్చు ♦ ముప్ఫై.. నలభైలలో ఉన్నా సమయం మించిపోలేదు ♦ ప్రణాళికాబద్ధంగా రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవచ్చు ♦ పెట్టుబడి సాధనాలు,పురోగతి సమీక్ష ముఖ్యం రిటైర్మెంట్ ప్లానింగ్ అనగానే బోలెడన్ని ఆలోచనలొస్తుంటాయి. అన్నింటికన్నా ముందు... అసలు మనం ఎప్పటికీ రిటైరే కాము. ఏదో ఒకటి చేస్తూనే ఉంటామనే ఆలోచన వస్తుంది. నిజానికిది ప్లానింగ్‌ను మరికాస్త వాయిదా వేసుకునేందుకు మనకి మనం సర్ది చెప్పుకోవడం!!. అంతే తప్ప మరొకటి కాదు. సరిగ్గా పదవీ విరమణకు సమయం దగ్గర పడుతున్నప్పుడు... రిటైర్మెంట్ ప్లానింగ్ ఎంత ముఖ్యమో మెల్లగా అర్థం అవుతుంటుంది. సరే... ఏదైతేనేం.. ఎప్పుడైతేనేం.! ముప్ఫైలలో.. నలభయ్యో పడిలో ఉన్నా పర్వాలేదు. అస్సలంటూ చేయకుండా ఉండటం కన్నా ఆలస్యమైనా ఎప్పుడో ఒకప్పుడు ప్లానింగ్ ప్రారంభించడమే మంచిది. సరైన పెట్టుబడి అవకాశాలు గుర్తించి, అమలు చేయగలగడం, లక్ష్యం దిశగా పురోగతిని సమీక్షించుకుంటూ ఉండటం, సరైన నిర్ణయాలు తీసుకోగలగడం.. ఇవే రిటైర్మెంట్ ప్రణాళికలో కీలకం. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవసరం రిటైర్మెంట్ తర్వాత కూడా జాలీగా ఉండగలిగేందుకు వేసుకునే ప్రణాళిక ఒక్కనాటితో అయిపోదు. మెరుగుపడే మీ జీవన విధానాలు, అత్యవసరాలు, ఆరోగ్య పరిస్థితులు, జీవన ప్రమాణాలు ఇలాంటి వాటి ఆధారంగా దీన్ని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటూ, సమీక్షలు జరుపుకుంటూ ఉండాలి. కేవలం మీ జీవితాంతమే కాకుండా మీపైనే ఆధారపడిన జీవిత భాగస్వామి అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. క్రమంగా పెంచితేనే నిశ్చింత ఈ ప్లానింగ్‌లో సమయం చాలా కీలకం. రిటైర్మెంట్ నిధి కోసం ఎంత కేటాయించగలరనేది ముందుగా నిర్ణయించుకోండి. ఇప్పుడున్నట్లుగానే పొదుపు చేసుకుంటూ వెడితే.. లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చు! కాబట్టి.. కేటాయింపులను క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్లండి. ఆదాయం పెరిగే కొద్దీ స్థిరంగా అందులో కొంత శాతాన్ని రిటైర్మెంట్ నిధి కోసం కేటాయిస్తుండండి. షేర్లవైపూ చూడొచ్చు రిటైర్మెంట్ కోసం పెట్టుబడులనగానే.. ఫిక్సిడ్ డిపాజిట్లు, పింఛను ఫండ్లు లాంటి సంప్రదాయ ఇన్వెస్ట్మెంట్ సాధనాలే గుర్తొస్తుంటాయి. రిస్కులు, రాబడులను బేరీజు వేసుకుని సరైన సాధనాన్ని ఎంచుకోవడమూ కీలకమే. మీరు నలభైలలో ఉన్నా.. పదవీ విరమణకు మరో పదేళ్లు పైగా ఉంటుంది కాబట్టి.. స్టాక్ మార్కెట్లు, షేర్ల వైపు చూడొచ్చు. దశల వారీగా.. తొలి దశలో.. మీ రిస్కు సామర్థ్యానికి తగ్గట్లుగా చక్కని డైవర్సిఫికేషన్ అందించే మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ (సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేయండి. మిగతా సంప్రదాయ సాధనాల కన్నా మెరుగైన రాబడులు అందుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. మధ్యమధ్యలో పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుంటూ.. తగు మార్పులు, చేర్పులూ చేసుకుంటూ ఉండాలి. ఇక రెండో దశలో.. రిటైర్ అయ్యాక.. కూడా అదే ఫండ్స్‌లో మీ పెట్టుబడులు కొనసాగించవచ్చు. అదే సమయంలో ప్రతి నెలా మీ ఖర్చులకు ఎంత కావాల్సి ఉంటుందనేది చూసుకుని, ఈ పెట్టుబడుల నుంచి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) కొంత కొంతగా వెనక్కి తీసుకోవచ్చు. ఇలాంటి కాంబినేషన్‌ను ఎంచుకోవడం ద్వారా మీ పెట్టుబడి వేగంగా వృద్ధి చెందడంతో పాటు మీ అవసరాలకు తగ్గట్లుగా విత్‌డ్రా చేసుకునే వీలు కూడా కలుగుతుంది. ఆరోగ్యం.. అత్యవసరం.. పదవీ విరమణ తర్వాత కూడా జీవన విధానానికి ఢోకా లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు రిటైర్మెంట్ అనంతరం వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్యపరమైన సమస్యలను దీటుగా ఎదుర్కొనేందుకు తగిన హెల్త్ ప్లాన్ కూడా ఒకటి తీసుకోవడం శ్రేయస్కరం. అలాగే, ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినా హడావిడి పడకుండా ఉండేందుకు ప్రత్యేక నిధిని కూడా సమకూర్చుకుని ఉండటం మంచిది. రిటైర్మెంట్ ప్రణాళిక అమలుకు ఇవ్వాళా.. రేపు అంటూ లేదు. ఎప్పట్నుంచైనా మొదలుపెట్టొచ్చు. ఆ.. ఎప్పట్నుంచనేది.. ఇప్పట్నుంచే ప్రారంభిస్తే.. వీలైనంత సాఫీగా రిటైర్మెంట్ జీవితం గడిపేయొచ్చు. -
పీఎఫ్ చందాదారులకు శుభవార్త
-
పీఎఫ్ చందాదారులకు నెరవేరనున్న సొంతింటి కల
⇒ 90 శాతం వరకూ నిధులను వెనక్కి తీసుకునే వెసులుబాటు ⇒ ఈ మేరకు నిబంధనలను సవరించనున్న ప్రభుత్వం న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోని 4 కోట్ల మంది చందాదారులకు సంతోషం కలిగించే కబురును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంటి కొనుగోలుకు వారు తమ రిటైర్మెంట్ నిధి నుంచి 90 శాతం నిధులను వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పించనుంది. ఈ మేరకు ఉద్యోగుల భవిష్యనిధి పథకానికి సవరణలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభకు తెలిపింది. సవరణల తర్వాత ఈపీఎఫ్‌వో చందాదారులు తమ ఈపీఎఫ్ ఖాతాల నుంచి ఇంటి రుణ ఈఎంఐలు చెల్లించే అవకాశం కూడా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఈపీఎఫ్ చందాదారులకు మేలు కలిగించే చర్యగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పథకంలో మార్పులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ (ఈపీఎఫ్) పథకం, 1952లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు పారాగ్రాఫ్ 68బీడీని అదనంగా చేర్చనున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభకు వెల్లడించారు. ‘‘నూతన నిబంధన కింద ఈపీఎఫ్ చందాదారుడు కనీసం 10 మంది సభ్యులతో కూడిన కోపరేటివ్ సొసైటీ లేదా హౌసింగ్ సొసైటీలో సభ్యుడిగా ఉంటే... నివాస స్థలం లేదా ఫ్లాట్ లేదా నివాస భవన నిర్మాణం లేదా స్థలం కొనుగోలుకు తమ నిధి నుంచి 90 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు’’ అని దత్తాత్రేయ వివరించారు. ఈ పథకం కింద ఇంటి రుణ బకాయిలు, వడ్డీలను తమ ఈపీఎఫ్ ఖాతాల నుంచి నెలనెలా చెల్లించుకోవచ్చని కూడా మంత్రి పేర్కొన్నారు. కాగా, తాజా సవరణలో భాగంగా చేర్చనున్న పారాగ్రాఫ్‌ను ఇంకా ఖరారు చేయలేదని, కనుక దీని కింద ఎటువంటి లక్ష్యాలను నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు. 2016 మార్చి 31 నాటికి ఈపీఎఫ్ ఖాతాలు 17.14 కోట్లుగా ఉన్నాయని... 2015–16 ఆర్థిక సంవత్సరానికి సగటున 3.76 కోట్ల సభ్యుల నుంచి చందాలు వచ్చినట్టు సభకు మంత్రి తెలిపారు. -
యులిప్ సరెండర్ చేస్తే పన్ను చెల్లించాలా?
నేను ఒక మిత్రుడి ప్రోద్బలంతో 2011లో ఎల్ఐసీ పెన్షన్ ప్లాన్‌లో ఇన్వెస్ట్చేయడం ప్రారంభించాను. ఏడాదికి రూ.60,000 ప్రీమియమ్ చెల్లిస్తున్నాను. ఈ ప్లాన్ వడ్డిస్తున్న అధిక వ్యయాలు, చార్జీలను, ఈ పెన్షన్ ప్లాన్ పనితీరును చూస్తుంటే ఈ ప్లాన్ నుంచి వైదొలగడమే మంచిదని అనిపిస్తోంది. నా నిర్ణయం సరైనదేనా? – శివరామ్, విశాఖ పట్టణం ఎల్ఐసీ పెన్షన్ ప్లాన్ మీకు బీమా కవర్‌ను అందిస్తుంది. అంతేకాకుండా రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేయడం కోసం మీరు చెల్లించే ప్రీమియమ్‌లో కొంత భాగాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే ఇలాంటి హైబ్రిడ్ ఉత్పత్తులు తగిన బీమా రక్షణను, మెరుగైన రాబడులను ఇవ్వలేవు. అందుకని ఈ తరహా ప్లాన్ల నుంచి వైదొలగడం మంచి నిర్ణయమే. సంబంధిత ఏజెంట్‌ను సంప్రదించి ఈ ప్లాన్ సరెండర్‌కు సంబంధించి విధి విధానాలను తెలుసుకోండి. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ బీమాను, ఇన్వెస్ట్‌మెంట్‌ను కలగలపకండి. జీవిత బీమా కోసం టర్మ్ బీమా పాలసీని ఎంచుకోండి. టర్మ్ బీమా పాలసీల్లో ప్రీమియమ్ తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. ఇక రిటైర్మెంట్ నిధి ఏర్పాటు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం వంటి దీర్ఘకాలిక ఆర్ధిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి రాబడులు పొందవచ్చు. మీరు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయండి. ప్రభుత్వం స్పాన్సర్ చేసిన రిటైర్మెంట్ ప్లాన్ కావాలనుకుంటే నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌ఎపీఎస్)ను పరిశీలించవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే మరిన్ని పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. నేను 2011లో ఒక యులిప్ పాలసీ తీసుకున్నాను. ఐదేళ్ల తర్వాత ఆ పాలసీని సరెండర్ చేశాను. సరెండర్ చేసిన తర్వాత వచ్చిన మొత్తంపై నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? – మోహన్, హైదరాబాద్ పన్ను పరంగా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీల(యులిప్స్)ను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలుగానే వ్యవహరిస్తారు. అంటే జీవిత బీమా పాలసీలకు వర్తించే పన్ను నియమనిబంధనలే యులిప్‌లకు కూడా వర్తిస్తాయి. మీరు తీసుకున్న యులిప్‌లకు ఐదేళ్ల లాక్–ఇన్ పీరియడ్ ముగిసింది. అందుకని మీరు పొందిన సరెండర్ విలువపై ఆదాయపు పన్ను చట్టం ,సెక్షన్ 10(10డి) ప్రకారం ఎలాంటి పన్ను భారం ఉండదు. మీరు చెల్లించిన ప్రీమియమ్లకు సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు పొందినా, పొందకున్నా ఇది వర్తిస్తుంది. నా వయస్సు 29 సంవత్సరాలు. నా నెల జీతం రూ.20,000. నాకు ఇటీవలే పెళ్లి అయింది. నా తల్లిదంద్రులు నాతోనే ఉంటారు. నేను ఎల్ఐసీ జీవన్ సరళ్ పాలసీ తీసుకున్నాను. టర్మ్ బీమా పాలసీ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. – వివేక్, కరీంనగర్ జీవన్ సరళ్ పాలసీ అనేది ఎండోమెంట్ ప్లాన్, ఈ తరహా ప్లాన్లు తక్కువ బీమా కవర్‌ను ఇస్తాయి. వ్యయాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించవు. మీకు నష్టాలు వచ్చినప్పటికీ, ఈ పాలసీని సరెండర్ చేయడమే ఉత్తమం. టర్మ్ బీమా పాలసీ తీసుకోవాలనుకోవడం మంచి నిర్ణయమే. బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను, చెల్లించాల్సిన ప్రీమియమ్‌లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే టర్మ్ పాలసీ తీసుకోవాలి. ఈ అంశాల పరంగా చూస్తే మీరు,... ఏగాన్ రెలిగేర్ ఐటర్మ్ ప్లాన్, మ్యాక్స్‌లైఫ్ ఆన్లైన్ టర్మ్ ప్లాన్, భారతీ ఆక్సా లైఫ్ ఈప్రొటెక్ట్.. ఈ పాలసీలను పరిశీలించవచ్చు. ఇవన్నీ ఆన్లైన్ టర్మ్ పాలసీలు. మీ వయస్సుకు, రూ.50 లక్షల టర్మ్ పాలసీకి చెల్లించాల్సిన వార్షిక ప్రీమియ్లు–ఏగాన్ రెలిగేర్ ఐటర్మ్ప్లాన్కు రూ.4,560, మ్యాక్స్ లైషఫ్ ఆన్లైన్ టర్మ్ ప్లాన్‌కు రూ.4,150, భారతీ ఆక్సా లైఫ్ ఈ ప్రొటెక్ట్‌కు రూ.4,000 చొప్పున ఉన్నాయి. (ఆరోగ్య వంతుడైన పొగ త్రాగని వ్యక్తికి ఈ ప్రీమియమ్‌లు వర్తిస్తాయి) టర్మ్ బీమా పాలసీ తీసుకునేటప్పుడు అన్నీ సరైన వివరాలు వెల్లడించడమే ఉత్తమం. ఇలా చేస్తే, పాలసీ క్లెయిమ్ చేసుకోవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. నేను సీనియర్ సిటిజన్‌ను, నాకు పన్నుచెల్లించే ఆదాయం లేదు. అయితే గత ఆర్థిక సంవత్సరానికి గాను ఈక్విటీ మ్యూచువల్ పండ్ విక్రయాల ద్వారా రూ.4 లక్షల దీర్ఘకాలిక మూలధన లాభాలు వచ్చాయి. నేను ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాల్సి ఉంటుందా? – పరంధామ్, విజయవాడ సీనియర్ సిటిజన్ల ఆదాయం నిర్దేశిత పరిమితికి మించితే ఆదాయపు పన్ను రిటర్న్‌లు తప్పకుండా దాఖలు చేయాలి. 2015–16 సంవత్సరానికి ఈ నిర్దేశిత పరిమితి రూ.3 లక్షలుగా ఉంది. మీరు పొందిన దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.4లక్షలు. సీనియర్ సిటిజన్లకు నిర్దేశించిన ఆదాయ పరిమితిని(రూ.3 లక్షలు) మించినందున మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌లను తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఎలాంటి పన్నులేదు. మీరు పన్ను ఏమీ చెల్లించాల్సిన అవసరం లేకున్నప్పటికీ, ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయండి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్


