త్వరగా రిటైర్‌ అవుదామనుకుంటున్నా.. రిటైర్మెంట్‌ ఫండ్‌ ఎలా? | Retirement Planning: How To Make Your Retirement Fund In Early Stage?- Sakshi
Sakshi News home page

త్వరగా రిటైర్‌ అవుదామనుకుంటున్నా.. రిటైర్మెంట్‌ ఫండ్‌ ఎలా?

Published Mon, Feb 5 2024 8:55 AM | Last Updated on Mon, Feb 5 2024 1:10 PM

retiring early how to set retirement fund - Sakshi

నా వయసు 35 ఏళ్లు? 55 ఏళ్లకే రిటైర్‌ అవుదామని అనుకుంటున్నాను. ఆ సమయానికి రిటైర్మెంట్‌ ఫండ్‌ను సిద్ధం చేసుకోవడం ఎలా?     – కీర్తిలాల్‌ 

మీ రిటైర్మెంట్‌కు ఇంకా 20 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంది. 55 లేదా 60 ఏళ్లకు రిటైర్‌ అవుదామని అనుకుంటే పెట్టుబడులకు ఇంకా 20–25 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంటుంది. ఈక్విటీలో పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఈ సమయం చాలు. మీరు ఏ వయసులో రిటైర్‌ అయినా.. ఈక్విటీ పెట్టుబడులకు రిటైర్మెంట్‌ లేదని గుర్తు పెట్టుకోవాలి. 

ఈక్విటీల్లో ఉన్న పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసుకుని డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన విధానం కాదు. రిటైర్మెంట్‌ తర్వాత కూడా కొంత మొత్తాన్ని ఈక్విటీల్లో కొనసాగించాలి. అప్పటి వరకు సమకూర్చుకున్న ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నుంచి మీకు సగటు రాబడి వచ్చినా విశ్రాంత జీవనాన్ని సాఫీగా సాగించొచ్చు. ఇప్పటికైనా మించిపోయింది లేదు కనుక ఈక్విటీల్లో పెట్టుబడులు ప్రారంభించండి. ఒకటి రెండు ఫ్లెక్సీక్యాప్‌ (ఫోకస్డ్‌) ఫండ్స్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. 

ఆ తర్వాత పెట్టుబడులను క్రమంగా (ఏటా) పెంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు కాంపౌండింగ్‌ ప్రయోజనం కనిపిస్తుంది. ఇప్పటి నుంచి వీలైనంత అధిక మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలని గుర్తుంచుకోవాలి. తగినంత ఇన్వెస్ట్‌ చేయనప్పుడు మీ అవసరాలకు సరిపడా నిధి ఎలా మారుతుంది? కనుక ఇప్పటి నుంచి వీలైనంత మేర దూకుడుగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లడమే ముందున్న మార్గం.   

నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్‌లో మంచిది ఏదనే విషయంలో సందేహం నెలకొంది. ఏ పథకం మంచిది?     – రమేష్‌ 

ఇండెక్స్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో పరిశీలించాల్సిన ముఖ్య అంశాలు రెండున్నాయి. ఒకటి ఎక్స్‌పెన్స్‌ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్‌ ఫండ్స్‌ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్‌ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్‌పెన్స్‌ రేషియోకే ఇండెక్స్‌ ఫండ్స్‌ డైరెక్ట్‌ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక అంతకంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. రెండోది ట్రాకింగ్‌ ఎర్రర్‌. 

ఒక ఇండెక్స్‌ ఫండ్‌.. తాను పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందన్నది ఇది చెబుతుంది. ఇండెక్స్‌ ఫండ్‌ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్‌పెన్స్‌ రేషియోతోపాటు.. ట్రాకింగ్‌ ఎర్రర్‌ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా చేసుకుని చూసిన తర్వాత నచ్చిన పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు.  

- సమాధానాలు: ధీరేంద్ర కుమార్‌, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement